రాశిఫలాలు డిసెంబర్ 8 నుంచి 14 వరకు
By Newsmeter.Network Published on 8 Dec 2019 8:15 AM GMTమేష రాశి :
ఈ రాశి వారికి అష్టమంలో రవి శారీరిక బాధలు, తలనొప్పులు ఉంటాయని సూచిస్తున్నాడు. పదమూడో తేదీ నుంచి జాతకంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. సప్తమ కుజుడు కూడా స్వక్షేత్రాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇబ్బందుల నుండి బయట పడేస్తాడు. క్రమక్రమంగా మీకు మంచి రోజులు రానున్నాయి. అన్నదమ్ములతో మాత్రం చిన్న చిన్న విభేదాలు తప్పవు. వారం మధ్యలో వస్తు, వాహన, ధన లాభం చేకూరనున్నది. కోర్టు వ్యవహారాలకు, దీర్ఘవ్యాధులకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. స్నేహ సంబంధాలు పెరగనున్నాయి. వారాంతంలో శుభ సూచనలు వస్తాయి. అశ్విని వారికి జన్మ తారతో వార ప్రారంభంగాన ఎక్కువ శ్రమ పడి ఫలితంగా తలనొప్పులు తెచ్చుకుంటారు. భరణి వారికి మిత్రుల ద్వారా కొంత లబ్ధి. కృత్తికా ఒకటో పాదం వారికి సత్ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం : సూర్యనమస్కారాలు యోగ సాధన ప్రాణాయామం మీకు కొత్త చైతన్యాన్ని ఇస్తాయి.. అమ్మవారి పాదాలపై తులసీ దళాలతో కూడిన పసుపు నీళ్లను అభిషేకించటం ఆరోగ్యదాయకం అవుతుంది.
వృషభ రాశి :
ఈ రాశివారికి రాశ్యాధిపతి శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల దాంపత్య పరమైన భోజన వసతి నిద్ర సౌఖ్యాలు తగ్గుతాయి. కానీ గురుడు కేతువు తమ తమ మూల త్రికోణాలలో వుండడం వల్లను ఐదు గ్రహాలు అదే స్థానంలో ఉండడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారు. ధన వ్యయం మాత్రం తప్పదు. తమకున్న కవిత్వము రచన చిత్రలేఖనం మున్నగుకళలలో ఉన్నత ప్రమాణాలు సాధించ లేరు. ప్రదర్శించే సమయానికి అనుకున్న విధంగా కాక మార్పు చెంది పోతుంది. ప్రతి పనిలోను ఒక శత్రువు మీకు తెలియకుండానే అక్కడ చేరి మీ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తారు. శుక్రుడు శత్రు క్షేత్రంలో ఉండడమే దీనికి కారణం. ఈ తీవ్రత క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నదని గ్రహించండి. మున్ముందు మంచి రోజులు రానున్నాయి. అధైర్య పడవలదు. కృత్తికా నక్షత్రం వారికి చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. రోహిణి వారికి మాత్రం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి కార్యాన్ని సాధించుకునే శక్తి ఉంటుంది.
పరిహారం : శుక్రవారం అమ్మవారి దర్శనం చేయండి. తెల్లని పుష్పాలతోనూ కుంకుమతో అర్చన చేయండి. తెల్లని వస్త్రాలు ధరించండి శుభ ఫలితాలు వస్తాయి.
మిథున రాశి :
ఈ రాశివారికి రాశ్యాధిపతి అయిన బుధుడు సమ ఫలితాన్నిచ్చే గురుని తో కూడి అతని ఇంట్లో ఉండడం వల్ల శుభ ఫలితాలను సూచిస్తున్నాయి. గురుడు స్వక్షేత్ర వర్తి, గురు కేతులు మూల త్రికోణాలు శని బుధులు సమ క్షేత్రం కాబట్టి బావుంటుంది. అనుకున్న స్థలానికి ఉద్యోగ రీత్యా అభివృద్ధి ట్రాన్స ఫర్ లేదా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. శత్రువుల బెడద తప్పదు. అవమానం పడే అవకాశం కూడా ఉంది. శుక్రుడు శత్రు క్షేత్ర వర్తి కాబట్టి భార్యాభర్తల అన్యోన్యతా లోపం లేదా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నదమ్ములకు అనారోగ్య సూచన ఉంది. పిల్లలతో ఆనందం పొందుతారు. మాతృస్థానం పై శని దృష్టి వల్ల తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి కార్యానుకూలత ఉంది. ఆరుద్ర వారికి ప్రత్యక్తార వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. పునర్వసు వారికి క్షేమతార వల్ల శుభం జరుగుతుంది.
పరిహారం : శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి. నానబెట్టిన పెసలు బుధవారం ఉదయం ఆవుకు బెల్లంతో తినిపించి మీరు ప్రసాదంగా స్వీకరించండి .
కర్కాటక రాశి :
ఈ రాశివారికి అధిపతి చంద్రుడు. ఇతనికి శత్రువులు లేరు కానీ తాత్కాలిక గ్రహ వైరం వర్తిస్తోంది. మాట తడబాటు రాబోతోంది. విద్య లేదా ఉద్యోగాల్లో బాగా మార్పులు రాబోతున్నాయి. కొన్ని అవకాశాలు చిక్కినట్టే చిక్కి చేజారుతాయి. తాత్కాలిక మిత్ర గ్రహాల సహకారంతో శుభాశుభ మిశ్రమంగా ఈ వారం నడుస్తుంది. ఆర్థికంగా కూడా గడ్డు రోజులు అవుతాయి. సకాలంలో విషయంగాని ధనంగాని అందదు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. మానసికంగా కూడా ఇబ్బందులున్నాయి. పాత విషయాలు గుర్తు చేసి మిమ్మల్ని బాధించే వాళ్లు ఉంటారు. బంధువర్గం కూడా పూర్తి సహకారం అందించలేరు. అకాల భోజనం అనవసర వాదనలు చేయాల్సి వస్తుంది. నిందారోపణ కూడా ఉంది. అదృష్టం ఉంటే అన్ని విపత్తుల నుండి బయటపడతారు. పదమూడు పద్నాలుగు తేదీల్లో ఏమైనా మంచి ఫలితాలు కనిపించవచ్చు. పునర్వసు ఒకటో పాదం వారికి క్షేమ తార గావున ఇబ్బంది ఉండదు. పుష్యమి వారికి విపత్తార తో వార ప్రారంభంగాన కొంచెం ఇబ్బందికరం. ఆశ్లేష వారికి ధనలాభం ఉంది.
పరిహారం : రుద్రాభిషేకం చేయండి చాలు. పాలు పళ్లు చంటి పిల్లలకు పెట్టించండి.సంతోషి మాత పూజ చేయండి.
సింహ రాశి :
ఈ రాశివారిపై గురుని తాలూకా తొమ్మిదవ దృష్టి ఉంది కాబట్టి మంచి ఫలితాల్ని పొందతారు. రాశ్యాధిపతి ఐన రవి మిత్ర క్షేత్రమైన వృశ్చికంలో ఉండడం వల్ల వీరి ఆరోగ్యాన్ని కూడా కొంత కుదుట పరుస్తాడు. అలాగే వీరి ఆలోచనలో దైవ చింతన పెరుగుతుంది. పంచమ క్షేత్రంలో ఐదు గ్రహాలు శతృత్వాలు వీడి వీరికి అనుకూల ఫలితాల్ని ఇవ్వనున్నాయి. దాంపత్య అనుకూలత తక్కువైనా సర్దుకు పోతారు. ఆహారం నిద్ర తక్కువౌతాయి. కోర్టు వ్యవహారాలకు భూతగాదాలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. విలువైన వస్తువులపై దృష్టి కలుగుతుంది. భవిష్యత్తులో చేజిక్కించుకంటారు. కష్టాలు ఋణబాధలు తగ్గనున్నాయి. మఖవారికి జన్మతార గాన దేహతాపం ఉంటుంది . పూర్వ ఫల్గుణి వారికి అనుజన్మతారతో వార ప్రారంభం కాబట్టి శుభాశుభ మిశ్రమం. ఉత్తర ఫల్గుణి ఒకటవ పాదం వారికి చాలా శుభఫలితాలు ఉన్నాయి.
పరిహారం : ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్య నమస్కారాలు చేయించండి యోగ సాధన మీ శరీరానికి మంచిది.
కన్యా రాశి :
ఈ రాశివారికి చాలా మంచి రోజులొచ్చాయి. రెండు మూడు నాలుగు పది పదకొండు స్థానాల్లో ఉన్న గ్రహాలు తాత్కాలిక మిత్రులయ్యారు. ఈ కారణంగా వీళ్లు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం పొందడం పదోన్నతి ఆర్థిక లాభం ఉద్యోగంలో ఉన్నతి ఇలాంటివేవైనా ఉండచ్చు. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధులున్న తల్లిదండ్రులు ఆరోగ్యం కుదుటపడుతుంది. మాట నేర్పరితనం ఉండాలే గాని పనులన్ని చక్కబడతాయి. అన్నదమ్ములు అనుకూలిస్తారు. భార్య భర్తలు ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. కుటుంబం ఆనందాన్ని అనుభూతిని పొందుతుంది. మంచి మంచి సహకారాలు లభిస్తాయి శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంది. అర్ధాష్టమ శని దోషం ఉంది . మాట కటుత్వం తగ్గించండి. అదొక్కటే మీరు చేయాల్సిన పని. ఉత్తరా నక్షత్రం వారికి శుభఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్రం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. చిత్త ఒకటి రెండు పాదాలు వారికి కార్యాలు సానుకూల పడతాయి.
పరిహారం : మీరు బుధవారం నాడు ఉపవాసం ఉండటం విష్ణుసహస్రనామ పారాయణ చేయడం శని ప్రభావం తగ్గి మంచి ఫలితాలను ఇస్తుంది. గణేశ ఉపనిషత్తు పారాయణ చేయించండి.
తులారాశి :
ఈ రాశి వారికి కుజుడు స్థిర ఆలోచనల్ని ఇస్తాడు. నేత్రస్థానంలో రవి కంటికి పంటికి ఇబ్బంది కలిగిస్తాడు. గ్రహాలుకు తాత్కాలిక మిత్రులు అలాగే మంచి దృష్టి ఉంది గనుక ఈ వారంలోమంచి ఫలితాలే ఇవ్వనున్నారు. కుటుంబము బంధువులు పిల్లలుమీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు . చదువు సంపద ఐశ్వర్యం ఇవన్నీ ఈ వారంలో చాలా కలిసి రానున్నాయి. భార్య అనుకూలత కొద్దిగా తగ్గవచ్చు. మీలో ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి. మీ సలహాలు సంప్రదింపులు పనిచేస్తాయి. సంఘంలో కొంత గుర్తింపు వస్తుంది. ఈ వారంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందగలుగుతారు. అన్నదమ్ముల నుంచి గానీ లేదా తల్లిదండ్రుల నుంచి గానీ మీకు స్థిరాస్తి సంప్రాప్తమయ్యే అవకాశం ఉంది. చిత్త మూడు నాలుగు పాదాలు వారికి చాలా శుభఫలితాలు. స్వాతి వారికి ప్రత్యక్తార ఐనందున శుభాశుభ మిశ్రమం . విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తార ఐనందున శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం : దేవీ ఖడ్గమాలా పారాయణం చేయండి. సప్తశతి పారాయణం చేయించండి చాలా మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి శుభ ఫలితాల పరంపర ఎక్కువగా రాబోతున్నది. అయితే జీవ స్థానంలో రవి ఆందోళనలు కలిగించనున్నాడు. వ్యయమందున్న కుజుడు కూడా కించిత్తు వ్యాకులతను కలిగిస్తాడు కానీ తన క్షేత్రం గనక ఇబ్బందుల్నుండి బయటికి లాగుతాడు. ద్వితీయ మందు ఐదు గ్రహాలు శుభ ఫలితాల్ని ఇస్తున్నారు. వీరికి ద్వితీయ శని ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పడుతోంది. క్రమక్రమంగా శారీరక మానసిక వృద్ధితోపాటు స్థిర చర ఆస్తులను కూడగట్టుకుంటారు. కుటుంబ అనుకూలత తక్కువ మాతృ సౌఖ్యం ఉంటుంది. పిల్లలు కూడా అనుకూలిస్తారు. అనారోగ్యం పొడసూపుతోంది. ఇంట్లో శుభ ఫలితాలకు నాందీ ప్రస్తావన జరగొచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి . ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయి. జీవన విధానంలో కొద్ది మార్పు సంభవిస్తుంది. బద్ధకాన్ని విడిచిపెట్టండి. నిదానంగా పనులు సమకూరుతాయి. విశాఖ నాలుగో పాదం వారికి ఈవారం అనుకూలం. అనురాధ వారికి విపత్తారతో వార ప్రారంభం కనుక ప్రతికూలతలు ఎక్కువ. జ్యేష్ట వారికి స్థిరాస్తి వ్యవహారాలు లేదా ఆకస్మిక ధన లాభాలు పనికి తగ్గ ఫలితములు పొందుతారు .
పరిహారం: దత్త జయంతి నాడు గురు స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారం నాడు తెల్ల ఆవాలు బెల్లం ఉదయం పూట ఆవుకు తినిపించండి.
ధనూరాశి :
ఈ రాశి వారికి గురుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారం లో అయిదు రాశుల్లో అన్ని గ్రహాలు సర్దుకున్నాయి. ఈ పంచానన యోగం ధనూరాశి వారికి చాలా ఉపయోగించనున్నది. వీరు అనుకున్న పనులు సాధిస్తారు. చంద్రుడిపై రాహువుపై గురు దృష్టి మేలును చేకూరుస్తుంది. గ్రహాలన్నీ తాత్కాలిక మిత్రులు అయి అందరికి అందరూ యోగిస్తారు. వాగ్ధాటి తోనూ మంచి మాటలతోనూ అనుకున్న పనికి బాటలు వేస్తారు. దేవుని పూజలలో ఎక్కువగా పాల్గొంటారు. వ్యక్తిగతంగా కూడా క్రతువులను చేస్తారు. వీరికి రావలసిన పైకం సకాలంలో అందే అవకాశాలు కూడా వున్నాయి. మిత్ర వర్గం పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మరింత నమ్మకంగా పనిచేస్తారు. దాంపత్య సౌఖ్యం వాహన సౌఖ్యం గృహ సౌఖ్యం అన్ని సౌఖ్యాలు ఉన్నాయి. వీరిలో నున్న నైపుణ్యం బయటకు వస్తుంది. ఇంట్లో శుభం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూల వారికి జన్మతార ఐనందున అనారోగ్య సూచనలున్నాయి. పూర్వాషాఢ వారికి అను జన్మతార ఐనందున శుభ ఫలితాలున్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మిత్రతార ఐనందున శుభఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి .
పరిహారం : ఏ చిన్న పూజ చేసినా మీకు శుభ ఫలితాలు ఎక్కువ. రోజూ విష్ణుదర్శనం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
మకర రాశి :
ఈ రాశివారికి శని అధిపతి. శని వ్యయ మందున్నా కూడా స్వస్థానాన్ని పోగొట్టు కోడు. పన్నెండో ఇంట్లో ఉన్నవారు అందరూ తాత్కాలిక మిత్రులే అయ్యారు. సహజంగా ఈ రాశివారికి ఏల్నాటి శని ప్రభావం ధన వ్యయము శారీరిక మానసిక రుగ్మతలు సంభవించే కాలమిది. అయినా ధైర్యంతో ముందుకు వెళితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. శత్రుబాధ ఋణబాధ కూడా ఒకేసారి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. దీనికి కారణం వ్యయ మందు ఉన్న గ్రహములే.
ఆలోచించి దైవ బలంతో గురు బలంతో ముందుకు సాగితేనే మీరు కష్టాల్లోంచి బయటకు రాగలరు. నిగ్రహ శక్తి చాలా అవసరం. స్త్రీలతో ఆచితూచి మాట్లాడండి.
అపనిందలకు అవకాశాలెక్కువ. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి మిత్ర తారతో వారం ప్రారంభమైనా అనుకూలతలు తక్కువ. శ్రవణం వారికి నైధనతారతో వార ప్రారంభము నిందలు నిష్టూరాలు తప్పవు. ధనిష్ఠ ఒకటి రెండు పాదములు వారికి సాధన తారతో వారం ప్రారంభం గనుక అనుకున్న పనులను సాధించగలుగుతారు.
పరిహారం : శనికి జపం చేయించండి. నువ్వులు దానం ఇవ్వండి. అయ్యప్ప స్వాములకు భోజనం పెట్టండి లేదా వారికి ఇంకో రకమైన సహాయమైనా చేయండి.
కుంభ రాశి :
ఈ రాశివారికి శుభ పరంపరలు కొనసాగుతున్నాయి. సమక్షేత్రంలో ఉన్న శని కూడా లాభిస్తాడు. శత్రు క్షేత్రంలో ఉన్నప్పటికీ శుక్రుడు కూడా మేలే చేయనున్నాడు. శుక్ర బుధుల కలయిక మరికొంత మేలు చేయబోతోంది. మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది. మీకు మీ శ్రీమతికి అనారోగ్యము కనిపిస్తోంది. ఋణ బాధలు తగ్గుతాయి. స్థిరచర ఆస్తులు కొనుగోలు చేస్తారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. తల్లి తండ్రి బిడ్డల నుండి కొంత మేలు జరగనున్నది. మాట చెల్లుబాటై అధికారాన్ని లేదా ఒక పదవిని పొందే అవకాశం ఉంది. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి సాధన తార అయింది గనుక మంచి ఫలితాలు లభిస్తున్నాయి. శతభిషం వారికి ప్రత్యక్తారతో వారం ప్రారంభం గనుక ప్రతి కూలతలు ఎక్కువ. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి క్షేమ తారతో వారం ప్రారంభం గనుక బావుంది శుభ ఫలితాలు ఎక్కువ.
పరిహారం : కాల భైరవ స్తోత్రం లేదా ఖడ్గమాల స్తోత్రపఠనం మీకు మేలు చేకూరుస్తుంది. విష్ణు సహస్ర నామ పారాయణ ప్రశాంతతను ఇస్తుంది .
మీన రాశి :
ఈ రాశివారికి స్వక్షేత్ర వర్తి అయిన గురుడు మంచి ఫలితాల్ని ఇవ్వబోతున్నాడు. స్థిరమైన ఉద్యోగం లేదా ఆస్తి కొనుగోలును చేయిస్తాడు. సప్తమాధిపతి బుధుడు అష్టమాధిపతి శుక్రుడు శత్రువు ఇంట్లో ఉండడం వల్ల అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదైనా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం చాలా అవసరం. అష్టమాధిపతి శుక్రుడు వాహనం నడిపేటప్పుడు, మీ శ్రీమతి తోనూ జాగ్రత్తగా ఉండండి. వాక్ స్థానం కొంచెం బాగాలేదు మాటల లో కాఠిన్యత తగ్గించండి. ఇతరులు కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. మిత్రుల సహకారం, తలిదండ్రులు సహకారం పొందుతారు. షష్ఠ అష్టమ స్థానం బాగులేదు గనుక ప్రతి పని భారం దైవం మీద వేయండి. అదృష్టాన్ని నమ్ముకోకండి. గురువులు పెద్దవాళ్లు ఆధ్యాత్మిక విదులు మీకు ఏదిచ్చినా(మంత్రం ఐనా వస్తువు ఐనా) భక్తితో తీసుకోండి. అలాంటి అవకాశం ఈ వారం లో ఉంది. ఉత్తరాభాద్ర వారికి అనుకూలత తక్కువ పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి రేవతి వారికి సంపూర్ణ శుభ ఫలితాలు అందనున్నాయి.
పరిహారం : శివునకు పంచామృత అభిషేకం బిల్వ దళాలతో అర్చన నమక పారాయణ చేయించండి. గురువారం నియమం పాటించండి శనగలు దానం చేయండి.