టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కస్టడీపై నాంపల్లి కోర్టులో నిన్న వాద‌న‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నిన్న‌ వాదనలు విన్న కోర్టు కస్టడీ పిటిషన్ తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. అయితే ఈ రోజు ధ‌ర్మాస‌నం తీర్పు వెల్ల‌డించింది. ర‌విప్ర‌కాష్ క‌స్ట‌డీ పిటీష‌న్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువ‌రించింది.

అస‌లేం జ‌రిగింది

టీవీ9 యాజమాన్యానికి తెలియకుండా రూ.18 కోట్లు అక్రమంగా రవిప్రకాష్ డ్రా చేసుకున్నాడని ధర్మాసనం ఎదుట పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ కేసులో రవిప్రకాష్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అనేక కీలక ఆధారాలు లభిస్తాయన్నారు. 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. తన అధికార దుర్వినియోగంతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్, ఎక్స్‌గ్రేషియాను అక్రమంగా దొంగిలించారని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు ఇవ్వడం జరిగిందన్నారు. రవిప్రకాష్ డ్రా చేసిన బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌, ఆధారాలను ఈ సందర్భంగా న్యాయవాది కోర్టుకు అందజేశారు.

ఎన్‌‌సీఎల్‌టి, హైకోర్టులో ఉన్న కేసులకు.. ఈ కేసుకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా రూ.18 కోట్లు అక్రమంగా డ్రా చేశారని కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఏ-1గా రవిప్రకాష్, ఏ-2గా ఆర్థిక వ్యవహారాలు చూసే మూర్తి ఉన్నారని తెలిపారు. మూర్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు న్యాయవాది కోర్టుకు వివరించారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.