సప్తాశ్వ రథమారూఢం

By సుభాష్  Published on  1 Feb 2020 3:40 AM GMT
సప్తాశ్వ రథమారూఢం

భారతీయ ఖగోళ శాస్త్రం నవగ్రహాలలో సూర్యుడు ఒక గ్రహం. భౌతిక దృష్టితో చూస్తే మండుతున్న అగ్నిగోళం. వైజ్ఞానిక సృష్టితో చూస్తే ఒక నక్షత్రం. ఉపాసనాపరులకు సప్తాశ్వ రథమారూఢం.సామాన్య జనానికి ప్రత్యక్ష నారాయణుడు. అటువంటి సూర్యుని అనుగ్రహం పొందేందుకు మాఘపు ఆదివారాలలో సూర్యవ్రతం చేయడం ఎంతో విశిష్టం. అయితే రథ సప్తమి అంతకంటే ప్రశస్తమైనది. దీనికి కారణం ఇప్పటి బ్రహ్మకల్పాదిలో అంటే నేటికి సుమారు నూటతొంభై ఏడు కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు ఏకచక్రరథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయన అధిరోహించిన రథం కాల చక్రమని తాత్త్విక వ్యాఖ్యానం. అందుకని ఈరోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది.

రథ సప్తమి నాడు తప్పక చేయవలసిన విధులు స్నానం, సూర్యార్చనం. సూర్యోదయానికి ముందే సమీపాన ఉన్న నదులు, తీర్థాలు, చెరువులలో కానీ, ఇవేవీ లేకపోతే బావి నీళ్లతో కానీ స్నానం చేయాలి.శిరస్సున జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను ఉంచుకుని స్నానజలాలలో శాలిధాన్యం, నువ్వులు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. అలాగే 'యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ!’ అనే శ్లోకాన్ని మూడు సార్లు ఉచ్చరించాలి. ఇలా స్నానం చేస్తే సూర్యగ్రహణ స్నానఫలం, గంగా స్నానఫలం కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలి. పురుషులు ఏడు జిల్లేడు ఆకులు, మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.

|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే ||

"సప్తాశ్యముల గల ఓ సప్తమీ! నీవు సకల భూతాలకు, లోకాలకు జననివి. సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం. అని ఈ మంత్రం అర్థం.

రథ సప్తమినాడు ఆవు నెతితో దీపారాధన చెయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి పిడకలు అంటించి, పాలు పొంగించి, ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది.

ఆరోగ్యకారకుడు

‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అని శాస్త్రవచనం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. శరీరానికి సూర్యకిరణాలు తాకడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందనీ, కొన్ని రకాల రుగ్మతలు నివృత్తి అవుతాయనీ ప్రకృతి వైద్య శాస్త్రం చెబుతోంది.

సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చెయ్యడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది

Next Story