మే 3 ఆదివారం నుంచి మే 9 శ‌నివారం వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2020 11:30 AM GMT
మే 3 ఆదివారం నుంచి మే 9 శ‌నివారం వ‌ర‌కు

మేష రాశి :

ఈ రాశివారికి కుజుడు స్థానం మారడంతో శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు కూడా వీరికి అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. గ్రహానుకూలత వల్ల రాహువు సర్వ సంపద నివ్వాలనుకుంటున్నాడు. అయితే మానసిక ఆందోళనలు అనారోగ్యము శత్రువుల వల్ల భయము ఉన్నాయి. అలాగే శని కుజులు కొంచెం ద్రవ్యహానిని కలిగించ బోతున్నారు. కొంతలో కొంత గురుడు ధనలాభాన్ని కలిగిస్తాడు. అనారోగ్యంతో ఉన్న వాళ్లు జాగ్రత్త వహించండి. మొండి బాకీలు వసూలయ్యే మార్గాలు మీకు కనిపిస్తాయి పథకం జాగ్రత్తగా వేసుకోండి. మొత్తంమీద ఈ వారంలో వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయని చెప్పొచ్చు. అశ్వినీ నక్షత్ర జాత కులకు సంపత్ తారైంది కాబట్టి శుభ ఫలితాలు కొంచె ఎక్కువగానే ఉన్నాయి. భరణి నక్షత్రజాతకుల కు జన్మ తారైంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కృత్తిక ఒకటో పాదంవారికి పరమ మిత్ర తారైంది బాగానే ఉంది ఫర్వాలేదు.

పరిహారం : మంగళవారం నియమాన్ని పాటించి సుబ్రహ్మణ్యం పూజ చేయండి. ఉలవలు నానబెట్టి ఆదివారం సోమవారాల్లో ఆవు చేత తినిపించండి మంచిది.

వృషభ రాశి :

ఈ రాశి వారికి విశేష ధన లాభం ఉందని చెప్పొచ్చు. గ్రహాల అనుకూలతలు కొద్దిగా పెరిగాయి. కుజ స్థానం మార్పు వల్ల కూడా ధన సంపాదనలో మార్గాలు ఎక్కువగా దొరుకుతాయి. ఎంత సంపాదిస్తారో అంత ధనం వ్యయమయ్యే అవకాశం కూడా ఉంది. రాజకీయ పరమైనటువంటి నిబంధనలను ఎదుర్కోవాల్సివస్తుంది. అనారోగ్యం మాత్రం యథాతథంగానే కొనసాగుతోంది. అయితే లగ్నంలో ఉన్న శుక్రుడు మేలు చేస్తాడు. రవి బుధుల స్థితి బాగాలేదు కనుక ధన వ్యయము శరీరానికి బంధువులకు హాని కలిగించే అవకాశం ఉంది. భూ సంబంధ వ్యవహారాల్ని చక్కబెట్టుకోడానికి మంచి రోజులు వచ్చాయి సాధ్యమైనంత తొందరగా వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి పరమ మిత్రతారయింది కాబట్టి చాలా అనుకూలంగా ఉంది. రోహిణి నక్షత్ర జాతకులకు మిత్రతారైంది చాలా బావుంది. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి నైధన తారైంది కాబట్టి పనులన్నీ వాయిదాలు పడుతాయి.

పరిహారం : మినుములు, ఉలవలు దానం చేయండి. మంగళవారం నాడు ఆంజనేయస్వామి పూజ,సుబ్రహ్మణ్య జపం చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి :

ఈరాశి వారికి ఈ వారం సామాన్యంగా సాగుతోంది. ఇంతవరకు మీ హవా వెలిగింది. ఇప్పుడు అనారోగ్యం మూలంగా ధన వ్యయం. మీ కుటుంబ సభ్యులకు శస్త్రచికిత్స అవకాశం కూడా కనిపిస్తోంది. అది మీకు అయినా కావచ్చు. భయాందోళనలతో ఈ వారం మీకు సాగబోతోంది. శని స్థితి కూడా బాగా లేకపోవడం వల్ల మానసికంగా పెద్ద దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంది. ధన వ్యయము ఆస్తి నష్టము ఉన్నాయి . ప్రతి పని ప్రతికూలంగా మారుతుంది ఒక్క శుక్రుడు మాత్రమే మీకు ఉత్సాహాన్ని ఇచ్చి ఆనందాన్ని కలిగించి చేస్తాడు. సాధ్యమైనంత వరకు ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి సమయానికి మాత్రం ధనం అందుతుంది కాబట్టి ఇబ్బందులు లేకుండా ఉంటారు. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి నైధన తారైంది ప్రతికూలంగా ఉంది. ఆర్ధ్ర నక్షత్రబజాతకులకు సాధన తారైంది చాలా అనుకూలంగా ఉంది. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజ చేయండి. ఖడ్గమాల పారాయణ చేయండి వీలైతే సప్తశతి పారాయణ చేయించండి చాలా అవసరం భవిష్యత్ దృష్ట్యా కూడా మీకు పనికొస్తుంది.

కర్కాటక రాశి :

ఈ రాశివారికి ఈ వారంలో చాలా శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. కార్య జయం, సంతోషం, ధన లాభం ఇవన్నీ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. అయితే పని ఒత్తిడి మాత్రం తప్పదు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని నిలబడి కలిగినట్లయితే మీకు పనులు సానుకూలమవుతాయి. శని ప్రభావం వల్ల మీకు అనుకున్న పని ఒకటి ప్రధానమైనది వాయిదా పడే అవకాశంగా ఉంది. గురుని అనుకూలత కూడా బావుంది కాబట్టి మీరు తలపెట్టిన కార్యాల్లో ముందుకి సాహసించి వెళితేనే పని జరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. కుజుని మార్పు మీకు చిన్న అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అది శారీరకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మొత్తంమీద ఈ వారం మీ అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. పునర్వసు నాలుగవ పాదం వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది బాగుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయించండి మంగళవారం నియమాల్ని పాటించండి. శనివారం నాడు శని దర్శనం చేయండి.

సింహరాశి :

ఈ రాశివారికి అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుజుడు ఆటంకాలు కలిగించినప్పటికీ ఫలితాలు మాత్రం శుభప్రదం కానున్నాయి. ఊహించనంత సంపద వస్తు రూపంలో గాని ధన రూపంలో గాని మీ మిత్రులు మీ క్రింది వర్గాల వారు సానుకూలంగా స్పందించి సహకరించే అవకాశం కలుగుతుంది. సంతోషము ధనలాభం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మంచి ఆలోచన, పధకం ద్వారా మీ మీకు మీ కుటుంబం స్థిరాస్తి వ్యవహార విషయాల్లో చాలా లబ్దిని పొందే అవకాశం ఉంది. ఈ సమయాన్ని ఎంతగా మీరు ఉపయోగించుకుంటే గ్రహాల అనుకూలతను బట్టి ఫలితాల్లో విజయ అవకాశం వుంది. కొద్దిపాటి ధన వ్యయం జరిగినా దాని వల్ల కూడా మీకు లాభమే చేకూరుతుంది. మీ మాటకు తిరుగులేదు. మఖా నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది కాబట్టి సంపాదన బావుంటుంది. పుబ్బ నక్షత్ర జాతకులకు జన్మ తారైంది అనారోగ్య సూచన ఉంది. ఉత్తర ఒకటో పాదం వారికి పరమ మిత్రతారయింది అనుకూలంగా ఉంది.

పరిహారం: సూర్య నమస్కారాలు చేయండి. కుజుడికి జపం చేయించడం ఖడ్గమాల పారాయణ చేయడం చాలా అవసరం. మీకు భవిష్యత్ దృష్ట్యా ఇవి చాలా ఉపయోగపడతాయి .

కన్యా రాశి :

రాశి వారికి ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. శాశ్వతమైన పథకాన్ని మీరు వేసుకుని దానికై మీరు పనిచేసే అవకాశం ఉంది. కుజుడు మీకు ఆంతరంగిక శత్రువుల ద్వారా ఇబ్బంది కలిగించినప్పటికీ షష్ఠ స్థానంలోకి అతను మారడమూ వల్ల గ్రహాల అనుకూలత పెరిగింది. దీనివల్ల మీకు ఆదాయానికి లోటుండదు. విద్యా ఉద్యోగ అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. కుటుంబము పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వారం మధ్యలో వ్యయం కనిపిస్తోంది అది మంచి కోసమే ఖర్చు పెడతారు. ఇతరులు మిమ్మల్ని అవమానించే అవకాశాలు ఉన్నాయి. అలాగే గౌరవ భంగం కూడా ఉంది. కుటుంబంతో మాత్రం హాయిని ఆనందాన్ని పొందగలుగుతారు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వారికి పరమ మిత్ర తారైంది అనుకూలంగా ఉంది. హస్తానికి మిత్ర తయారైంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి చిత్ర ఒకటి రెండు పాదాలు వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : మేధా దక్షిణా మూర్తి స్తోత్రం, ఖడ్గ మాల పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మీకు లాభాన్ని కలిగిస్తాయి.

తులా రాశి :

ఈ రాశివారికి అనుకూలతలు కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి. అనేక రకాలుగా ధన సంపాదన వస్తుంది. అయితే శత్రుపీడ మాత్రం వుంది కాబట్టి అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తి వ్యవహారాలు మీకు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి. కొత్త ఆస్తులను సంపాదించడంలో వ్యయం జరిగినా అది శుభ వ్యయంగా మారి భవిష్యత్తులో మీకు మంచి ఫలితాన్నిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. శత్రుభయం మీకు ఉంది అయినా పర్వాలేదు దాట గలుగుతారు.రవి బుధులు మీకు ప్రతికూలించినా శుక్ర స్థితి ద్వారా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్త మూడు నాలుగు పాదాల వారికి నైధనతారయింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతి వారికి సాధన తారైంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంది. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలిస్తుంది. గ్రామ దేవత అయితే ఎక్కువ అనుకూలంగా ఉంది కాబట్టి ఆవిడని దర్శించండి పూజల్లో పాల్గొనండి .

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి సానుకూలతలు బాగా వృద్ధి నందాయి.మీరు ఏ పని చేపట్టినా నిరాటంక నిరాఘాటంగా ముందుకు సాగిపోతారు. కార్యంలో మీ మాట తీరు వల్ల మీరు ఇబ్బంది పడినా మిమ్మల్ని అర్థం చేసుకుని మీ ఆవేదనని బాధనూ గుర్తించి మీకు పనులను సానుకూల పరుస్తారు. శుక్రుడు రోగాన్ని రాహువు చౌర్యాన్ని సూచిస్తున్నప్పటికీ మీకు అనుకూలించే గ్రహాలు ఎక్కువగా ఉండటం వల్ల మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. గురుకృప కొద్దిగా తగ్గింది కాబట్టి దాని గురించి ప్రయత్నం చేయండి. మీ శత్రువులకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. కొత్త వస్తువుని పొందే అవకాశం కూడా ఉంది. విశాఖ నాలుగో పాదం వారికి ప్రత్యేక తారైంది అనుకూలతలు తక్కువ. అనురాధ నక్షత్ర జాతకులకు క్షేమ తయారైంది చాలా బావుంది. జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు.

పరిహారం : ఈ వారం మీరు శుక్రుడికి తెల్లని వస్త్రాలను దానం చేయించండి. వేయించిన కొమ్ము శెనగలు నైవేద్యం పెట్టండి పిల్లలకు పంచిపెట్టండి.

ధను రాశి :

ఈ రాశి వారికి ఈ వారం క్రమక్రమంగా మిత్రులు, బంధువులు దూరం అవుతున్నారు. గ్రహ ప్రతికూలతలే దీనికి కారణం తప్ప మీ వ్యక్తిత్వం అయితే కాదు. మీ మాట చాలా సూటిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే అందులోంచి బయటపడే అవకాశం ఉంది. కుజుని మార్పు మీకు పట్టిన ఇబ్బందుల్ని అసౌకర్యాన్ని తొలగించి సమస్త సౌఖ్యాలు ఇవ్వడానికి సహకరిస్తుంది. ఎంత సహకరించిన మీకు ప్రతికూలతలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. గౌరవ భంగము, రాజదండం ఈ రెండు మిమ్మల్ని మరికొంచెం మానసికంగా కుంగదీస్తున్నాయి. కుటుంబపరంగా మాత్రమే ఆనందాన్ని పొంద గలుగుతారు. మూలా నక్షత్ర జాతకులకు సంపత్తార యింది కాబట్టి అనుకూలంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు జన్మ తార ఆరోగ్యం జాగ్రత్త వహించండి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి పరమమిత్ర తారైంది అనుకూలతలు పెరిగాయి.

పరిహారం : శని ప్రభావాలు తగ్గడానికి నువ్వులు నల్లని వస్త్రము తప్పనిసరిగా దానము చేయండి. వీలైతే శని మంత్రాన్ని పట్టించండి. శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయండి .

మకర రాశి:

ఈ రాశివారికి ఈ వారం కూడా ప్రతికూలతలు ఎక్కువగానే ఉన్నాయి కుజుడు మరింత ప్రతికూలంగా మారుతున్నాడు అన్ని ఇబ్బందులు ఒకేసారిగా వచ్చాయా అన్నట్టుగా ఉంటుంది మీ పరిస్థితి. స్థానచలనం ఉన్నప్పటికీ అది అనుకూలంగా మారే అవకాశమున్నది. జన్మ శని ప్రభావము, గురుడు మళ్లీ వెనక్కి వెళ్లడం వల్ల రాబోయే ప్రమాదమూ మీకు ఇప్పతినుంచే ప్రతికూలంగా మారుతున్నాయి. అధికారుల చేత లేదా కుటుంబ పెద్దల చేత మీరు బాధించపడే అవకాశాలు కలవు. వారం మధ్యలో మీకు ఒక శుభం జరిగే అవకాశం కన్పిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు గానీ కోర్టు వ్యవహారాలు గాని ఇప్పట్లో సానుకూల పడే అవకాశమైతే కనిపించట్లేదు. మీరు ఎక్కడికి వెళ్లినా ప్రతికూలతే వస్తాయి కాబట్టి ప్రతి పనిని కొంచెం వాయిదా వేసుకుని సరైన సలహా తీసుకుని ముందుకు వెళ్లండి. ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు వారికి పరమమిత్రతార కాబట్టి సానుకూలంగా ఉంది. శ్రవణా నక్షత్ర జాతకులకు మిత్ర తయారైంది అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది. ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు వారికి నైధన తార ప్రతికూలంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి.

పరిహారం : నల్లని నువ్వులు నల్లని వస్త్రం దానం చేయండి దక్షిణామూర్తి స్తోత్రం గాని గురువుకి సంబంధించి ఏ శ్లోకం చదువుకున్నా మీకు అనుకూలతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి:

ఈ రాశివారికి ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా కాస్త అనుకూలతలు పెరిగాయి. కుజ స్థానం మారడం మీకు లభించబోతోంది మొండి బాకీలు వసూలవుతాయి. ఏమైనా చిన్నచిన్న వ్యవహారాల్లో వెనుకబడి ఉన్నట్లయితే వాటిని కూడా మీకు సావధానంగా అనుకూలంగా పరిష్కరించుకొనే అయ్యే స్థితి ఉంది కాని మానసికంగా మీకు ఇబ్బంది తప్పదు. కుటుంబంలో వ్యతిరేకులు కూడా మీకు ఉన్నారు. ధనం ఎంతొస్తుందో అంతా ఖర్చయి పోయే అవకాశం కూడా ఉంది. అంతేకాదు శస్త్ర చికిత్సకు దగ్గర వరకు వెళ్ళొస్తారు. మీ కుటుంబంలో దీర్ఘకాలిక వ్యాధుల నట్లయితే వారి వల్ల కుటుంబానికి అంతటికీ ఇబ్బంది కలిగే అవకాశం వుంది. అయితే తలపెట్టిన వాటిలో కొన్ని పనులను అయినా సాధించగలుగుతారు ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి నైధన తయారైంది కాబట్టి ప్రతి కూలతలు ఎక్కువగా ఉన్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు సాధన కారింది కాబట్టి మీ పనులు మీరు చాలా హాయిగా ఆనందంగా జరుపు కుంటారు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : నల్లని చెప్పులు, గొడుగు వీలైతే దానం చేయండి. గురు స్తోత్రము గానీ గురుపూజ గాని చేయండి.

మీన రాశి :

ఈ రాశివారు ఇన్నాళ్లు పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందబోతున్నారు. విశేష ధన సంపాదన స్థిరాస్తులు అన్ని కూడా ఈ వారంలో దక్కించుకో గలుగుతారు. ఆరుగ్రహాలు బాగా అనుకూలంగా ఉండటంతో మీ పనులన్నీ కూడా ఒకటొకటిగా నెరవేరతాయి. మీ నోటి మంచితనం మీకిప్పుడు అనుకూలంగా మారుతోంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చగలిగే శక్తి మీకు వచ్చింది. మీ పనులను మిత్రుల మీద ఆధార పడినప్పుడు మాత్రమే మీరిబ్బంది పడే అవకాశం ఉంది. చేయవలసిన పనులు కూడా మీకు ప్రతికూలించి గౌరవ భంగం జరుగుతుంది. దాని ద్వారా ధన విషయంలో ఇబ్బంది కూడా పొందబోతున్నారు సహజంగా మీకు ఆందోళన ఎక్కువగా ఉంటుంది దాన్నుంచి విడివడి నిరంతరం దైవ ధ్యానాన్ని చేస్తూ ఉండండి విశేష ధనప్రాప్తి వారం మధ్యలో మీకు కలుగుతుంది. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలతే ఎక్కువగా ఉంది. ఉత్తరాభాద్ర వారికి క్షేమ తయారైంది కాబట్టి పనులన్నీ సక్రమంగా జరుగుతాయి.రేవతి వారికి మాత్రం విపత్ తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : కుజ స్థితి బాగు లేదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం చేయండి. సూర్యోదయంతోనే లేచి సూర్యనమస్కారాలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

Next Story