టైటిల్ కు అడుగు దూరంలో..

By Newsmeter.Network  Published on  17 Jan 2020 10:29 AM GMT
టైటిల్ కు అడుగు దూరంలో..

రెండేళ్ల విరామం తర్వాత టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అద‌ర‌గొడుతోంది. టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బ‌రిలోకి దిగిన సానియా ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది.

శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో అన్‌సీడెడ్ సానియా జంట 7-6 (7/3), 6-2తో బౌజుకోవా-జిదాన్సెక్‌పై విజయం సాధించింది. గంటా 25 నిమిషాల పాటు జ‌రిగిన ఈ మ్యాచ్ లో తొలిసెట్‌లో ఇరువురు చెరోసారి సర్వీస్ కోల్పోవడంతో టై బ్రేకర్‌కు దారి తీసింది. ఓ దశలో 1-3తో ఓటమి వైపు వెళ్తుతున్నట్లు కన్పించిన సానియా జంట.. తర్వాత పుంజుకుని వరుసగా ఆరు పాయింట్లు సాధించి సెట్‌ను కైవసం చేసుకుంది.

ఇక రెండోసె‌ట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ షువాయ్ పెంగ్-షువాయ్ జాంగ్‌తో సానియా జంట తలపడనుంది.

Next Story
Share it