అలిపిరి రోడ్ల మీద తిరిగిన ఆమె ఇప్పుడు ఎక్కడంటే?
By సుభాష్ Published on 31 July 2020 12:06 PM ISTదేవుడున్నాడని ఊరికే అనరు. ఎవరూ లేని వారికి దేవుడే దిక్కన్న మాట పలువురి నోట వినిపిస్తుంది. అలాంటిది దేవుడి కోసం.. దైవదర్శనం కోసం వచ్చి ఊహించని రీతిలో ఇరుక్కుపోయిన ఒక రష్యా మహిళ ఉదంతం అందరిని కదిలించివేసింది. ఆమె ఇప్పటివరకు పడిన కష్టాలకుచెక్ పెట్టేలా చేసింది.
భారత్ లోని పుణ్యక్షేత్రాల్ని దర్శించుకోవటానికి తల్లితో పాటు ఒక మహిళ రష్యా నుంచి భారత్ కు రావటం తెలిసిందే. ఊహించని విధంగా లాక్ డౌన్.. అనంతరం విదేశాలకు వెళ్లే అవకాశం లేకపోవటంతో వారు భారత్ లోనే ఉండటం తెలిసిందే. స్వామివారి దర్శనం కోసం తిరుపతి వచ్చిన వారు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో.. తమ దేశస్తులు ఎక్కువగా వచ్చే యూపీలోని బృందావనానికి వెళ్లి ఆర్థిక సాయాన్ని పొందాలని భావించారు.
దీంతో రష్యా యువతి తిరుపతిలో ఉండిపోగా.. ఆమె తల్లి బృందావనంవెళ్లారు. అయితే.. వారి ఆశలు ఆడియాశలు అయ్యాయి. అక్కడెవరూ తమ దేశస్తులు లేకపోవటం.. చేతిలో డబ్బులులేకపోవటంతో ఏం చేయాలో తోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో తిరుపతి పట్టణంలోని అలిపిరి రోడ్డు మీద తిరుగుతున్న ఆమెను మీడియా ప్రతినిధులు చూడటం.. ఆమెను పలుకరించగా తన ఇబ్బందిని ఆమె చెప్పటంతో.. కదిలిపోయిన వారు ఆమె ఎదుర్కొంటున్న సమస్యల్ని చెబుతూ.. కథనం అచ్చయింది.
శ్రీవారి దర్శనం కోసం వచ్చి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా యువతి కష్టానికి చలించిపోయారు సామాన్యులు.. ప్రజాప్రతినిధులు. యుద్ధ ప్రాతిపదికన స్పందించటమే కాదు.. బృందావనంలో చిక్కుకుపోయిన రష్యా యువతి తల్లిని తిరుపతికి రప్పించే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.
అదే సమయంలో.. రష్యా యువతికి స్వామివారి దర్శనాన్ని ప్రత్యేకంగా కల్పించారు. తిరుపతికి చెందిన ఒక న్యాయవాది కుటుంబం తమ ఇంట్లో వారికి బస ఏర్పాటు చేశారు. వీరి ఉదంతం గురించి తెలుసుకున్న ప్రముఖ నటుడుసోనూసూద్ సైతం సాయానికి సిద్ధమని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె కమ్ స్వర్ణభారతి ట్రస్టు ఛైర్మన్ దీపా వెంకట్ స్పందించారు. రష్యా తల్లీకూతుళ్లతో మాట్లాడటమే కాదు.. రష్యా.. తెలుగు, రష్యా - హిందీ మాట్లాడే దుబాసీలను వారి వద్దకు పంపుతున్నారు. అంతేకాదు.. బృందావనంలో చిక్కుకుపోయిన రష్యా యువతి తల్లిని తిరుపతికి త్వరలో తీసుకొస్తున్నారు. వారిద్దరిని రష్యాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్నటివరకు అష్టకష్టాలు పడ్డ ఆ తల్లీకూతుళ్లు ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితిని చూస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని అక్కున చేర్చుకోవటమే కాదు.. తమ అతిధ్యంతో అదరగొట్టేస్తున్నారు తిరుపతివాసులు.. ప్రజాప్రతినిధులు. వారందరికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.