ఇప్పుడు ఒకరు కాదు. ఇద్దరు పుల్లెల గోపీచంద్ లు రాబోతున్నారు. అదేమిటి? ఇద్దరు గోపీచంద్ లు ఉన్నారా అనుకుంటున్నారా? అవునండీ..ఇద్దరు..ఒకరు పరిణితి చోప్రాకు కోచ్. ఇంకొకరు దీపికా పదుకొనే కు కోచ్. అంటే పరిణితి టెన్నిస్ క్వీన్ సైనా నెహ్వాల్ పాత్రలో నటిస్తే, దీపిక పీవీ సింధు పాత్రలో నటించబోతున్నారు. రెండూ వేర్వేరు బయోపిక్ లు. అయితే ఇద్దరి కెరీర్లనూ మలచడంలో, వారిని చాంపియన్లుగా తయారుచేయడంలో పుల్లెల గోపీచంద్ దే కీలక పాత్ర. పీవీ సింధు తాలూకు గోపీచంద్ గా సోనూ సూద్ నటిస్తే, పరిణీతి తాలూకు గోపీచంద్ గా మానవ్ కౌల్ నటించబోతున్నాడు. సో ఇద్దరు హీరోయిన్ల కన్నా ఇద్దరు గోపీచంద్ లు ఎలా చేశారన్న విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

పుల్లెల గోపీచంద్ కి ఇదంతా ఒక వింత అనుభవం. అసలు గోపీచంద్ కు సినిమాలు పెద్దగా చూసే అలవాటు లేదు. ఏడాదికి ఒక సినిమా చూసినా ఎక్కువే. అయితే ఇలాంటి బయోపిక్ ల ద్వారా మోటివేషన్ పెరుగుతుందని, మరింత మంది క్రీడల పట్ల ఆసక్తి చూపుతారని, దేశీయ స్వాభిమానం పెరుగుతుందని ఆయన అంటున్నారు. అయితే సినిమాల్లో మెలో డ్రామా అవసరం. దాని కోసం పెద్ద పెద్ద డైలాగులు ఉండాలి. భారీ యాక్షన్ ఉండాలి. కానీ రియల్ లైఫ్ లో గోపీచంద్ అలా ఉండడు. చాలా నిదానంగా ఉండే మనిషి ఆయన. చాలా తక్కువగా మాట్లాడతారు. ఇవన్నీ ఎలా చూపిస్తారోనన్న ఆసక్తి అందర్లాగే అతనిలోనూ ఉంది. అయితే మెలోడ్రామా తప్పదని కూడా ఆయనకు తెలుసు. గోపీ సైతం హమీద్ హుస్సేన్, ఆరిఫ్, ప్రకాశ్ పాదుకోన్ వంటి వారి వద్ద ఆటలో మెళకువలు నేర్చుకున్నారు. కానీ ఆయన కోచ్ గా దేశానికి ఎందరో ఆణిముత్యాల వంటి ప్లేయర్లను ఇచ్చారు. ఈ రెండు కథల్లోనూ ఏ గోపీచంద్ ఈ గోపీచంద్ కి నచ్చుతారో మాత్రం సినిమాలు రిలీజయ్యాకే చెప్పగలం.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.