కివీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో కాలిపిక్క గాయంతో పర్యటన మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ. ప్రస్తుతం కుటుంబసభ్యులతో సమయం గడుపుతున్నాడు. టెస్టు సిరీస్‌కు కూడా రోహిత్ అందుబాటులో ఉండకపోవడంతో.. అతని స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. కాగా రోహిత్‌.. కూతురు సమైరాతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఫోన్‌లో కూతురికి రోహిత్‌ ఏదో చూపిస్తున్నాడు. అయితే సమైరా కూడా ఎంతో ఆసక్తిగా తండ్రి చూపించిన అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆ ఫోటోలో ప్రతిబింబిస్తుంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రోహిత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబాయి ఇండియన్స్‌.. ఈ ఫోటోను ఫన్నీగా రూపొందించి తిరిగి పోస్టు చేసింది. ‘రోహిత్‌ కొత్త సోషల్‌ మీడియా మేనేజర్‌.. ఎంత క్యూట్‌గా ఉంది. అమెకు ఒకటి నుంచి పది వరకు ఎన్ని పాయింట్లు ఇస్తారు’అంటూ ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. కాగా ప్రస్తుతం ఈ ఫోటో నెటింట్లో వైరల్‌గా మారింది. అభిమానులందరూ.. పదికి పదికి పాయింట్లు అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్‌.. మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లోకి అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్