ఈ దశాబ్దపు అభినేత్రి - సమంత అక్కినేని..!

By అంజి  Published on  29 Dec 2019 2:37 PM GMT
ఈ దశాబ్దపు అభినేత్రి - సమంత అక్కినేని..!

హైదరాబాద్ : ఈ దశాబ్దమంతా పూర్తిగా సమంతా అక్కినేనికి చాలా మంచి కాలమనే చెప్పాలి. కచ్చితంగా వచ్చే ఏడాది తనకు బోలెడన్ని అవార్డులు వచ్చితీరతాయి. ఇందులో సందేహపడాల్సిందేం లేదు. సూపర్ డీలక్స్, మజిలీ లాంటి సినిమాల్లో అయితే సమంత తన ప్రత్యేకతను స్పష్టంగా చూపించింది.

గడచిన దశాబ్దంలో ప్రతి సంవత్సరం తను ఒక్కో సినిమాలోనూ ఒక్కో విధంగా నటించి ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. 2018లో తను నటించిన రంగస్థలం, ఇరుంబు తిరై, సీమ రాజా, యూటర్న్ లాంటి సినిమాలు కెరీర్ లో మైలు రాళ్లుగా నిలిపోతాయి. వీటిలో ప్రతి ఒక్క సినిమాలోనూ తనదైన ప్రత్యేకమైన ముద్రను చూపించింది సమంత.

చాలా వెనక్కి వెళ్లి చూసుకున్నా సరే తన కెరీర్ ఒక్కటంటే ఒక్క సంవత్సరమైనా ఆమె తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించలేకుండా ఉన్న ఒక్క సినిమాకూడా కనిపించదు. 2010లో ఏం మాయ చేశావో సినిమాతో బోణీ చేసి హిట్టు కొట్టిన ఈ తార తర్వాతసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. సంవత్సరానికో హిట్టుచొప్పును కొట్టుకుంటూ తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

2010లో ఏం మాయచేశావే, 2001లో దూకుడు, 2012లో ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, 2013లో అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు సమంతాను అగ్రపథంలో నిలబెట్టాయి. 2014లో మనం, 2015లో తంగ మగన్, 2016లో ఆఆ.. 2017లో వచ్చిన రాజుగారి గది సినిమాలో చిన్న పాత్రే అయినా అందర్నీ బాగా ఆకట్టుకోగలిగింది. 2018, 2019 మరింత మెరుగైన విజయాలను అందించడమే కాక ఆమెకు స్టార్ హీరోయిన్ హోదాను కట్టబెట్టాయి.

కాస్త ఎక్కువ చెబుతున్నారని ఎవరైనా అనుకున్నా సరే దూకుడు, అత్తారింటికి దారేది సినిమాల్లో తన నటన అద్భుతంగా ఆకట్టుకుంది. అందంతోపాటుగా క్యాలిబర్ ఉన్న నటిగా సమంత తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయింది. పైగా గోల్డెన్ లెగ్ అన్న సెంటిమెంట్ కూడా ఆమెను ఈ స్థాయికి తీసుకురావడానికి చాలా ఉపయోగపడింది.

మొత్తం ఈ దశాబ్దమంతా ప్రతి సంవత్సరం ప్రతి సినిమాలోనూ అద్భుతాలు సాధించిన సమంతకు కచ్చితంగా రాబోయే దశాబ్దం మొదట్లోనే బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చి తీరాల్సిందే. ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్ ని చక్కగా తీర్చిదిద్దుకున్న ఇండస్ట్రీలోని అతికొద్ది మంది నటీమణుల్లో సమంతకు కచ్చితంగా సముచితమైన స్థానం ఇవ్వాల్సిందే.

నిజానికి గడచిన దశాబ్దకాలంలో సమంత అక్కినేని సాధించినన్ని వరస విజయాలు మొత్తం తెలుగు ఇండస్ట్రీలోనే ఏ హీరోయిన్ సాధించలేదంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సినిమాను ఎంపిక చేసుకోవడంలోనే ఆమె ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

కెరీర్ గ్రాఫ్

మొదటి సినిమానుంచి తర్వాత వరసగా ప్రతి సినిమాలోనూ సమంత నటనకు మెరుగులు దిద్దుకుంటూనే వచ్చింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకోవడంకోసం చాలా కష్టపడి పనిచేసింది. మజిలీలో తను పోషించిన శ్రావణి పాత్ర ఆమెలో క్రమంగా వచ్చిన పరిణతికి ప్రతీకగా నిలుస్తుంది. ఏం మాయ చేశావే సినిమాలో చేసిన పెర్ఫామెన్స్ తో పోలిస్తే మజిలీ సినిమాలో చేసిన పెర్ఫామెన్స్ అద్దిరిపోయిందనే చెప్పాలి..

కొన్ని సినిమాల్లో అయితే తన చాలా ధైర్యంగా ఏమాత్రం నిడివిలేని చాలా కొద్ది పోర్షన్ ఉన్న పాత్రల్లోకూడా నటించింది.

జనతా గ్యారేజ్ సినిమాని దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. పాత్ర నిడివి తక్కువైన చోట మరింత శ్రద్ధ చూపించి తన హావ భావాలతో చెరగని ముద్ర వేయగలిగే స్థాయికి ఆమె నటన ఎదిగిందనే చెప్పాలి. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో తనకు పెద్దగా నటించే అవకాశం లేకపోయినా గొప్పగా నటించి ప్రేక్షకుల మార్కులు కొట్టేసింది.

ఎవర్ గ్రీన్ స్టైల్

కేవలం నటనలో మాత్రమే కాదు సమంతకు ఫ్యాషన్ డిజైనింగ్ లోకూడా చాలా టాలెంటుంది. ఎప్పుడూ స్టైలిష్ గా కనిపించడానికి ఇష్టపడే ఈ స్టార్ నిజజీవితంలో తన కాస్ట్యూమ్స్ ని తనే డిజైన్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు మారుస్తూ చుక్కల్లో తారలా మెరిసిపోవడానికి తనకు పెద్ద శ్రమపడాల్సిన అవసరమే లేదు.

ఛారిటీ

చూపుల్ని కట్టి పడేసే అందం వెనకు అనంతమైన దయాగుణం దాగి ఉందన్న సంగతి చాలా మందికి తెలీదుకూడా. 2014 నుంచీ ప్రత్యూష అనే ఛారిటీ ద్వారా పేద పిల్లలకు చాతనైన సాయం చేస్తున్న ఈ టాలీవుడ్ స్టార్ ఎండ చేత్తో చేసిన సాయాన్ని కుడి చేతికికూడా తెలియనివ్వని సంస్కార శీలి కూడా.

పిల్లలకు టీకాలు వేయించేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం, రక్తదానం, ఆర్థిక స్థోమత లేని ఎన్నో కుటుంబాలకు వైద్య పరీక్షలు చేయించడం, అవసరమైన సాయాన్ని అందించడం లాంటి మంచి పనులు చేస్తుందీ సంస్థ. ఈ సంస్థవల్ల చాలామంది పిల్లల జీవితాల్లో వెలుగులు నిండాయన్నది ముమ్మాటికీ సత్యం.

పెళ్లి ముచ్చట్లు

సమంతకు నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగినప్పుడు చాలా పత్రికలు, ఛానళ్లు, వెబ్ సైట్లు సమంతకు అవకాశాలు తగ్గిపోయాయి కాబట్టి పెళ్లిదారి పట్టిందంటూ బోలెడన్ని కథనాలను వండి వడ్డించాయి. కానీ సమంత ఆ రాతల్ని పట్టించుకోలేదు. పెళ్లైన తర్వాత చాలా మంచి పాత్రలు పోషించి తనపై వచ్చిన రూమర్లకు టాలెంట్ తోనే సమాధానం చెప్పింది.

ఉన్నపళంగా పొంగిపోవడం, కుంగిపోవడం రెండూ సమంతకు చేతకాని పనులు. చాలా బ్యాలెన్స్ డ్ గా, నిబ్బరంగా, హుందాగా లైఫ్ లీడ్ చేయడంలో తనకు తనే సాటి అనిపించుకుంటుంది. ఆ హుందాతనాన్నీ, అందాన్నీ చూసే, వాటి వెనక ఉన్న అందమైన మనుసును చూసే నాగచైతన్య మనసు పారేసుకున్నాడు, మూడుమూళ్లూ వేసేసి, ఏం మాట చేశావే అంటూ నిజ జీవితంలో పాటలు పాడేసుకున్నాడు.

దశాబ్దపు అభినేత్రి

మొత్తంగా ఈ దశాబ్దంలో ఏడాదికి కనీసం ఒక్కటి చొప్పున ప్రతి సినిమాలోనూ తనదైన ముద్రను చూపించి, వరసగా పదేళ్లనుంచీ వరస విజయాలు సాధిస్తూ వస్తున్న ఒకే ఒక్క తెలుగు హీరోయిన్ సమంత. కాబట్టి తనని ఈ దశాబ్దపు అభినేత్రిగా అభివర్ణించడం సముచితం, సరైన నిర్ణయం.

Next Story
Share it