రమేష్‌ కుమార్‌ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ వచ్చింది - కిషన్‌రెడ్డి

By Newsmeter.Network  Published on  20 March 2020 8:06 AM GMT
రమేష్‌ కుమార్‌ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ వచ్చింది - కిషన్‌రెడ్డి

ఏపీ ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ వచ్చిందని, ఆయనకు తగిన భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.. లేఖపై ఏపీ సీఎస్‌తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని, లేఖ ఆయన రాసినట్లుగానే భావిస్తున్నామని అన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగిని అయినా విధి నిర్వహణలో ఉన్నప్పుడు భయపెట్టడం సరైన పద్దతి కాదని, అధికారులను బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రమేష్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ఉన్నారని, ఆయనకు తగిన భద్రత ఉందని, కేంద్రం ఆదేశాల మేరకు సీఆర్‌పీఎస్‌ బలగాలు ఏర్పాటు చేశారని అన్నారు. రమేష్‌ కుమార్‌ ఎప్పుడు ఏపీ వెళ్లినా పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించామని అన్నారు. అవసరమైతే లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

అసలేం జరిగిందంటే..

స్థానిక ఎన్నికల వాయిదా విషయమై ఏపీలో ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ వర్సెస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈనెల చివరి వారంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వెల్లడించారు. దీంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీలో సీఎంను నువ్వా.. నేనా..? అంటూ ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌పై మండిపడ్డారు. అంతేకాక సుప్రీంకోర్టులనూ పిటీషన్‌ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది. కాగా ఎస్‌ఈసీ సైతం గవర్నర్‌ను కలిసి ఎన్నికల వాయిదాకు గల కారణాలను తెలియజేశారు. ఆ తరువాత మంత్రులు, వైసీపీ నేతలుసైతం ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా రమేష్‌ కుమార్‌ పేరుతో ఇటీవల ఓలేఖ విడుదలైంది. తనకు బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు ఉంది. ఈలేఖ ఏపీలో పెద్ద చర్చకు దారితీసింది. కాగా తాను ఆ లేఖను రాయలేదంటూ ఎస్‌ఈసీ బాంబు పేల్చాడు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి మాత్రం ఎస్‌ఈసీ పంపిన లేఖ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వచ్చిందని, తగిన భద్రత కల్పిస్తామని తెలిపారు.

Next Story
Share it