'రెమిడిసివర్' ఔషదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌వో
By సుభాష్ Published on 16 Oct 2020 11:49 AM GMTకరోనా చికిత్సలో భాగంగా ఎక్కువగా వినియోగిస్తున్న ఔషధం రెమిడిసివర్. కరోనాకు సంబంధించి ఇంత వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో కరోనా లక్షణాలు ఉన్నవారిలో ఆ లక్షణాలు మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు వైద్యులు ఆ యాంటీ వైరస్ డ్రగ్‌ను వాడుతున్నారు. అలాగే కరోనా చికిత్సలో ఈ రెమిడిసివర్ ప్రధాన ఔషధంగా ప్రచారంలో కూడా ఉంది. దీంతో రూ.5,400కు లభ్యమయ్యే ఈ ఇంజక్షన్ కొంత మంది బ్లాకులో రూ.30వేల వరకు కూడా అమ్ముకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సైతం ఈ ఔషధాన్ని వినియోగించారు.
ఈ మెడిసిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో ఇటీవల అధ్యయనం చేయగా, 30 దేశాల్లోని 11,266 మంది రోగులకు అందించారు. ఈ మెడిసన్‌లో అనుకున్నంత ప్రయోజనాలేవి కనిపించడం లేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. కరోనా రోగులు కోలుకోవడం, వారిని ప్రాణాపాయం నుంచి బయటపడే అంశాలపై ఈ మెడిసిన్ ఎలాంటి ప్రభావం చూపలేదని వెల్లడించింది. రెమెడిసివర్‌ని హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్, ఇంటర్నెరోన్ వంటి ఔషధాలతో కలిపి ఇచ్చినప్పుడు వాటి ప్రభావం స్వల్పంగానూ కొన్ని సమయాల్లో అసలేమి లేదని వారు చెప్పుకొచ్చారు. కాగా, భారత్ సహా దాదాపు 50 దేశాల్లో కరోనా చికిత్సలో ఈ మెడిసిన్‌కు అనుమతులున్నాయి.