రెడీగా ఉన్నా.. ఎవరూ పిలవట్లేదన్న బ్యూటీ

By సుభాష్  Published on  22 Jun 2020 8:45 AM IST
రెడీగా ఉన్నా.. ఎవరూ పిలవట్లేదన్న బ్యూటీ

తొలిసినిమాతోనే గుర్తింపు పొందే అదృష్టం అందరికి రాదు. అలాంటి అవకాశం చాలా కొద్దిమందికే సాధ్యం. పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీ చూపే కాదు.. సగటు ప్రేక్షకుడి మదిలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రీతూవర్మ. చూసినంతనే మెడ్రన్ అమ్మాయిలా కనిపించే రీతూ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. మహమ్మారి భయం నేపథ్యంలో షూటింగ్ లు ఆగిన వేళ.. ఇంటికే పరిమితమయ్యారు.

చేతిలో సినిమాలు ఉండి.. పని చేయలేని పరిస్థితి రీతూది. ఆ మాటకు వస్తే.. ఎంతోమందిది అలాంటి పరిస్థితే. షూటింగ్ అన్నంతనే వంద నుంచి రెండు వందల మంది వరకూ సెట్ లో ఉండటంతో వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే.. చిత్ర షూటింగ్ లకు ప్రభుత్వాలు ఓకే చెప్పినా.. జోరందుకోలేదు.

మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన వేళ.. సెట్ కు ఎప్పుడు వెళదామా? అని బాగా అనిపిస్తోందన్న రీతూ వర్మ.. తాను చేస్తున్న టక్ జగదీష్ చిత్ర షూట్ లో ఉన్నప్పుడు కరోనా గురించి రోజుకో సమాచారం తమకు అందేదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనే అనుకున్న షెడ్యూల్ ను పూర్తిచేసుకొని హైదరాబాద్ కు వచ్చామని.. అలా వచ్చినంతనే లాక్ డౌన్ ప్రకటించారన్నారు.

మొదట్లో ఏమీ అనిపించలేదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఏంటీ పరిస్థితి? ఎప్పడు బయటకు వెళతాం? అనిపిస్తోందన్నారు. షూటింగ్ కు రావాలన్న పిలుపు కోసం తాను వెయిట్ చేస్తున్నానని.. కానీ ఎవరూ పిలవట్లేదన్నారు. షూటింగ్ కు అనుమతులు వచ్చినా.. ఇంకాస్త ఆగితే బాగుంటుందన్న ఆలోచనతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఒక్కో సెట్ లో వంద.. రెండు వందల మంది ఉంటారని.. అందరూ సేఫ్ గా ఉండటం చాలా ముఖ్యం కదా? అన్న ఆమె మాటలు నూటికి నూరు శాతం నిజం. కాదని ఎవరనగలరు?

Next Story