రైలులో దుండ‌గుల బీభ‌త్సం...న‌గ‌దు దోచుకుని రైలు నుంచి తోసేసి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Nov 2019 9:15 AM GMT
రైలులో దుండ‌గుల బీభ‌త్సం...న‌గ‌దు దోచుకుని రైలు నుంచి తోసేసి...

ఈ మ‌ధ్య రైళ్ల‌ల్లో దోపిడీలు ఎక్కువ‌య్యాయి. రైళ్ల‌లోప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. ఈ దోపిడీలు జ‌రుగ‌కుండా పోలీసులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా.. అది పూర్తి స్థాయిలో ప‌రిష్కారం కావ‌డం లేదు. రైలులో దొంగ‌త‌నాలు జ‌రిగిన‌ప్పుడు చేసే హ‌డావుడి త‌ర్వాత మ‌చ్చుకైన క‌నిపించ‌డం లేదు. తాజాగా నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో గుర్తుతెలియని దుండగులు ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని కదిలే రైలు నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని తిమ్మనచర్ల రైల్వేస్టేషన్‌లో ఈ రోజు చోటు చేసుకుంది.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం...కర్ణాటక రాష్ట్రం హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగుళూరు నుంచి నాందేడ్‌కు వెళ్లే నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్ర‌యాణిస్తున్నాడు. రైలు తిమ్మనచర్ల రైల్వేస్టేషన్‌కు రాగానే గుర్తుతెలియని ముగ్గురు దుండగులు లోప‌లికి చొర‌బ‌డి నానా హంగామా సృష్టించారు. స‌ద‌రు వ్య‌క్తి వ‌ద్ద నుంచి రూ.50వేలు లాక్కొని, పైగా అత‌న్ని రైలులో నుంచి కిందకు తోసేశారు. ఇది గ‌మ‌నించిన తిమ్మ‌న‌చ‌ర్ల గ్రామ‌స్తులు ఆ వ్య‌క్తిని చికిత్స నిమిత్తం గుంత‌క‌ల్ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న‌ గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it