ముగిసిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2020 8:28 AM GMT
భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహాన్ని అశ్రునయనాలతో.. సైనిక అధికార లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. సూర్యాపేటలోని కేసారంలో ఉన్న సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సంతోష్ కుమారుడు అనిరుధ్ చిన్న వయసు కావడంతో సంతోష్ తండ్రి ఉపేందర్ తోడు రాగా.. అనిరుధ్‌తో తలకొరివి పెట్టించారు. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్ రెజిమెంట్ బృందం పాల్గొంది. గౌరవార్థం గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులు అర్పించారు.
అంతముందు విద్యానగర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, పాత బస్టాండ్, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు కొనసాగింది. సంతోష్ బాబును చివరిసారిగా చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. సంతోష్ బాబు అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు కల్నల్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి అంత్యక్రియలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు. కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.