బాలసుబ్రహ్మణ్యం మృతి: పుకార్లపై స్పందించిన ఎస్పీ చరణ్‌

By సుభాష్  Published on  28 Sep 2020 4:56 AM GMT
బాలసుబ్రహ్మణ్యం మృతి: పుకార్లపై స్పందించిన ఎస్పీ చరణ్‌

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం కళా ప్రపంచంతో పాటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న బాలు.. అందరికి దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన క్షేమంగా కోలుకుని తిరిగి రావాలని చేసిన పూజలు ఫలించలేదు. దాదాపు 40 రోజులకుపైగా కరోనా బారిన పడి అనారోగ్యంతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచారు. బాలు మన మధ్య లేకపోయినా.. ఆయన పాడిన వేల పాటలు చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.

అయితే బాలసుబ్రహ్మణ్యం మృతికి సంబంధించి అనేక వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బాలు మృతి వెనుక పెద్ద కుట్ర జరిగిందని, మనీ కోసం ఆయనని చాలా వేధించారని జోరుగా ప్రచారం సాగింది. ఈ విషయం బాలు కుమారుడు చరణ్‌ దృష్టికి రాగా, వస్తున్న వార్తలపై ఆయన వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. చరణ్ మాటల్లో..

'అందరికి నమస్కారం నాన్న మనల్ని విడిచి వెళ్లిపోవడం దురదృష్టకరం. ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారని మా కటుంబం అంతా ఎంతో ఎదురు చూసింది. ఈ సమయంలో నేను మాట్లాడటం సరైనదా..? కాదో తెలియదు. కానీ ఇప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా అవసరమనిపించింది. ఎంజీఎం ఆస్పత్రి గురించి కొన్ని అసత్యవార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాన్న గారి వైద్యానికి సంబంధించి చెల్లించాల్సిన బిల్లు, టెక్నికల్‌ స్టాఫ్‌ విషయంలో కొన్ని పుకార్తు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా.

ఆగస్టు 5వ తేదీ నుంచి నాన్న చనిపోయేంత వరకు ఎంజీఎం ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ రోజుల్లో నాన్న వైద్యానికి అయిన ఖర్చు కొంత చెల్లించామని, మరి కొంత మిగిలి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడామని అందుకు అంగీకరించకపోవడంతో ఉపరాష్ట్రపతిని కూడా కోరామంటూ పుకార్లు వ్యాపించాయి. అంతేకాకుండా మొత్తం బిల్లు చెల్లించే వరకు నాన్నగారి భౌతికకాయాన్ని ఇచ్చేది లేదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేసినట్లు పుకార్లు వచ్చాయి. ఈ వార్తలన్నీ అసత్యం. ఎలాంటి నిజం లేదు. కొందరు ఇలాంటివి ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావడంలేదు.

'ఆస్పత్రిలో నాన్న గారి ట్రీట్‌మెంట్‌కి సంబంధించి ఎలాంటి వివాదం లేదు. హాస్పిటల్‌ బిల్లు విషయంలో తప్పుడు ప్రచారాలు చేయకండి. నాన్న గారిని అభిమానించే వాళ్లు ఇలా చేయకూడదు. ఈ సమయంలో ఇలాంటి పుకార్లు వ్యాప్తించడం మమ్మల్ని మరింత బాధపెడతాయి. దయచేసి గమనించండి.. అలాంటివి చేయకండి' అని చరణ్‌ తెలిపాడు.

మరో వైపు బాలుకు సంబంధించిన ఎంజీఎం ఆస్పత్రి బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌ చెల్లించారనే వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. బాలు మా కుటుంబానికి చాలా సన్నిహితులు. ఇలాంటి తప్పుడు వార్తలు మమ్మల్ని ఎంతగానో కలిచి వేస్తున్నాయి అని దీపా పేర్కొన్నారు.

Next Story