అబైడ్ విత్ మీ ని చాలా మిస్సవుతున్నాం : క్రైస్తవ సంఘాలు
By రాణి Published on 21 Jan 2020 8:07 AM GMTముఖ్యాంశాలు
- అబైడ్ విత్ మీ గీతం ప్లే లిస్ట్ నుంచి తొలగించిన ప్రభుత్వం
- రిట్రీట్ సెరిమనీ ప్లే లిస్ట్ లో ఆ స్థానంలో మరో కొత్త గీతం
- దీనిపై క్రిస్టియన్ కమ్యూనిటీ అభ్యంతరాలు, విచారం
- అన్న చర్చ్ ల్లోనూ ఇది చాలా పాపులర్ ప్రార్థనా గీతం
- ఈసారి ప్లే లిస్ట్ లో సారే జహాసే అచ్ఛా దేశభక్తి గీతం
- ఇకపై అంచెలంచెలుగా ప్లే లిస్ట్ లో అన్నీ దేశ భక్తి గీతాలే
రిపబ్లిక్ డే పరేడ్ లో చివర్లో బీటింగ్ రిట్రీట్ సెరిమనీలో అబైడ్ విత్ మీ గీతాన్ని ప్లే లిస్ట్ నుంచి తొలగించడంపై క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా బాధను వ్యక్తం చేస్తోంది. ఈ గీతాన్ని తొలగిస్తూ హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడం క్రైసవ సంఘాలకు ఏమాత్రం నచ్చలేదు. ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కాలరాచి ఉద్దేశపూర్వకంగానే తమ కమ్యూనిటీకి అన్యాయం చేస్తున్నారంటూ కొందరు క్రైస్తవ మత ప్రబోధకులు, ప్రముఖులు బాధను వ్యక్తం చేస్తున్నారు. రోజంతా తీవ్రంగా యుద్ధం చేసి అలసిసొలసిన జవాన్లు చీకటి పడ్డాక తిరిగి తమ శిబిరాలకు వెళ్లే సమయంలో వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు, వారికి అలసట తెలియకుండా చేసేందుకు బీటింగ్ సెరిమనీ ఆర్మీలో ఏళ్లుగా ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని వీర జవాన్లకు, పౌరులకు గుర్తుచేసేందుకు రిపబ్లిక్ డే పరేడ్ లో చివరన తప్పనిసరిగా ఈ సెరిమనీని ఏర్పాటు చేస్తారు.
1950 నుంచీ ప్లే లిస్ట్ లో ఉన్న అబైడ్ విత్ మీ గీతం
త్రివిధ దళాలకు, సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ కీ చెందిన జవాన్లు ఢిల్లీలోని విజయ్ చౌక్ లో బీటింగ్ సెరిమనీ నిర్వహిస్తారు. దీనికి అర్థం ఏంటంటే రిపబ్లిక్ డే వేడుకలు ముగిసినట్టు. 1950నుంచీ అబైడ్ విత్ మీ గీతం ఈ సెరిమనీ ప్లే లిస్ట్ లో భాగంగా ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆ గీతాన్ని ప్లే లిస్ట్ నుంచి తొలగిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఆ పాట స్థానంలో సారే జహాసే అచ్ఛా గీతాన్ని ప్లే చేయబోతున్నారు. అలాగే మరికొన్ని పాత గీతాలను కూడా తొలగించి వాటి స్థానంలో దేశ భక్తి గీతాలను చేర్చారు. దాదాపుగా ఇలా అంచెలంచెలుగా ముప్ఫై నుంచి ముప్ఫై ఐదు గీతాలను సంవత్సరానికి కొన్ని చొప్పున మార్చుకుంటూ పోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిస్థాయిలో కేవలం జాతీయ భావనలు, స్ఫూర్తి మాత్రమే ఉండే గీతాలను పూర్తిగా బీటింగ్ రిట్రీలో చేర్చాలన్న నిర్ణయం జరిగడంవల్ల ఈ మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి.
19వ శతాబ్దంలో స్కాటిష్ పోయెట్ హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ రాసిన ఈ గీతానికి విలియం హెన్రీ మాంక్ సంగీతాన్ని అందించాడు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ అన్ని చర్చ్ ల్లోనూ ప్రముఖ ప్రార్థనా గీతంగా, బాగా పాపులర్ అయిన ప్రార్థనా గీతంగా ఈ హిమ్న్ తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. ఆఖరికి రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత జరిగే బీటింగ్ సెరిమనీలోకూడా దీనికి స్థానం ఉండేది. కానీ తాజా నిర్ణయంవల్ల ఈ గీతాన్ని పరేడ్ లో వినే భాగ్యాన్ని కోల్పోయామని క్రైస్తవ సంఘాలు బాధపడుతున్నాయి.