రష్యా వ్యాక్సిన్: 120 కోట్ల డోసులకు ఆర్డర్.. ఆసక్తి చూపుతున్న 20 దేశాలు
By సుభాష్ Published on 21 Sept 2020 4:18 PM ISTకరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు పోరాడుతున్నాయి. వ్యాక్సిన్ తయారీలో ఒకరికంటే ఒకరు పోటాపోటీగా ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌కు భలే గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్న రష్యా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి' కోసం దాదాపు 20 దేశాల నుంచి 100కోట్ల డోసులకుపైగా కోసం వినతులు వచ్చినట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ కోసం పది దేశాలు ఒప్పంద దశకు చేరుకోగా, ఇప్పటి వరకు దాదాపు 120 కోట్ల డోసుల కోసం వినతులు వచ్చినట్లు సమాచారం.
తొలి రెండోదశ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉందని నివేదికలు వెల్లడించడంతో ఈ వ్యాక్సిన్ కోసం పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌లోనూ పది కోట్ల డోసులను సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో రష్యా వ్యాక్సిన్ తయారీ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. ఈ సమయంలోనే రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆగస్టు 11న వెల్లడించారు.
అయితే రష్యా తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు పలు దేశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే దాదాపు 20 దేశాలు వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థ డైరెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇటీవల వెల్లడించింది. ఇప్పటి వరకు 100 కోట్ల డోసుల కోసం వినతులు వచ్చినట్లు ఆర్‌డీఐఎఫ్ పేర్కొంది. ఇందులో భాగంగా 2020 చివరి నాటికి 20 కోట్ల వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో 3 కోట్ల డోసులను రష్యా తయారు చేస్తుండగా, మిగతా వాటిని దక్షిణ కొరియా, బ్రెజిల్, సౌదీ ఆరేబియా, టర్కీ, క్యూబాతో పాటు భారత్ భాగస్వామ్యంతో చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
కాగా, గమలేయా రీసెర్చ్ పరిశోధకులు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలను దాదాపు 40వేల మందిపై నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. సౌదీ అరేబియా, యూఏఈ, బ్రెజిల్, పిలిప్పిన్స్ దేశాల్లో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారికంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థ పేర్కొంది.
సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమన్నదంటే..
తాజాగా ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది. అవి సాధారణంగా కలిగే ప్రభావలేనని, వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్‌డీఐఎఫ్ స్పష్టం చేసింది.