ఆ సంచలనానికి 21 ఏళ్లు..

By Newsmeter.Network  Published on  7 Feb 2020 5:09 PM IST
ఆ సంచలనానికి 21 ఏళ్లు..

సాధారణంగా క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తాం.. అలాంటిది ఓకే ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు తీయడం అంటే మాటలు కాదు. ఇప్పటి వరకు ఇలా పదికి పది వికెట్లు పడగొట్టిన వీరులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు ఇంగ్లాండ్‌ కు చెందిన జిమ్‌ లేకర్‌ కాగా మరొకరు భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే.

భారత్‌ క్రికెట్‌కు వన్నె తెచ్చిన ఆటగాళ్లలో అనిల్‌ కుంబ్లే ఒకడు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజు(ఫిబ్రవరి7వ తేదీ) కుంబ్లేకు ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐసీసీ ఈ చారిత్రక రోజుని గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. 26.3-9-74-10 ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్‌ అనిల్ కుంబ్లే అని రాసుకొచ్చింది.

ఆనాటి విషయాన్ని మరోసారి నెమరువేసుకుదాం..

1999 ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చింది పాకిస్థాన్. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌ కాపాడుకోవాలంటే రెండో టెస్టు తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల స్టేడియంలో ప్రారంభమై ఆ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనిల్ కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) ల ధాటికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలింది. 80పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టిమిండియా 339 పరుగులు చేసింది. పాకిస్థాన్ ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాక్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. ఆ తరుణంలో తొలి వికెట్‌గా షాహిద్‌ ఆఫ్రిదిని ఔట్‌ చేసిన తన వికెట్ల వేటను ఆరంభించాడు అనిల్ కుంబ్లే. బంతిని టచ్‌ చేయకుంటే బౌల్డ్‌, ఒకవేళ టచ్‌ చేస్తే క్యాచ్‌ ఔట్‌, హిట్‌ చేద్దామంటే ఎల్బీ ఇలా సాగింది కుంబ్లే వేట. పాకిస్తాన్‌ ప్రధాన ఆటగాళ్లు మహ్మద్‌ యూసఫ్‌, ఇజాజ్‌ అహ్మద్‌, ఇంజమాముల్‌ హక్‌, సలీం మాలిక్‌ లు కూడా కుంబ్లే గూగ్లీలకు బలైయ్యారు. కుంబ్లే ధాటికి (26.3-9-74-10) పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్ లో 207 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 212 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. దాంతో ఒ‍క ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు సాధించి ఆ ఘనత నమోదు చేసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కుంబ్లే తరువాత టెస్టుల్లో ఈ ఘనతను ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోలేదు.



Next Story