రివర్స్ టెండరింగ్ తో అవినీతికి అడ్డుకట్ట..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Sep 2019 5:50 AM GMT
రివర్స్ టెండరింగ్ తో అవినీతికి అడ్డుకట్ట..!

అవి వైఎస్ జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కొత్త రోజులు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే అవినీతి రహిత పాలన అందించడమే తన ఆశయమని ప్రకటించారు. ఆ దిశగానే ఆలోచనలు చేస్తూ..అడుగులేశారు. పోలవరంలో అవినీతి జరిగిందని పాదయాత్ర నుంచి జగన్ చెబుతూనే ఉన్నారు.వైఎస్ జగనే కాదు..ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కూడా పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంల వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఇక..సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకోగానే రివర్స్ టెండరింగ్ అవసరమన్నారు . టీడీపీ గగ్గోలు పెట్టింది. రివర్స్ టెండరింగ్ తో పనులు లేటు అవుతాయని, కాంట్రాక్టర్లు రారంటూ ప్రకటనలిచ్చారు. కాని..వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాలు ఏమైనా అనుకోని ఆయన అనుకున్నట్లుగానే ముందుకు సాగారు. రివర్స్ టెండరింగ్ మొదలు పెట్టారు.

రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలు

వైఎస్‌ జగన్ ఊహించినట్లుగానే రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలు ఇస్తోంది. తొలిసారిగా పోలవరం 65వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ పిలిచారు. అంచనా వ్యయం కన్నా 15.6 తక్కువకు ఓ సంస్థ బిడ్ దాఖలు చేసింది. అంటే .. రూ. 231 కోట్లకు బిడ్ వేసింది. మొత్తం పనుల్లో 43 కోట్లకు తక్కువగా ఈ సంస్థ బిడ్ వేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని రూ. 274 కోట్లకు అప్పగించారు. విచిత్రమేమంటే..43 కోట్లకు తక్కువుగా బిడ్ వేసిన సంస్థే..టీడీపీ హయాంలో రూ. 274 కోట్లకు కాంట్రాక్ట్ తీసుకుంది. కేవలం రూ.300 కోట్ల ప్యాకేజీలోనే..రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.43 కోట్లు ఆదా అయిందంటే..ఇంకా భవిష్యత్తులో రివర్స్ టెండరింగ్‌లకు వందల కోట్లు ఆదా అవుతాయని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

సాధారణంగా ఎల్-1గా వచ్చిన సంస్థకు పనిని అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. అయితే ..రివర్స్ టెండరింగ్‌లో ఎల్-1గా వచ్చిన సంస్థ బిడ్ బేసిక్ గా ప్రకటించి ..దాని ఆధారంగా మరింత తక్కువకు సంస్థలు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దాంతో తొలుత పిలిచిన 65వ ప్యాకేజీలోని పనికి 15.6 శాతం తక్కువకు ఓ సంస్థ బిడ్డు దాఖలు చేసింది. మిగిలిన సంస్థ కన్నా ఇది బాగా తక్కువ కావడంతో ఈ సంస్థకు పనిని అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

శుక్రవారం ఉదయం 11 గంట నుంచి ఈ-ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఇందులో ఆరు సంస్థలు పోటీపడ్డాయి. రెండు గంటల 45 నిమిషాల పాటు ఈ-ఆక్షన్ నిర్వహించారు. అత్యంత తక్కువకు బిడ్ వేసిన సంస్థ అర్హతలను పరిశీలించి పనులు అప్పగించే అవకాశం ఉంది. దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇదే తొలిసారి. ఇందులో ఆరు బడా సంస్థలు పోటీపడటాన్ని బట్టి చూస్తే.. కాంట్రాక్టు విలువ కంటే ..అత్యంత తక్కువ ధరకు టెండర్ ఖరారయ్యే అవకాశం ఉందని.. దీనివల్ల పెద్ద మొత్తంలో నిధులు ఆదా అవుతాయని జలవనరులశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

సీఎం వైఎస్ జగన్ ఆలోచన రాష్ట్ర ఖజానాకు నష్టం లేకుండా ఉందని ప్రభుత్వ అధికారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వ ఖజానాకు మిగులు ఉండటం ఖాయం అంటున్నారు అధికారులు.

Next Story