ఆస్ట్రేలియాలో చెలరేగుతున్న దావాగ్ని.. న్యూజీలాండ్‌పై ఎఫెక్ట్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2019 6:22 AM GMT
ఆస్ట్రేలియాలో చెలరేగుతున్న దావాగ్ని.. న్యూజీలాండ్‌పై ఎఫెక్ట్‌..!

న్యూ సౌత్ వేల్స్: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్ ల్యాండ్‌లలో దావాగ్ని చెలరేగుతోంది. అడవుల్లో రాజుకున్న అగ్గి మిన్నంటుతోందా అన్నట్టుగా ఉంది. దీని వల్ల ఉత్పన్నమవుతున్న పొగ, ధూళి టాస్మన్ నదిమీదుగా న్యూజీల్యాండ్‌లోని ఉత్తర భూభాగానికి వేగంగా విస్తరిస్తోంది. ఎస్.ఎన్.పి.పి - వి.ఐ.ఐ.ఆర్.ఎస్ ఉపగ్రహం ద్వారా అందిన చిత్రాల్లో ఈ విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్.ఐ.డబ్ల్యూ.ఎ వెదర్ అందించిన సమాచారం ప్రకారం దావాగ్నివల్ల ఉత్పన్నమైన ధూళి ఉత్తర భూభాగం మీదుగా వేగంగా విస్తరిస్తోంది. వేగవంతమైన గాలులు వీయడంవల్ల మరో 48 గంటల్లో దీని తీవ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్త డకోటా స్మిత్, అడవుల దగ్ధం కావడంవల్ల ఉత్పన్నమైన పొగ కారణంగా ఆస్ట్రేలియాలోని తూర్పుతీర ప్రాంతంలో ఏర్పడిన భయానకమైన వాతావరణానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశారు.

Engulf

చిత్రం 1 : న్యూ సౌత్ వేల్స్ తూర్పు ప్రాంతాన్ని చుట్టుముట్టిన పొగ, దగ్ధమవుతున్న అడవులు

Smoky

చిత్రం 2 : న్యూ సౌత్ వేల్స్ తూర్పు ప్రాంతాన్ని కమ్మేసిన పొగ

ఉత్తర భూభాగంలో ఉన్న పట్టణాలన్నింటినీ పూర్తిగా నల్లటి దట్టమైన పొగ, ధూళి ఆవరించాయి. ఈ పొగ, బూడిద మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల న్యూజీలాండ్ లో ఆకాశం ఎర్రగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్ లో విస్తృత స్థాయిలో కనిపిస్తున్నాయి.





సిడ్నీనుంచి బ్రిస్ బ్రేన్ వెళ్తుండగా ఆ మహిళ విమానంలోంచి ఈ చిత్రాలను తీసింది. అడవులు తగలబడడంవల్ల ఉత్పన్నమైన పొగ ఆకాశాన్నంటుతున్నట్టుగా భయంగొలిపే రీతిలో కనిపించింది.

మొత్తంగా ఆస్త్రేలియాలో 130 ప్రదేశాల్లో ఈ విధంగా దట్టమైన అడవులు దగ్ధమైనట్టుగా సమాచారం. ఇప్పటివరకూ ఈ అగ్నిప్రమాదం వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దాదాపు 150 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనట్టు సమాచారం.

వాతావరణం పొడిగా ఉండడం, గాలులు వేగంగా వీయడంవల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు అగ్నికి ఆహుతి కావడం ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని కరవు పరిస్థితులవల్ల ఎండాకాలంలో మరింత ఎక్కువగా ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారముంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Vizag Red Sky 2

ఈ వారంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కూడా ఆకాశం ఎర్రగా మారిపోయింది. హైదరాబాద్ కు చెందిన ఒక వాతావరణ అధ్యయనవేత్త ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం సమయంలో కనిపించిన ఎర్రటి ఆల్టో క్యుములస్ మేఘాలను ఫోటోలు తీసి అందించారు. వాతావరణంలో తేమశాతం ఎక్కువ కావడంవల్ల మేఘాలు ఎర్రటి రంగు పులుముకున్నాయని నిపుణుల అంచనా.

Next Story