క్రిస్మస్ తాత గురించి నిజం చెప్పేసిన.. గూగుల్ తాత

By Newsmeter.Network  Published on  13 Dec 2019 6:45 AM GMT
క్రిస్మస్ తాత గురించి నిజం చెప్పేసిన.. గూగుల్ తాత

క్రిస్మస్ అంటే ఎర్రెర్రని డ్రస్టు, తెలతెల్లని గడ్డం, పెద్ద పేద్ధ నవ్వులతో రెయిన్ డీర్ల స్లిడ్జిపై వచ్చి మనింటి తలుపు తట్టి బజ్జున్న బుజ్జాయిల బెడ్డు మీద గిఫ్టులు ఇచ్చే సాంటా క్లాజ్ గుర్తుకు రావడం తప్పని సరి. ప్రతి క్రైస్తవుడి బాల్యం క్రిస్మస్ తాత కథలతో నిండి ఉంటుంది. కళ్లలో వత్తులు వేసుకుని తాత రాక కోసం ఎదురు చూపులు, తాత ఇచ్చి వెళ్లే గిఫ్టులను చూసుకుని మురిసి పోవడం అందరి బాల్యంలో అంతర్భాగం. పిల్లందరికీ సాంటా అంటే ఎంతో అభిమానం.

కానీ ఇప్పుడు క్రిస్మస్ తాత కేవలం ఒక కాల్పనిక కథ మాత్రమే అని పాశ్చాత్య దేశాలలో ఎక్కువమంది బావిస్తున్నారు. బెత్లెహేంలో పుట్టిన శిశువు కథకి, ఎక్కడో అల్ప్స్ పర్వతాలకు చెందిన తాత కి ఏమిటి సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారట. అంతే కాదు. ఇంటర్నెట్ సెర్చిలో ఎవరైనా “క్రిస్మస్ తాత” గురించి టైప్ చేస్తే “సాంటా క్లాజ్ ఈజ్ నాట్ రియల్” అంటూ పిల్లల కలల్ని చెరిపేసే కథనాలు దర్శనమిస్తున్నాయి. దాంతో తాత ఒక కట్టుకథ అని తెలుసుకుని పిల్లలు నిరాశపడిపోతున్నారట. ఊహలన్నీ తారుమారై ఉస్సూరుమంటున్నారట. గూగుల్ నిజాలు నిర్మొహమాటంగా చెప్పేయడంతో పసి మనసులు గాయపడిపోతున్నాయట.

అయినప్పటికీ ఇంటర్నెట్ లో పిల్లలు “సాంతా తాత వయసెంత?”, “సాంతా తాత నివసించే ఉత్తర ధ్రువం ఎంత దూరంలో ఉంది” వంటి ప్రశ్నలతో గూగుల్ తాతను విసిగించేస్తున్నారట. నిజమే... కల్లలైనా కొన్ని కలలు కలలుగానే ఉండటం మంచిది. లేకపోతే పిల్లల కళ్లు.. కలలు కనడం మానేస్తాయి.

Next Story