అతన్ని డిశ్చార్జ్ చేయబోతున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2020 10:45 AM GMT
అతన్ని డిశ్చార్జ్ చేయబోతున్నారు

తెలంగాణలో కొద్ది రోజుల కిందట మొదటి కరోనా కేసు అంటూ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన 24 సంవత్సరాల వ్యక్తిని త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నారు. రెండో టెస్టులో కూడా నెగటివ్ గా నిర్ధారణ అయితే మరో నాలుగు రోజుల్లో అతన్ని డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 1న వైరల్ న్యూమోనియా కారణంగా ఆ యువకుడు గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఆదివారం నాడు అతడికి కరోనాకు సంబంధించిన టెస్టు చేయగా.. నెగటివ్ గా వచ్చింది. ఇక చేయబోయే రెండో టెస్టులో కూడా నెగటివ్ గా వస్తే అతి త్వరలోనే అతడు ఇంటికి వెళ్లనున్నాడు.

సాధారణంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కొద్దిరోజులు వైద్యుల సమక్షంలో ఉంచుతారు. ఎప్పుడైతే ఆ వ్యక్తికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించి.. అందులో నెగటివ్ గా వస్తే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ అతడి నుండి శాంపుల్స్ ను స్వీకరించామని.. అందుకు సంబంధించిన టెస్టును మంగళవారం నాడు నిర్వహించామని.. బుధవారం నాడు టెస్టుకు సంబంధించిన రిజల్ట్ రానుందని ఆయన తెలిపారు. అన్నీ సజావుగా సాగి నెగటివ్ అని వస్తే.. వచ్చే ఆదివారం అతన్ని డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడాన్ని కూడా తెలంగాణ అధికారులు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఎవరికైతే కరోనా లక్షణాలు ఉంటాయో వారందరినీ ఐసొలేషన్ వార్డుల్లో ఉంచనున్నామని.. స్క్రీనింగ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. మంగళవారం నాడు 26 మందిని ఐసోలేషన్ వార్డుల్లోకి చేర్చారు. వారికి సంబంధించిన శాంపుల్స్ ను టెస్టుల కోసం పంపారు. ఇప్పటివరకూ 264 మందికి సంబంధించిన శాంపుల్స్ నెగటివ్ గా వచ్చాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని యూనివర్సల్ స్క్రీనింగ్ ఫెసిలిటీ సెంటర్ ను ఈటల రాజేందర్ సందర్శించారు. ఇప్పటికే నాలుగు స్టాండింగ్ థర్మల్ స్కానర్లు ఉండగా.. మరో రెండింటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతూ ఉండడంతో చాలా మంది తమ తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. దీంతో స్క్రీనింగ్ కూడా చాలా సమస్యతో కూడుకున్న పనే అని ఆయన అంటున్నారు. అయినప్పటికీ ఇలాంటి విషయాల్లో అలసత్వం పనికి రాదని అంటున్నారు. స్క్రీనింగ్ బృందాన్ని నాలుగు రెట్లు పెంచారు. 200 మంది 24/7 స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారని హెల్త్ మినిస్టర్ తెలిపారు.

Next Story
Share it