టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా మెహందీ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మీర్జా సోదరిలద్దరూ డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. తమదైన వస్ర్త ధారణతో ఆ ఇద్దరూ అందరినీ ఆకట్టుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. మెహందీ వేడుకలో కొత్తపెళ్లి కూతురు ఆనమ్ మీర్జా హొయలు పోయింది. చిలకపచ్చరంగు డిజైనర్ లెహంగా, లేత నీలంరంగు కలిగిన ఓణీలో ఆమె ధగధగా మెరిసిపోయింది. సానియా కూడా డిజైనర్ వేర్ లో మెరుపుతీగలా కనిపించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అక్కచెళ్లెళ్లు తమ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసుకున్నారు. ”జీవితం సాగిపోతుంటుంది. అద్భుతమనిపించే మధుర క్షణాలు కొన్ని ఉంటాయి. వారంరోజులుగా నేను వాటిని ఆస్వాదిస్తున్నాను. మెహందీ వేడుకలో నాచుట్టూ ఉన్న ప్రాణ మిత్రులు, కుటుంబ సభ్యులను చూసి నేనెంత అదృష్టవంతురాలినో తెలుసుకున్నా” అని ఆనమ్ తన ఇన్ స్టా ఖాతాలో రాశారు.

ఈ నెల 12వ తేదీ హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ కుమారుడితో ఆనమ్ మీర్జా వివాహం జరగనుంది. వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించిన మెహందీ వేడుక ఘనంగా జరిగింది. మంగళవారం సానియా మీర్జా, అజహరుద్దీన్, అసదుద్దీన్ లు సీఎం కేసీఆర్ ను కలిసి మర్యాదపూర్వకంగా ఈ వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే ఇతర రాజకీయ, సినీ ప్రముఖులకు వివాహ ఆహ్వానాలు అందాయి. గురువారం అసద్, ఆనమ్ ల పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. ఈ కొత్త జంటకు ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని వేలమంది కొత్త జీవితానికి ఆనందంగా స్వాగతం చెప్పండి అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.