హిట్‌మ్యాన్ లేకుంటే.. వన్డేల్లో టీమిండియా పని అంతేనా..?
By Newsmeter.Network Published on 12 Feb 2020 1:52 PM GMTహిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లేకుండా టీమిండియా వన్డేల్లో గెలవలేదా..? అగ్రశేణి ఆటగాళ్లు ఎంత మంది ఉన్నా.. రోహిత్ లేకపోవడమే కివీస్ తో క్లీన్‌స్లీప్‌కు కారణమా..? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. క్రీడాపండితులే కాకుండా రికార్డులు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
మిడిల్ నుండి ఓపెనర్‌గా..
2007లో అరగ్రేటం చేసిన హిట్‌మ్యాన్.. మొదట్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. అక్కడ అతని స్థానం ఎప్పుడూ ప్రశ్నార్థంగానే ఉండేది. 2013లో అప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సూచనల మేరకు ఓపెనర్ అవతారం ఎత్తాడు. ఇక అప్పటి నుంచి రోహిత్‌కు తిరుగులేకుండా పోయింది. వన్డేల్లో ద్విశతకాన్ని ఒక్కసారి అందుకోవడమే కష్టం అనుకుంటే.. హిట్‌మ్యాన్ ఏకంగా మూడు ద్విశతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా రికార్డులను అందుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్‌ధావన్‌తో కలిసి జట్టుకు శుభారంభాన్ని అందించేవాడు. ఇక 2019 ప్రపంచకప్‌లో ఏకంగా తన విశ్వరూపమే చూపించాడు హిట్‌మ్యాన్. ఏకంగా ఐదుశతకాలను తనఖాతాలో వేసుకన్నాడు. టెస్టుల్లో కూడా ఓపెనర్ అవతారం ఎత్తాక రోహిత్ ఆట.. మరో ఎత్తుకు చేరింది. ఫార్మాట్ ఏదైనా.. తన ఆటతో టీమిండియాకు మరుపురాని విజయాలు అందించాడు.
ఆ రెండు సిక్సర్లను మరువగలమా..
న్యూజిలాండ్ గడ్డపై ఇటీవల జరిగిన ఐదుటీ20ల సిరీస్‌లో రోహిత్ అదరగొట్టాడు. ముఖ్యంగా మూడో టీ20 సూపర్ ఓవర్‌లో చివరి రెండు బంతులకు రెండు సిక్సర్లు కొట్టి.. భారత సిరీస్‌ను చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. చివరి టీ20లో గాయపడిన రోహిత్ శర్మ.. కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కి దూరమవగా.. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ జట్టు ఓడిపోయింది.
రికార్డులు ఏం చెబుతున్నాయి..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లతో ఆడేటప్పుడు రోహిత్ శర్మ లేకపోతే భారత్ జట్టు వన్డేల్లో గెలవలేదని ఇటీవలి రికార్డుల చెప్తున్నాయి. పైన పేర్కొన్న నాలుగు జట్లతో రోహిత్ శర్మ లేకుండా టీమిండియా ఆడిన చివరి ఏడు వన్డేలని ఓసారి పరిశీలిస్తే..? ఒక్క మ్యాచ్‌లో మినహా అన్నింటిలోనూ ఓడిపోయింది. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఆస్ట్రేలియాతో జరగగా.. అందులో ఫలితం తేలలేదు. మ్యాచ్ ఏ స్థితిలో ఉన్నా.. బౌలర్ ఎవరైనా.. బంతి ఎలాంటిదైనా.. రోహిత్ శర్మ తన అమోఘమైన బ్యాటింగ్ టెక్నిక్‌తో బంతిని స్టాండ్స్‌లోకి తరలించగలడు. ఓపెనర్‌గా ఇటీవల కాలంలో అతను వరుసగా విఫలమైన సందర్భాలు చాలా తక్కువ. దీంతో.. ఒక మ్యాచ్‌లో అతను ఫెయిలైనా.. తర్వాత మ్యాచ్‌లో టీమ్‌ని గెలిపించే ప్రదర్శన చేయగలడు. ఇంకా చెప్పాలంటే.. రోహిత్ శర్మ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు కూడా స్వేచ్ఛగా బౌలింగ్ చేయలేరు. ఇది అతనితో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఇతర బ్యాట్స్‌మెన్‌లకి కలిసిరానుంది.
కివీస్‌తో టీ20 సిరీస్‌ని 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్‌కి గురవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ లేకపోవడంతోనే టీమిండియా వరుసగా ఓడిపోతుంది అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. రోహిత్ త్వరగా జట్టులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.