ఢిల్లీ వాయు కాలుష్యం దేశంలోని ఇతర ప్రాంతాలకు పాకవచ్చని ఉపగ్రహ చిత్రాల సూచన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 7:26 AM GMT
ఢిల్లీ వాయు కాలుష్యం దేశంలోని ఇతర ప్రాంతాలకు పాకవచ్చని ఉపగ్రహ చిత్రాల సూచన

ఢిల్లీలో వాయుకాలుష్యం ఇప్పుడు దేశమంతా పాకుతోంది. దేశంలోని చాలా ప్రాంతాలు ఈ కాలుష్యం బారిన పడబోతున్నాయని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర భారతంలో పంట పొలాల్లోని వ్యర్థాలను తగలబెట్టే ప్రక్రియ ఇప్పుడు దేశం మొత్తానికీ కాలుష్యాన్ని పంచుతోందని హిమవారి ఉపగ్రహ చిత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ చిత్రాల్లో కనిపించే దృశ్యాలనుబట్టి వాయు కాలుష్యం ఉత్తర భారతం నుంచి మెల్లగా దేశమంతా విస్తరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారతానికి ఎక్కువగా దీని ముప్పు పొంచి ఉంది. దీనికిమించి తుపాను ముప్పుకూడా పొంచిఉన్నట్టుగా ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి.

అక్టోబర్ 20 నుంచి నవంబర్ 8వ తేదీ 2019 వరకూ హిమవారి ఉపగ్రహం అందించిన భారత్ లో వాయుకాలుష్యం చిత్రాలు



ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. వారం రోజులనుంచీ ఢిల్లీని చుట్టుముట్టిన ఈ వాయు కాలుష్యం గడచిన 24 గంటల్లో మరింతగా పెరిగిందని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గంగా పరీవాహక ప్రాంతంతోపాటుగా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకూ కాలుష్యం పెద్ద ఎత్తున విస్తరిస్తోందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్( సిఇఇడబ్ల్యూ) అధ్యయనాల్లో స్పష్టమయ్యింది. నవంబర్ ఒకటో తేదీన గడచిన మూడుసంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువగా లక్నోలో వాయుకాలుష్యం స్థాయి రికార్డయ్యింది. గంగా పరీవాహక ప్రాంతంలో దీని స్థాయి మరింత ఆందోళనకరంగా ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో గాలిలో ధూళిశాతం, కర్బన కాలుష్యం శాతం బాగా ఎక్కువైపోయిందని వాతావరణ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి వాలుగావీయడంవల్ల ఈ కాలుష్యం ఉత్తర భారతంనుంచి పెద్దఎత్తున తూర్పు తీరానికి, దక్షిణాదికి విస్తరిస్తోందని ప్రముఖ వాతావరణ విశ్లేషకులు ప్రదీప్ గౌడ్ మాచర్ల చెబుతున్నారు. స్థానికంగా మితిమీరిన వాహనాలు వినియోగం, పరిశ్రమలవల్ల ఏర్పడుతున్న కాలుష్యంతోపాటుగా పంటపొలాల్లో వ్యర్థాలను తగలబెట్టడంవల్ల పెరిగిన పొగ వాతావరణంలో చేరి పొగమంచుగా మారి, గాలిలో ధూళి, కర్బన సాంద్రతలు విపరీతంగా పెరిగిపోయాయి.

Air Pollution1

సిఇఇడబ్ల్యూ అందించిన నివేదిక ప్రకారం ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ దారులను సంప్రదించి పలు విడతలుగా వ్యవసాయ భూముల్లోని సాగు వ్యర్థాలను మండించే ప్రక్రియను కొనసాగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయని పక్షంలో ఢిల్లీలో వాయుకాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది. నిజానికి మితిమీరిన వాహనాల వినియోగంవల్ల ఉత్పన్నమవుతున్న కర్బన వ్యర్థాలతో కూడిన గాలి ఢిల్లీని పూర్తిగా చుట్టుముడుతోంది. వ్యవసాయదారులవల్ల ఏర్పడుతున్న కాలుష్యం కూడా దీనికి తోడవడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోందని అంచనా.



తమిళనాడులోని వాతావరణ శాఖ నిపుణుల సూచనల ప్రకారం మరో వారం రోజుల్లో ఉత్తర భారతాన్ని చుట్టుముట్టిన వాయు కాలుష్యం పూర్తి స్థాయిలో దక్షిణాదికి చేరుతుందని, చెన్నె చుట్టు పక్కల ప్రాంతాలు, హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలకు ఈ కాలుష్యం మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఢిల్లీతోపాటుగా మిగతా మెట్రో నగరాల్లో తీవ్ర స్థాయిలో పెరిగిపోయిన వాయుకాలుష్యాన్ని గుర్తించి జాతీయ స్థాయిలో వెంటనే ఆరోగ్యపరమైన ఆత్యయిక పరిస్థితిని విధించాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ నిపుణుల భావన. ముఖ్యంగా దేశ రాజధానిలో ఈ పని వెంటనే చేయాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.



వాయుకాలుష్యం అంశంపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు

ఇదిలా ఉండగా జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో, మిగతా మెట్రో నగరాల్లో విస్తరించిన వాయు కాలుష్యంపై విచారణ చేపట్టింది. ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై ఢిల్లీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయ దారులను సంప్రదించి వెంటనే సాగు భూముల్లో వ్యర్థాలను తగలబెట్టే ప్రక్రియను ఆపించాల్సిందిగా సుప్రీం ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది.

ఉన్నపళంగా సాగు భూముల్లో వ్యర్థాలను మండించే ప్రక్రియను ఆపించలేకపోతే జరిగే అనర్థాలకు ఢిల్లీ ప్రభుత్వంతోపాటుగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. సాగు భూముల్లో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఆపించలేకపోయినందుకుగాను ఎదురైన కాలుష్యంవల్ల జరిగిన, జరుగుతున్న నష్టానికి పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు నష్ట పరిహారం

ఎందుకు చెల్లించకూడదో తెలపాలంటూ అత్యున్నత న్యాయస్థానం వివరణ కోరింది. దేశాన్ని పెద్ద ఎత్తున చుట్టుముట్టిన వాయు కాలుష్యానికి సంబంధించిన జస్టిస్ అరుణ్ మిశ్రా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏటా పదినుంచి పదిహేను రోజులపాటు దేశం యావత్తూ ఈ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోందని, దీనిని నివారించేందుకు ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ చూపించడంలేదని ఆయన అన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు మూకుమ్మడిగా సాగుభూముల్లో వ్యర్థాలను మండించే ప్రక్రియను ఒకేసారి చేపట్టడాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, అయినప్పటికీ రైతుల చర్యలను పూర్తి స్థాయిలో అరికట్టడానికి వీలవడంలేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ డైరెక్టర్ సునీత నారాయన్ చెబుతున్నారు. ఇలాంటి ఆత్యయిక పరిస్థితి ఎదురైనప్పుడు ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయడంమినహా మరో దారి కనిపించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

Next Story