రాశి ఫలాలు : 1-11-2020 ఆదివారం నుంచి 7-11-2020 శనివారం వరకు
By సుభాష్ Published on 1 Nov 2020 8:34 AM ISTరాశి ఫలాలు :-
తే 1-11-2020 ఆదివారం నుంచి తే 7-11-2020 శనివారం వరకు.
విశేష పర్వదినములు :-
తే 1-11-2020 ఆదివారం, పాతార్కయోగము.
తే 3-11-2020 మంగళవారం,(చంద్రోదయ ఉమావ్రతం) అట్లతద్ది. ఆడపిల్లలు నోచుకునే నోము.
తే 4-11-2020 బుధవారం సంకష్టహర చతుర్థి.
మేష రాశి :- ఈ రాశి వారికి విశేష ధనలాభం కుటుంబంతో సంతృప్తిగా కలిసిమెలిసి ఉండే అవకాశం వస్తుంది. 12 వ ఇంట్లో ఉన్న లగ్నాధిపతి కుజుడు కష్టాన్ని కలిగిస్తుండగా రవి భయంకరమైన విచారాన్ని కూడా చవి చూపిస్తాడు. ఏమైనా వీరికి బుధ, గురు గ్రహ ప్రభావము బాగా ఉండటం చేత కొంత వరకు వాటి నుండి బయటకు వచ్చి జీవితాన్ని సమర్థవంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీకు మానసిక సంఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. మాట తడబాటు వల్ల ఇతరులతో గొడవలు ఎక్కువ జరిగే అవకాశం తద్వారా అపకీర్తి రాజకీయ చిక్కులు అవకాశాలు ఉన్నాయి. వృధాశ్రమ మానసిక ఆందోళన వీరిని అడుగడుగున వెనక్కి లాగుతాయి. మూలధనం కొంత ఖర్చు అయిపోక తప్పదు. నమ్మిన వాడు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఆ విధంగా కొంత ధనాన్ని నష్టపోతారు. ఈ వారంలో మీకు 33 శాతం మాత్రమే శుభ ఫలితాలు వర్తిస్తాయి. అశ్విని నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి అనుకూలంగా ఉండి ఆర్థిక లాభం చేకూరుతుంది. భరణి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యరీత్యా వెనుకబడతారు. కృత్తిక 1వ పాదం వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి మిత్రుల ద్వారా సహకారం కొంత లభిస్తుంది.
పరిహారం :- ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయండి. మంగళవారం నియమాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి పూజ హనుమాన్ చాలీసా పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
వృషభ రాశి :- ఈ రాశి వారికి శత్రు నాశనం వల్ల కొంత ఆనందాన్ని పెరుగుతుండగా బంధు దర్శనంతో రాజభోగాలు అనుభవిస్తారు. మంచి వస్తువులు కూడా కొనుక్కుంటారు. పాతబాకీలు కూడా వసూలవుతాయి. ఎంత మంచిగా మీరున్నా శత్రు బాధ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మీ అభివృద్ధి అవరోధాలు కల్పన చేసే వారు ఎక్కువగా ఉంటారు. గతంలో చేసిన ఒక చిన్న పొరపాటు పని మీకు ఇప్పుడు భయాన్ని చేకూర్చి పశ్చాత్తాపాన్ని కలిగింప చేస్తుంది. రాహు ప్రభావం చేత మీరు మరింత భయభ్రాంతులకు గురి అవుతారు కానీ దైవచింతన కలిగి ఉన్నవారు అయినట్లయితే అవి మిమ్మల్ని ఏమి చేయలేవు. ఇంటిలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలున్నట్లయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. స్త్రీలకు ఈ వారం లాభకరమైనది. రోహిణి నక్షత్ర జాతకులు వస్తు వాహన గృహ యోగములు ఉన్నాయి. ఈ వారంలో మీరు 50 శాతం శుభఫలితాలను పొందగలుగుతారు. కృత్తిక 2 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి స్నేహితుల సహకారంతో మంచి ఫలితాలు పొందుతారు. రోహిణి నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలనే ఉన్నాయి. మృగశిర 1 2 పాదాలు వారికి నైధన అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి.
పరిహారం :- రాహుకేతువుల అర్చన చేయండి నల్లని నువ్వులు నల్లని వస్త్రము శని ప్రీతిగా దానం చేయండి. మంగళవారం నాడు సాయంత్రం అమ్మవారి పూజ చాలా మంచి ఫలితం ఇస్తుంది.
మిధున రాశి :- ఈ రాశి వారికి సుఖసంతోషాలు అద్భుతమైన జీవితం ఆనందాన్ని కలిగిస్తాయి. ఎక్కడ ఉన్నా వీరికి ఒక గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఒకానొక సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఏర్పడి పోతుంది. అష్టమ శని ప్రభావం మీపై ఉండటం చేత జీవితం వ్యర్థం అనే భావాలు కలుగుతాయి. ఒంటరితనం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కుజ గురు శుక్ర ప్రభావం చేత మీకు కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా ధన నష్టాన్ని చవి చూస్తారు. స్వతంత్రంగా ఆలోచించ లేకపోవడం వల్ల కాలాన్ని ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. మీకంటూ ఒక ఆలోచనా విధానం లేకపోయినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులపై ఆధారపడినందువల్ల మీకు నష్టమే తప్ప లాభం ఉండదు. స్వతంత్రంగా ఆలోచిస్తే మీకు కొన్ని కార్యాలు నెరవేరే అవకాశం ఉంది. నూతన వ్యవహార వ్యాపారాలకు ఈవారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ వారంలో 50శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. మృగశిర 3 4 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలే ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు సాధనతార అయింది కాబట్టి మనిషిగా ఆలోచిస్తే మీ పనులు ఇంకొంచెం శుభప్రదంగా సాగిపోతాయి. పునర్వసు 1 2 3 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి పనులు అన్ని కుంటుపడతాయి.
పరిహారం :- నల్లనువ్వులు నల్లని వస్త్రాలు నూనె దానం చెయ్యండి. శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించండి. దుర్గా సూక్తం, ఖడ్గమాల పారాయణ మంచి ఫలితాలు ఇస్తాయి.
కర్కాటక రాశి :- ఈ రాశివారికి కుటుంబ సౌఖ్యము విశేష ధనలాభము వున్నాయి దాని ద్వారా మీరు ఆనందాన్ని అభివృద్ధిని సాధించగలుగుతారు. ఎంత ఉన్నా మీకు ఏదో ఒక సమయంలో విచారము ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. పరధ్యానంగా ఉండడం వల్ల చిన్న అగౌరవాన్ని పొందే అవకాశం ఉంది. అతి కష్టం మీద శత్రువుని జయిస్తారు. లేనిపోని ఆలోచనలతో మీరు ఒక చిన్న నష్టాన్ని పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నెరవేరే అవకాశం కూడా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులు కైతే నూతన వ్యాపార వ్యవహారాల్లో లాభం వచ్చే అవకాశం ఉంది. బుధ శుక్రులు మీకు నూతన కుటుంబ బాధ్యతలను కలుగజేస్తారు. మనో నిగ్రహంతో మీరు చాలా విషయాన్ని సాధించగలుగుతారు. వారం చివరలో మీకు ఒక గుర్తింపు వస్తుంది. ఈ రాశి వారికి 50 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి పనులన్నీ కుంటుపడతాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి సౌఖ్యము లభిస్తుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కష్టం మిగులుతుంది.
పరిహారం :- మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. శని జపం చేయించండి. నానవేసిన పెసలు బుధవారంనాడు బెల్లం వేసి ఆవు తినిపించండి.
సింహరాశి :- ఈ రాశి వారికి కుటుంబ సంపద కుటుంబ అభివృద్ధి మంచి వ్యవహార జ్ఞానం వీళ్ళకి వెన్నంటి తోడ్పడతాయి. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారైతే జాగ్రత్తలు వహించండి. వ్యవహార జ్ఞానం తో నూతన వస్తు వాహనాల సమకూర్చుకుంటారు. కొన్ని మార్పులు మీ కుటుంబంలో చోటుచేసుకుంటాయి. కళ్యాణం సుఖ శోభనాలు ఇంట్లో జరిగి పది మందికి భోజనం పెట్టే అవకాశం మీకు ఈ నాడు లభించింది. ఇది పూర్వజన్మ సుకృతంగా భావించి నట్లయితే కుటుంబపరమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యవహార జ్ఞానం తక్కువగా ఉన్నవారు ఈ లాభాలను పొందలేరు. మంచి మాటకారితనం మీకు ఒకానొక సమయంలో మంచి లాభాలను చేకూరుస్తుంది. గౌరవ భంగం అనుకోకుండా మీ తప్పును మీరు ఒప్పుకోండి. మీ చుట్టూర మీ పైన దృష్టి ఉంచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ నుండి మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ వారంలో 50% శుభ ఫలితాలు ఉన్నాయి.
మఖా నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి అనుకూలంగా ఉండి ఆర్థిక లాభం చేకూరుతుంది. పుబ్బ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యరీత్యా వెనుకబడతారు. ఉత్తర 1వ పాదం వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి మిత్రుల ద్వారా సహకారం కొంత లభిస్తుంది.
పరిహారం :- రాహుకేతువుల అర్చన చేయండి నాలుగో తేదీ నాడు గణపతి లేదా సుబ్రమణ్య అర్చన చేయండి.
కన్యా రాశి :- ఈ రాశి వారికి శరీర సౌఖ్యము కుటుంబసౌఖ్యం ఆనందాన్ని ఇస్తాయి. సంతానం విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లల అనారోగ్య సూచనలు ఉన్నాయి. మీకు శత్రువులు ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతారు వారు చెప్పే చాడీలు వల్ల మీరు అవమానం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత తెలివైన వారైతే మీకు అంత శత్రువర్గం పెరుగుతూనే ఉన్నది. శత్రు పీడ అనేది కూడా మీకు తప్పదు. బుధ శుక్రులు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నారు అయితే మనోధైర్యం ఉండటం వల్ల మీరు నెగ్గు కుంటూ వెళ్ళిపోతారు. ప్రతి పనిలో కూడా కుజుడు ఆలోచన చేస్తూ వెనక్కి లాగేస్తూ ఉంటాడు. ఎన్ని ఉన్నా మీ సమస్యకు పరిష్కారం ఆలోచించుకోవాల్సి వస్తుంది. గురు బలం తక్కువగా ఉండటం చేత ధనధాన్య నష్టం ఉంది జాగ్రత్త వహించండి. కొత్త పనులకు మీకు పెద్ద అనుకూలంగా లేదు. తప్పనిసరి అయితేనే పెట్టుబడులు పెట్టండి. పెద్దవాళ్ళను చంటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మిగిలిన వారిలో 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర 2 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి స్నేహితుల సహకారంతో మంచి ఫలితాలు పొందుతారు. హస్త నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలనే ఉన్నాయి. చిత్త 12 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి.
పరిహారం:- కార్యక్రమాల అనుకూలతకు గణపతి అర్చన 4వ తేదీ నాడు చేయండి. గణపతి నామావళి పారాయణ పదహారు నామాలు పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
తులారాశి :- ఈ రాశివారికి విశేష ధన లాభము సౌఖ్యం ఉన్నాయి కానీ మీరు ఉత్సాహం తెచ్చి పెట్టుకుంటే ఇవన్నీ సమకూరుతాయి. బుధ గురు శని గ్రహాలు మీకు ముగ్గురు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ ముగ్గురు కొంచెం వ్యతిరేకం. గ్రహస్థితి అనుకూలత తక్కువగా ఉన్నప్పుడే మనము కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీకు ఉన్న పరిచయాలవల్ల ఒక అనుకోని సంఘటనలో చిక్కులు తప్పని పరిస్థితి అవుతుంది. మీరు ప్రశాంతతని తెచ్చుకోవాల్సి వస్తుంది కాలాన్ని జనాలకు కాకుండా ఏకాంతంగా గడిపే అవకాశాన్ని మీరు కల్పించండి మీకు ఈ వారంలో ఇతరులెవరూ కూడా సహకరించే పరిస్థితి లేదు అతికష్టం మీద శుక్ర గ్రహం యొక్క ప్రభావం చేత మాత్రమే మీరు సద్విధానంలో ఉండగలుగుతారు. మీ రక్షణ మీరు చూసుకోవడం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడమే అవసరము. ఆత్మబుద్ధిస్సుఖం చైవ ఇది ఈ వారం ఈ సూత్రము. మిగిలి వారణ 33 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్త 3 4 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలే ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు సాధనతార అయింది కాబట్టి మనిషిగా ఆలోచిస్తే మీ పనులు ఇంకొంచెం శుభప్రదంగా సాగిపోతాయి. విశాఖ 1 2 3 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి పనులు అన్ని కుంటుపడతాయి.
పరిహారం: రోజు నవగ్రహ దర్శనం చేయండి. గురువారం నియమం పాటించండి నానబెట్టిన శనగలు గురువారంనాడు ఆవుకి తినిపించండి. గురు స్తోత్ర పఠనము మీకు చాలా ఉపకరిస్తుంది.
వృశ్చిక రాశి :- ఈ రాశి వారికి విశేష ధన లాభములు ఉత్సాహ ప్రోత్సాహమే కాకుండా ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తాయి. రావలసిన బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు అంతగా వ్యయం కూడా చేయవలసిన అవసరం వస్తుంది. మీకు శత్రువుల ప్రభావం ఉంటుంది కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. బుధుడు కూడా అనుకూలంగా లేడు కానీ గురు శుక్ర శనుల ప్రభావము మీపై బాగా పనిచేసి మీకు అత్యంత ఉత్తమమైన ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఆర్థికపరమైన పరిపుష్టిని కలిగించి ఇంకా ముందుకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. బాకీలు వసూలవుతాయి స్థిరచరాస్తులు విషయాలు కూడా కొద్దిపాటి సర్దుబాటు లతో మీరు ముందుకు సాగుతారు. విద్యా వైద్య రంగాలలో ఉన్న వారికి పెద్దగా ప్రగతి ఏమీ కనిపించకపోవచ్చు. మీకు ఈ వారంలో 42 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. విశాఖ నాలుగో పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి పనులన్నీ కుంటుపడతాయి. అనురాధ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి సౌఖ్యము లభిస్తుంది. జేష్ట నక్షత్ర జాతకులకు కష్టం మిగులుతుంది.
పరిహారం :- మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. దేవీ పరమైన స్తోత్రములు ఖడ్గమాల మున్నగునవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి.
ధనుస్సు రాశి :- ఈ రాశివారికి ఆనందము ధనలాభము విశేషంగా కలిగి సుఖ జీవితాన్ని పొందగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు శత్రువుల పీడ ఉన్నప్పటికీ కూడా వీరికి బుధ గురు శుక్ర అనుకూలత మంచి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. విద్యా వైద్య రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన పరిస్థితి కల్పిస్తోంది. వ్యాపారము వ్యవహారము అలాగే స్థిరాస్తి విషయములు ఉద్యోగ విషయాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వీరికి ఈ వారంలో మంచి ఫలితాలనిచ్చే శుక్రుడు సంతోషాన్ని కలిగించి కుటుంబంతో హాయిని ఆనందాన్ని పంచి పెడతాడు. ఆది సోమ వారాల్లో మీ పనులు జరగడం లో కొంత ఇబ్బంది కలిగినా బుధవారం నుండి పరిపూర్ణమైన లాభాన్నిపొందగలుగుతారు. మీరు ఏ పని చేపట్టినా మంచిగానే ముందుకు సాగిపోతుంది. లగ్నంలో గురు ప్రభావం నాయకత్వ లక్షణాలతో మీరు ముందుకు పోగలరు. ద్వితీయ శని వ్యయాన్ని సూచిస్తారు మీకు ఈ వారంలో 50శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. మూల నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి అనుకూలంగా ఉండి ఆర్థిక లాభం చేకూరుతుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యరీత్యా వెనుకబడతారు. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి మిత్రుల ద్వారా సహకారం కొంత లభిస్తుంది.
పరిహారం:- శని గురు జపం చేయించండి. గురు స్తోత్రము వేద పఠనము శ్రవణము మంచి ఫలితాలనిస్తాయి. రుద్రాభిషేకం చాలా మంచిది.
మకర రాశి :- ఈ రాశివారికి కార్యానుకూలత సకల భోగాలు స్థిరాస్తి వృద్ధి చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఉత్సాహం ఇచ్చి అందరి కంటే ఘనుడు అనిపించుకునే కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు. మంచికి మారుపేరు గా నిలుస్తారు. మీరు ఏ పని తలపెట్టినా సరే సొంతంగా తొందరలో పది మందికి సహకరించే స్థాయిలో కి వెళ్తారు. అయితే శని ప్రభావం మీపై ఉన్న మీరు విపత్తుల నుండి బయటపడే అవకాశం శుక్రుడు కుజుడు బుధుడు కూడా కల్పిస్తారు. మీరు పట్టిందల్లా బంగారంగా మారే వారమని చెప్పవచ్చు. మీరు ఇంతకుముందు ఖర్చు చేసిన ధనము మీకు పెట్టుబడిగా మారి మంచి మంచి కార్యక్రమాలు స్థిరాస్తి వృద్ధికి దోహదపడుతుంది. అనుకోకుండా మీకు ఉద్యోగ వ్యాపార వ్యవహార రంగాలలో గొప్ప గొప్ప పరిచయాలు ఏర్పడతాయి. ఆచితూచి అడుగు వేస్తే జీవితంలో స్థిరపడే రోజున అని చెప్పొచ్చు మీకు ఈ వారంలో 58 శాతం ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాడ 2 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి స్నేహితుల సహకారంతో మంచి ఫలితాలు పొందుతారు. శ్రవణ నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలనే ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి.
పరిహారం :- శనికి జపం హోమం కూడా చేయించండి. శనివారం నాడు ఉపవాసం ఉండటం మంచిది. గురు స్తోత్ర పారాయణ చాలా అవసరం.
కుంభరాశి :- ఈ రాశి వారికి భూసంపద ధనలాభము కొద్దిపాటి ఆనందాన్ని కలిగిస్తాయి. నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు కానీ గ్రహాల అనుకూలత చాలా తక్కువగా ఉంది మేష తుల కుంభ మీన రాశులవారు ఈ రకమైన స్థితిని చవి చూస్తారు. సంపాదన కంటే గౌరవ మర్యాదలు ఆరోగ్యం ఈ రెండు విషయాల మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టండి. కుజ అనుకూలత లేకపోవడం వల్ల మీకు ఆర్ధిక మానసిక ఆరోగ్య పరమైనఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తు ఉంటుంది. వారం మధ్యలో చేతిలో తగినంత ధనం లేక కొన్ని ముఖ్య విషయాలను చేసుకో లేక ఇబ్బంది పడతారు. మిమ్మల్ని మీరు నియంత్రించు కోవడం వల్ల అగౌరవం పొందకుండా బయట పడతారు. తలనొప్పి ఉదర రోగము ఈ రెండు భార్య భర్తలలో ఒకరికి తప్పదు. ఆడవాళ్లకు అవమానం పాలు ఎక్కువగా ఉంది. మీకు తెలియకుండానే మీ పేరుతో కర్చులు ఎక్కువ అయిపోతాయి. అలాగే భార్యా భర్తల మధ్య కలహాలు కూడా సంభవించే అవకాశం ఉంది. అవి సద్దుమణిగే వరకు జాగ్రత్తగా వాగ్వాదం లేకుండా ఉండండి. మీకు ఈ వారంలో 33 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలే ఉన్నాయి. శతభిషం నక్షత్ర జాతకులకు సాధనతార అయింది కాబట్టి మంచిగా ఆలోచిస్తే మీ పనులు ఇంకొంచెం శుభప్రదంగా సాగిపోతాయి. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి పనులు అన్ని కుంటుపడతాయి.
పరిహారము :- నవగ్రహాలకు ప్రదక్షిణలు రోజు చేయండి. మంగళవారం నాడు ఉపవాసం ఉండి దుర్గా దేవి కి సంబంధించిన స్తోత్ర పారాయణ భజనలు చేయండి.
మీన రాశి :- ఈ రాశి వారికి ధన లాభం కోరుకున్న జీవితము కొంతవరకు సమకూరి ఆనందాన్ని పొందగలుగుతారు. శని విశేష ధనాన్ని ఇచ్చినప్పటికీ సకాలంలో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం రాక ఇబ్బంది పడతారు. చంద్రుడు కూడా మీకు ఈ వారంలో పూర్తి వ్యతిరేకంగా పని చేస్తూ ఉన్నాడు అందువల్ల మానసిక ఆందోళన తప్పదు. గురు బలం తక్కువ అయి మీరు ఎంత శ్రమపడినా దానికి తగిన ఫలితం ఈ వారంలో మీరు పొందలేక మరింత నిరుత్సాహ పడే అవకాశం ఎక్కువగా ఉంది. లగ్నంలో ఉన్న కుజుడు అతనితోపాటు రవి శుక్రులు మీకు రోగ భయాన్ని సూచిస్తున్నారు. జాగ్రత్త వహించడం చాలా అవసరం. . కేతు గ్రహం వల్ల శత్రువు భావం పెరిగిపోయి మీరు ప్రతి ఒక్కరిని అనుమానపు దృష్టితో చూసి మీకు మీరే శత్రువులు గా మారుతారు. మీకు ఈ వారంలో 33 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి పనులన్నీ కుంటుపడతాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి సౌఖ్యము లభిస్తుంది. రేవతి నక్షత్ర జాతకులకు కష్టం మిగులుతుంది.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి అమ్మవారి తాలూకా అర్చనలు మీకు చాలా లాభాన్ని చేకూరుస్తాయి. మంగళవారం పాటించండి. సుందరకాండ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.