సల్మాన్.. నువ్వు నేరస్తుడివి.. నీకు మరణశిక్ష విధించాం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 6:35 AM GMT
సల్మాన్.. నువ్వు నేరస్తుడివి.. నీకు మరణశిక్ష విధించాం

బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని సోషల్‌ మీడియాలో బెదిరింపు పోస్ట్‌ దర్శనమివ్వటం కలకలం రేపుతోంది. సల్మాన్‌ ఈ నెల 27న కృష్ణ జింకలను చంపిన కేసులో జోథ్‌పూర్‌ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరు దుండగులు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ లు చేయడం సంచలనం రేపుతోంది. సల్మాన్‌.. భారతదేశ చట్టాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలవేమో. కానీ మా కోర్టులో నువ్వు నేరస్థుడివి. నీకు మేం మరణశిక్ష విధించాం’ అంటూ పంజాబ్‌ యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌ ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ఈ నెల 16న పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్‌ కృష్ణ జింకలను వేటాడి చంపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థాయం ఐదేళ్ల శిక్ష విధించింది. అయితే సల్మాన్ తీర్పును సవాల్ చేయగా కోర్టు బెయిల్ మంజురూ చేసింది.

Next Story
Share it