'రెడ్ పాండా' సంతతి వృద్ధికి హైదరాబాద్ శాస్త్రవేత్తల సాయం

By Newsmeter.Network  Published on  26 Dec 2019 7:26 AM GMT
రెడ్ పాండా సంతతి వృద్ధికి హైదరాబాద్ శాస్త్రవేత్తల సాయం

అత్యంత అరుదైన, అంతరించిపోతున్న వన్యప్రాణి రెడ్ పాండాకు మళ్లీ మంచి రోజులు తెచ్చేందుకు మన హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు పూనుకున్నారు. ఈ ప్రయత్నంలో వారు తొలి విజయం సాధించారు. రెడ్ పాండా జన్యు వైవిధ్య విశ్లేషణను వారు విజయవంతంగా పూర్తి చేశారు.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం పదివేలకు మించి పాండాలు ఉండవు. అడవుల్లో వీటి సంఖ్య అంతరించిపోతోంది. అందుకే ప్రకృతి పరిరక్షణ కోసం ఏర్పడ్డ అంతర్జాతీయ సంఘం ఐయూ సీ ఎన్ రెడ్ పాండాలను రెడ్ లిస్ట్ లో ఉంచింది. వేటగాళ్ల దాడులు, పర్యావరణ విధ్వంసం, వలల్లో చిక్కుకోవడం, ఇన్ బ్రీడింగ్ వల్ల తలెత్తే సమస్యల వల్ల వీటి సంఖ్య తగ్గిపోతోంది. ఈ అరుదైన జంతువులు అంతరించిపోకుండా డార్జిలింగ్ లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూవాలజికల్ పార్కు, గాంగ్ టక్ లోని హిమాలయన్ జూవాలజికల్ పార్కులలో ఉన్న పాండాల జన్యు వైవిధ్యాన్ని సీసీ ఎంబీ శాస్త్రవేత్తలు విశ్లేషించగలిగారు. డార్జిలింగ్ లోని పార్కు పాండాల పరిరక్షణ విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడే సహజ వాతావరణంలో పాండాల ఇన్ బ్రీడింగ్ జరుగుతోంది.

ఇటీవలే వన్యప్రాణి సంరక్షణ విషయంలో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సుఓ సీసీ ఎంబీ శాస్త్రవేత్తలు హైదరాబాద్ జూ లో మౌస్ డీర్ అనే వన్యప్రాణి ని సంరక్షించినట్టే రెడ్ పాండాను కూడా సంరక్షించడానికి వీలుందని, జూ లలో హైబ్రిడీకరణ ద్వారా సంతానాన్ని పుట్టించి, వాటిని అడవుల్లో వదలివేయడం సాధ్యమేనని ప్రకటించారు. వీటి రక్తం, మలాల నుంచి జీనోమ్ డీ ఎన్ ఏ ని సేకరించి, వాటి జన్యు వైవిధ్యం, బయటి పాండాలతో సంభోగించే సామర్థ్యం వంటి అంశాలను అధ్యయనం చేశాయి. వీటి వల్ల జంతువులు జూలలోని బోనుల్లో ఉంటూ సంభోగించగలుగుతాయా లదా అన్నది తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే కొత్తగా పుట్టిన పాండాలను అడవుల్లో విడుదల చేయడానికి వీలు పడుతుందా లేదా అన్నది కూడా తెలుఉకోవడానికి వీలు పడుతుంది.

రెడ్ పాండాలు హిమాలయ ఎలుగుబంట్ల వంటి జంతువులు. ఇవి పిల్లి కన్నా కాస్త పెద్ద జంతువులు. ఇవి ప్రధానంగా సిక్కిం, పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్, డార్జిలింగ్, మేఘాలయల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చెట్లపై నివసిస్తాయి. ఒక చెట్టునుంచి మరో చెట్టుకు తమ తోకల సాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఎగురుతాయి. ఇవి చాలా సిగ్గరులు. కేవలం మగ పాండాలను ఆకర్షించే సమయంలో మాత్రమే ఇవి కాస్త సిగ్గు తెరలను తొలగిస్తాయి.

ఈ అధ్యయనాన్ని సీసీ ఎం బీ కి చెందిన ఆయు సింగ్, అరుణ్ కుమార్, నిశా నందిని, పీ అనురాధా రెడ్డిలు నిర్వహించారు.

Next Story