నాలుగు నెలలు.. 26 కేజీలు.. టార్గెట్ రీచ్.. మీరు కూడా..
By Newsmeter.Network
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. తన పూర్వపు లుక్ లోకి మారటం కోసం ఎంతో శ్రమించి.. బరువు తగ్గిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
మొన్నటి వరకు సానియా చాలా బొద్దుగా కనిపించేది. గర్భిణీగా ఉన్న సమయంలో బరువు పెరగడంతో కొన్నేళ్ల వరకు అలాగే ఉండిపోయింది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు 89 కేజీల వరకు బరువు పెరిగిపోయింది. ఇక తల్లైన తర్వాత.. ఇప్పుడిప్పుడే టెన్నిస్‌పై మళ్లీ సీరియస్‌గా దృష్టిపెట్టిన సానియా.. ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతోంది. స్లిమ్‌గా, ఫిట్‌గా తయారయ్యేందుకు కఠోరంగా శ్రమిస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే 26 కేజీల బరువు తగ్గింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బొద్దుగా ఉన్న ఫోటోతో పాటు.. తాను స్లిమ్ అయిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'89 కిలోలు వర్సెస్ 63 కిలోలు. ప్రతి ఒక్కరికి లక్ష్యాలు ఉంటాయి. రోజువారి లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏవైనా.. ప్రతీది గర్వకారణంలా ఉండేందుకు శ్రమించాలి. బిడ్డకు జన్మనిచ్చాక తిరిగి ఫిట్‌గా, ఆరోగ్యంగా కావాలనే.. నా లక్ష్యాన్ని సాధించడానికి 4 నెలల సమయం పట్టింది. దాని కోసం చాలా సమయం పట్టిందనిస్తోంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. నిరాశకు గురిచేసేవారు ఎంతో మంది ఉంటారు. కానీ ఇది చేయగలను అనుకుంటే దానిని తప్పకుండా సాధిస్తారు' అంటూ రాసుకొచ్చింది సానియా.
నెటీజన్లు సానియా మీర్జా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆట పట్ల ఆమె అంకితభావాన్ని కొనియాడుతున్నారు.