తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నడకుట్టుపట్టి లో రెండేళ్ల సుజీత్ బోరు బావి లో పడ్డాడు. సుజీత్ ను కాపాడేందుకు సహాయచర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే, సుజీత్ ను కాపాడేందుకు ఇంకా సుమారుగా 12 గంటలు పడుతుందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. సుజీత్ ఆరోగ్యం స్థిమితంగానే ఉందని వారు చెప్తున్నారు.

బోరు బావి కి సమాంతరంగా ఒక గుంతను సహాయక బృందాలు తవ్వుతున్నారు. “40 నుంచి 50 అడుగులు గుంతను తవ్వుతున్నాం. కామెరాల సహాయంతో సుజీత్ పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం, ఇంకా కిందకు జారకుండా ఉంటాడని ఆశిస్తున్నాం” అని సీనియర్ ప్రభుత్వ అధికారి అన్నారు.

శుక్రవారం సాయంత్రం సుమారు 5.30 నిమిషాలకు సుజీత్, తన అన్నయ్యతో కలిసి ఆడుకుంటుండగా బోరుబావిలో పడ్డాడు. ఆ బోరుబావి 600 అడుగుల లోతు ఉంటుంది అని కొందరు అంటే, కొందరు 1000 అడుగులు పైగా ఉంటుందని అంటున్నారు.

మొదట 26 అడుగులలో పడ్డ సుజీత్, సహాయక చర్యలు ప్రారంభం అయ్యాక 87 అడుగుల లోతుకి పడిపోయాడు. అధికారులు సుజీత్ కి ఆక్సిజన్ అందిస్తున్నా శుక్రవారం సాయంత్రం నుంచీ భోజనం, నీరు లేకుండానే ఉన్నాడు.

సుజీత్ తల్లి దర్జీ, తండ్రి నిర్మాణ కార్మికుడు. వారికి ఇద్దరు పిల్లలు, సుజీత్ చిన్నవాడు. ఆ బోరుబావి 7 సంవత్సరాల క్రితం తవ్వింది. అందులో నీరు లేకపోవడంతో, దానిని మూసివేసే ప్రయత్నం కూడా చేసారు.

ట్విట్టర్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలలో సుజీత్ చిత్రాలను షేర్ చేస్తూ అతను క్షేమంగా బయట పడాలని ప్రార్ధిస్తున్నారు.

“దేశమంతా దీపావళి జరుపుకుంటుండగా, తమిళ నాడులో మాత్రం సుజీత్ ను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాబు త్వరగా బయటకు వచ్చి తన తల్లిదండ్రులను చేరాలని ప్రార్ధిస్తున్నా” అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఈ ఉదంతంపై కమల్ హాసన్, రజనీ కాంత్ అవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పనీర్ సెల్వం ఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు.

సత్య ప్రియ బి.ఎన్

2 comments on "సేవ్ సుజీత్: ఇంకా 12 గంటలు బోరుబావిలోనే చిన్నారి"

  • Na.abhiprayam.fast.think.boru.bavulu.unnachotu.pillalanu.jagrartaga.chusukovali.nirlaksyam.valla.ila.jarugutunnavi.chubandi.a.chinni.pranam.mrutyuvuto.poradi.prnalu.kolpoyadu.

Comments are closed.