రాజద్రోహం ఆరోపణలతో సౌదీ అరేబియాలో ఏకంగా ముగ్గురు రాకుమారులను అనూహ్యంగా రాజు నిర్బంధంలోకి తీసుకోవడం ప్రకంపనలు సృష్టించింది. తిరుగుబాటుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలతో సౌదీ రాజు సల్మాన్‌ సోదరుడు ప్రిన్స్‌ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌, సన్నిహిత బంధువు ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ నయేఫ్‌, ఆయన సోదరుడు ప్రిన్స్‌ నవాఫ్‌ బిన్‌ నయేఫ్‌లను అరెస్టు చేశారు.

తిరుగుబాటుకు పాల్పడతున్నారనే ఆరోపణలతో రాజ కుటుంబానికి చెందిన ఈ ముగ్గుర్ని సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అమెరికా మీడియా వెల్లడించింది. తాను ఎంత శక్తివంతుడినో మరోసారి ఈ ఘటనతో సౌదీ పాలకుడు నిరూపించుకున్నారు. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని శుక్రవారం ఉదయం వారి నివాసాల నుంచి బ్లాక్ క్లాడ్ రాయల్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. గతంలో సౌదీ సింహాసనం కోసం తీవ్రంగా పోటీపడిన ఈ ఇద్దరూ ప్రస్తుత రాజును పదవీచిత్యుడి చేయడానికి కుట్ర పన్నారని రాయల్ కోర్టు ఆరోపించింది. వారికి యావజ్జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష విధించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్యా, న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురించాయి.

 Saudi royal family Arrests

అయితే, ఈ వార్తలపై సౌదీ అధికార వర్గాలు మాత్రం ఇంత వరకూ స్పందించలేదు. తాజా నిర్బంధాలతో ప్రముఖ మతపెద్దలు, ఉద్యమకారులు, యువరాజులు, వ్యాపార వర్గాలను సౌదీ రాజు జైలుకు పంపి అధికారంపై పట్టు నిలుపుకున్నారనే అంశాన్ని విశదీకరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగీ హత్యకేసులోనూ మొహమ్మద్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే పలు కీలక ప్రభుత్వ విభాగాలను తన స్వాధీనంలోకి తెచ్చుకున్న సౌదీ రాజు.. తన తండ్రి నుంచి అధికారం బదిలీ కావడానికి ముందు దేశంలో అంతర్గత అసమ్మతికి కారణమైనట్టు అప్పట్లో ఆరోపణలు బలంగా వినిపించాయి.

మరోవైపు కరోనా వైరస్ ప్రభావంతో ఉమ్రాకు వచ్చే విదేశీయుల ప్రవేశాన్ని గత గురువారం సౌదీ నిలిపివేసింది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మదీనా, మక్కా రెండూ సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు ఏడాది పొడవునా లక్షలాది సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. ఇప్పుడు కరోనా భయంతో ఆ యాత్రికులను నిలిపేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.