రీ ఎంట్రీలో అద‌ర‌గొడుతున్న సానియా.. ఏకంగా సెమీస్‌కు..

By Newsmeter.Network  Published on  16 Jan 2020 3:11 PM GMT
రీ ఎంట్రీలో అద‌ర‌గొడుతున్న సానియా.. ఏకంగా సెమీస్‌కు..

హోబర్ట్ : రీ ఎంట్రీలో సానియా మీర్జా అద‌ర‌గొడుతుంది. త‌ల్లి అయ్యాక రెండేళ్ల పాటు టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా ఈ జ‌న‌వ‌రిలో మ‌ళ్లీ అంత‌ర్జాతీయ టెన్నిస్ లో పున‌రాగ‌మ‌నం చేసింది. తన భాగస్వామి నడియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో సెమీస్ కు దూసుకెళ్లింది. గురువారం అమెరికా జంట వనియా కింగ్‌, క్రిస్టినా మెక్‌హేల్‌తో జరిగిన క్వార్టర్స్‌లో 6-2, 4-6, 10-4 తేడాతో విజయం సాధించింది. గంటా 24 నిమిషాలు సాగిన ఈ పోరులో సానియా జంట హోరాహోరీగా తలపడింది. సెమీస్‌లో భారత్‌-ఉక్రెయిన్‌ ద్వయం టమారా జిదాన్‌సెక్‌ (స్లోవేకియా), మేరీ బౌకోవా (చెక్‌) జంటతో తలపడనుంది.

33 ఏళ్ల సానియా చివరిగా 2017, అక్టోబర్‌లో చైనా ఓపెన్‌ ఆడింది. దాదాపు రెండేళ్ల విరామం అనంత‌రం ఫిట్‌నెస్‌ పెంచుకొని 2020లో పునరాగమనం చేసింది. క్వార్టర్స్‌ పోరులో సానియా జంట దూకుడుగా ఆడింది. ప్రత్యర్థుల సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్‌ చేసింది. ఒక‌టి, మూడో సెట్ గెలుచుకుని సెమీస్ కు దూసుకెళ్లింది.

Next Story
Share it