జూన్‌ 21 ఆదివారం నుంచి జూన్‌ 27 శ‌నివారం వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2020 2:21 AM GMT
జూన్‌ 21 ఆదివారం నుంచి జూన్‌ 27 శ‌నివారం వ‌ర‌కు

మేష రాశి :

ఈ రాశివారికి సంపద ధనలాభం ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అయినా శత్రుపీడ కష్టము వీరికి ఈ వారం ఇబ్బందులు లెక్కువ గానే చూపిస్తున్నాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంది. కార్యహాని ఎక్కువగా కనిపిస్తుంది. వ్యయ మందున్న కుజుడు కష్టాన్ని దశమ మందున్న గురుడు శ్రమని కలుగజేస్తున్నారు. మధ్య మధ్య వీరికి చిన్న చిన్న ఆనందాలు కలిగినా ఈ వారం కొంచెం క్లిష్టంగా ఉందని చెప్పొచ్చు. గ్రహ ప్రభావము వీరికి సానుకూలంగా లేదు. గ్రహణ ప్రభావం వీరికి ఉత్తమ ఫలితాన్ని మాత్రమే సూచిస్తుంది. చంద్రుడు వీరికి కార్యహాని రోగాన్ని సూచిస్తాడు. మానసికంగా శారీరికంగా కూడా వీరు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్థులకు రాజకీయ చిక్కులు ఎక్కువగా ఉంటాయి. శని ప్రభావము వీరిపై ఎక్కువగా పనిచేస్తుంది కాస్తంత జాగ్రత్త వహించడం చాలా అవసరం. అశ్వినీ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయ్యింది సానుకూలత ఎక్కువగా ఉంది. కృత్తిక ఒకటో పాదం వారికి విపత్తార ఐనది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువ గా ఉన్నాయి.

పరిహారం : గ్రహము లన్నింటినీ దర్శించడం ప్రదక్షిణలు చేయడం దానధర్మాలు చేయడంమంచిది. ఇరవై రెండో తేదిన స్వయం పాక దానం చేయడం సుబ్రహ్మణ్య పూజ గురు స్తోత్రము శుభ ఫలితాలని ఇస్తాయి.

వృషభ రాశి :

ఈ రాశి వారికి ధనలాభం కుటుంబ సౌఖ్యము శరీర సౌఖ్యము కొంత ఊరటని ఆనం దాన్ని కలిగింప చేస్తున్నాయి. రవి ద్వితీయ ముందుండడం గ్రహణం పట్టడం అలాగే రాహు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల భయము అకారణ కలహాలు ఎక్కువగా ఉన్నాయి. స్వర్ణాభరణాదులను బుధుడు కలుగజేస్తున్నాడు. కుజుడు ధన ప్రాప్తినిస్తున్నాడు గానీ శని అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. కాబట్టి స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంది. మీకు తెలియకుండానే మీ ధనాన్ని గానీ మీ స్థిరాస్తులుగాని దొంగిలించేవారు దగ్గర్లోనే ఉన్నారు. రాజకీయ లేదా కోర్టు వ్యవహారాలయితే ఈ వారంలో మీకు కొద్దిపాటి అనుకూలతలు లభిస్తాయి. భాగ్య మందున్న శని తాలుకా ప్రభావం మీ అనారోగ్యాన్ని సూచిస్తోంది. సూర్యగ్రహణం మీకు మధ్యమ ఫలితాన్ని సూచిస్తుంది. కృత్తికా రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తారయింది కాబట్టి ప్రతి కూలతలు ఎక్కువగా ఉన్నాయి. రోహిణీ వారికి సంపత్తార అయి ధనలాభాదులు ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి జన్మ తార అయింది అనారోగ్య సూచన ఉన్నది.

పరిహారం: సూర్యునకు సూర్యనమస్కారాలు చేయించండి. శనికి నల్ల నువ్వులు నల్లని వస్త్రం నువ్వుల నూనె దానం చేయండి. లేదా శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టండి కొంత ఉపశమనం లభిస్తుంది.

మిథున రాశి :

ఈ రాశివారికి చక్కని ధనలాభము సంతోషం ఉత్సాహం ముందుకు నడిపిస్తాయి. అదే సమయంలో స్థానచలనం జరిగి చిక్కులని భయాన్ని శత్రుబాధ కలిగిస్తున్నది. వీరికి తట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. విపరీతమైన ధన వ్యయము కుటుంబ విషయంలో ఆదాయాన్ని మించిన ధన వ్యయము అనారోగ్య సూచనలు అష్టమ శని ప్రభావం మరణపు అంచుల వరకు తీసుకు వెళుతుంది. రాహు కూడా విపరీతమైనభయాన్ని కేతువు శత్రు వృద్ధిని కలుగజేస్తున్నాడు. అనేక విధాలైన చిక్కుల్ని వీరు ఎదుర్కోవడం ఆత్మన్యూనతని పొందటమూ ఒకానొక సమయంలో విరక్తి భావాలు కూడా కలుగుతాయి. అంతేకాదు సూర్యగ్రహణం కూడా వీరికి అథమ ఫలితాన్ని ఇస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఈ వారంలో బయటపడటం చాలా అవసరం. కుజ బుధులు అనుకూలత మీకు ఎక్కువ ఆనందాన్ని కలగజేస్తుంది. శుక్రుడు మీలో ఉన్న భావాలకి దోహదపడతాడు. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి జన్మ తారైంది అనారోగ్య సూచన చూసుకోండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు పరమ మిత్రతార అయ్యింది కాబట్టి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి మిత్రతార అయింది కాబట్టి ఫలితాలు చాలా బాగుంటాయి.

పరిహారం : కాలసర్ప దోషం వీరికి కొంత వర్తించింది దానికి తోడు గ్రహణ స్థితి బాగాలేదు కాబట్టి రాహు కేతువుల పూజలు చేయించండి గ్రహాలన్నింటినీ ప్రతిరోజు దర్శించండి. ముఖ్యంగా మీకు శని దోష పరిహారార్థం నల్లని వస్త్రము చేనువ్వులు నువ్వులనూనె దానం చేయండి అవకాశముంటే చవితినాడు చిమ్మిలి చేసి పదిమందికి పంచి పెట్టండి.

కర్కాటక రాశి :

ఈ రాశివారికి కొద్దిపాటి లాభము మృష్టాన్న భోజనం సౌఖ్యము కనిపిస్తున్నాయి. అయితే గ్రహముల అనుకూలత తక్కువగా ఉందని చెప్పొచ్చు. ప్రతిపని వాయిదా పడుతూంటుంది. మహా విచారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ ఎక్కువ సానుకూలత తక్కువ. ఒక్క గురుడు మీకు సుఖ సౌఖ్యాన్ని ఇస్తాడు. మీ అంతగా మీరు ఆలోచించిన దైవం అనుగ్రహం కొంత ఉంది కాబట్టి పెద్దల సూచనలు మీకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అది కొంతవరకు ధనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. శనీ ప్రభావమే మీకు కుజుడు ద్రవ్య హాని కలిగిస్తున్నారు. బుధుడు కూడా ప్రతికూల స్థితిలోనే ఉన్నాడు. మీరు ఎవరికీ చెప్పుకోలేని ఇబ్బందుల్ని ఎదుర్కునే అవకాశం ఈ వారంలో ఉంది. వీరికి వ్యయస్థానం మందు గ్రహణము ప్రతికూలతనే ఇస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. పునర్వసు నాలుగో పాదం వారికి సానుకూలత ఎక్కువగా ఉంది ఫలితాలు బాగుంటాయి. పుష్యమి వారికి నైధన తార అయ్యింది కాబట్టి ప్రతి కూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి సానుకూలత ఎక్కువగా ఉంది.

పరిహారం : కుజుడికి మంగళవారం నియమాన్ని పాటించి ఆంజనేయస్వామిని దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య పూజ చేయించండి. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాల నిస్తుంది గ్రహాలన్నింటినీ దర్శించడం మంచిది.

సింహ రాశి :

ఈ రాశివారికి పట్టిందల్లా బంగారముగా మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధనలాభం సౌఖ్యము సంతోషము వీరిని ఉక్కిరి బిక్కిరి చేసే ఆనందానికి అవధులు లేనంత స్థితికి తీసుకుని వెళతాయి. కుటుంబ సౌఖ్యము శుభప్రదమైన కార్యక్రమాలు చేసుకునే అవకాశమూ ఉన్నాయి. అన్నింటినీ మించి ఇంట్లో కల్యాణ కారకమైన ప్రయత్నాలు జరుగుతాయి. వివాహం కావాల్సిన వారికి వివాహం జరుగుతుంది. గృహ సంపాదన భూ సంపాదన ఉద్యోగ సంపాదన వ్యాపారంలో కూడా అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతటి చక్కని అవకాశము ఈ వారంలో మీరు పొందుతున్నారు. విశేష వస్తు సంగ్రహణం చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళితాయి. కానీ కుజప్రభావము ఏదో రకంగా శస్త్ర చికిత్స పొందవలసిన అవసరం ఏర్పడుతుంది. గ్రహణం మీకు చాలా అనుకూలించే స్థితి. అదృష్టవంతులు. మఖ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పుబ్బా నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి విపత్తార అయ్యింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : సుబ్రహ్మణ్య పూజలు చేయించండి. గురుస్తోత్రం చేయండి మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. అంతేకాదు గురు అనుగ్రహం కోసం గురు మంత్రాన్ని పఠించండి .

కన్యా రాశి :

ఈ రాశివారి కూడా ఈ వారంలో చాలా మంచి ఫలితాలున్నాయి. కార్య జయము సౌఖ్యము లాభము సంతోషం సంపద మీ ఆనందానికి దోహదకరం గా ఇవన్నీ కలుగబోతున్నవి. కానీ శని గ్రహ ప్రభావము సంతానానికి ఇబ్బంది కలిగిస్తుంది. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త వహించండి. సప్తమ కుజుడు కార్యాల నన్నింటిని ప్రతికూలింప చేస్తున్నాడు. చతుర్థ మందున్న కేతువు మీకు గౌరవ భంగాన్ని కలిగిస్తాడు.చిన్నచిన్న మాటలకే మీరు పట్టింపులకు పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు ఆదాయం కంటే వ్యయమే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతికూలతలు కూడా మీకు ఈ వారంలో ఎక్కువగానే ఉన్నాయి. కానీ మీ చాకచక్యము నైపుణ్యత వల్ల ముందుకు వెళ్లిపోయి ఆనందాన్ని అనుభూతిని మిగుల్చుకుంటారు. కుటుంబపరమైన సౌఖ్యాలు తక్కువగా ఉన్నా పిల్లలతోనూ కుటుంబ పెద్దల తోనే ఆనందాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇబ్బందికరమైన వార్తలని మీరు విని మానసికంగా కుమిలిపోతారు. అందుకే జాగ్రత్తగా కుటుంబంతో ఉండండి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తు తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది ఆర్థికపరంగా ఆనందాన్ని ఇస్తుంది. చిత్త ఒకటి రెండు పాదాల వారికి జన్మతార అయింది అనారోగ్య సూచన ఉంది జాగ్రత్త వహించండి.

పరిహారం: మంగళవారం నియమాన్ని పాటించండి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి లేదా కుజులకు జపతపాలు చేయించండి మంచి ఫలితాలు పొందుతారు. ఖడ్గమాలా పారాయణ విశేష ఫలితాన్ని ఇస్తుంది .

తులా రాశి :

ఈ రాశివారికి సౌఖ్య లాభాదులు ఉన్నప్పటికీ శత్రు వృద్ధి ఉండుట చేత మానసికంగా వీరు వెనుకడుగు వేయడం మొదలుపెడతారు. వీరికితోడు తొమ్మిదో ఇంట్లో ఉన్న రవి కష్టాన్ని కలుగజేస్తున్నాడు. అదే స్థలంలో బుధుడు ఉండడము గ్రహణం పట్టడం వీరికి వ్యతిరేకంగా ఉందని చెప్పొచ్చు. గ్రహణం ప్రభావం మధ్య మ ఫలితాలు మాత్రమే ఇవ్వగలదు. శుక్ర ప్రభావము మీకు భూ సంపాదన విషయంలో కోర్టు వ్యవహారాలలో ఇది అనుకూలతను కుటుంబ వ్యవహారాల్లో అయితే మీకు స్థిరాస్తిని సంపాదించి పెడతాయి. ఎన్ని ఉన్నా మీకు ఉదర రోగము కడుపు నొప్పి మున్నగునవి వైద్యుల్ని సంప్రదించే స్థితికి తీసుకెళ్తాయి. దీనికి తోడు చంద్రుడు కూడా పూర్తి అనుకూలంగా లేడు ధనప్రాప్తి ఎంత ఉంటుందో ధన నష్టం కూడా అంతే జరగబోతోంది. బుధ గురులు మీకు వ్యతిరిక్తంగా పనిచేసి ద్రవ్య ధన నష్టాన్ని కలుగజేస్తున్నారు. చిత్త మూడు నాలుగు పాదాల వారికి జన్మ తారైంది అనారోగ్య సూచన. స్వాతీ నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయ్యింది మంచి ఫలితాలు ఉన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి మిత్రతార అయింది సానుకూలత ఎక్కువగా ఉంది మంచి ఫలితాలు పొందుతారు.

పరిహారం : నానబెట్టిన పెసలు బెల్లం వేసి బుధవారం నాడు ఆవుకు తినిపించండి మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురుడికి జపం చేయించండి దత్తాత్రేయ స్తోత్రం కూడా మీకు మంచి ఫలితాల్ని ఇస్తుంది.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యము విశేష ధనప్రాప్తి ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం వీరిని వెన్నంటి ఇబ్బంది పెడుతోంది. వీరికి గ్రహణం కూడా చెడు ఫలితాలని ఇస్తుంది కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరం. రోగ భయం ఉంది. కష్టం ఉంది. ద్వితీయ కేతు ప్రభావం చేత కలహాలు ఏర్పడతాయి. కష్టాలు కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. శత్రువుల భయం కూడా ఉంది. శుక్ర ప్రభావంచేత రోగం స్థిరపడే అవకాశం ఉంది. శని వీరికి అనుకూలించి ధనలాభాన్ని చేకూర్చుతున్నాడు. బుధుడు వీరి కోరికలను నెరవేర్చ బోతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా వీరికి ఏటికి ఎదురీత అలవాటయిపోయింది కాబట్టి ఇబ్బందులను తట్టుకునే స్థితి గతి వుంటుంది. దానికి దైవ స్మరణే బలం చేకూరుస్తుంది. విశాఖ నాల్గవ పాదం వారికి మిత్ర తారైంది చాలా అనుకూలంగా వుంది. అనూరాధా నక్షత్ర జాతకులకు మాత్రమే నైధన తారయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ జ్యేష్టానక్షత్ర జాతకులకు సాధన తార అయింది అనుకూలతలు ఫలితాలు మంచిగా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు.

పరిహారం : గురువారం నియమాన్ని పాటించడం గురు జపం చేయడము. మేధా దక్షిణామూర్తి స్తోత్రము యోగ సాధన మంచి ఫలితాలను ఇస్తాయి .

ధనూ రాశి :

ఈ రాశివారికి గురుడు మాత్రమే ధనలాభాన్ని ఇస్తూ బుధుడు స్థిరమైన లాభాలను చేకూరుస్తున్నారు. ఎన్ని ఉన్నా వీరికి విచారము శత్రువుల పీడ తప్పట్లేదు. అపకీర్తి అనేది మీరు కోరి తెచ్చుకున్నదే. శత్రు వృద్ధి భయాన్ని కలుగ జేస్తూ ఉండగా రాజ దండన పొందుతాడేమో అన్నంత భయభ్రాంతులు వీరి జీవితంలో కలుగుతాయి. వీరికి గురుడే కాదు ఆరు గ్రహాల వక్ర ఫలితమో వీరిపైనే పనిచేస్తోంది. వారం మధ్యలో ధనాదాయం మాత్రం బావుంటుంది. అయినా ఎంత తెచ్చిన ఇంట్లో పెట్టలేని పరిస్థితి అవుతుంది. రవి ప్రభావంచేత మీకు అత్యంత విషాదకరమైన సంఘటన ఇంట్లో చోటు చేసుకుని ఇబ్బందిని పొందుతారు. మీ ప్రవర్తన ప్రభుత్వ వ్యతిరేకత లేదా అధికారుల వ్యతిరేకత వలన గానీ దండనకు గురికావలసి వస్తుంది. మూలా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది.చాలా మంచి ఫలితాలని పొందబోతున్నారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి విపత్తు తారైంది ప్రతికూలతలు ఎక్కువ గా ఉన్నాయి.

పరిహారం : మృత్యుంజయ మహా జపం చేయించండి. వీలైతే హోమాదులు జరిపించుకోండి. ద్వితీయ శని చాలా ఇబ్బంది పెడతాడు కాబట్టి శనికి కూడా దానాదులు చేయండి. మీకు మంచి ఫలితాలుంటాయి

మకర రాశి :

ఈ రాశివారికి కొంచెం మంచి ఫలితాలు న్నట్లే చెప్పొచ్చు. శత్రునాశనం జరుగుతుంది. కాబట్టి ఆనందాన్ని పొందగలుగుతారు. విశేష ధన లాభాలున్నాయి. అలంకార ప్రాప్తి ఉంది. బంధుమిత్ర దర్శనాలు ఉన్నాయి. సుఖ సంతోషాలు కూడా వీరికి అమర్చి పెట్టినట్లుగా ఏర్పడుతూ ఉన్నాయి. ఎన్ని చూసినా ద్వితీయ గురు ప్రభావము కుటుంబ స్థానంలో శని ప్రభావాలు వీరిపై ఎక్కువగా పనిచేస్తూనే ఉంటాయి. శని ప్రభావం చేత గొప్ప ఆపదని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గురు ప్రభావం చేత స్థానాన్ని మార్చవలసి వస్తుంది. అంతే కాదు గురుని అనుకూలత తక్కువ అవడం వల్ల ఆలోచన తగ్గి ఆపదల్ని కొనితెచ్చుకుంటారు. బంధుమిత్రుల సహకారం మాత్రం సకాలంలో అందుతుంది. అది మిమ్మల్ని కొంత ఉపశమనం జేసి ఆనందాన్ని కలిగిస్తుంది. తృతీయ మందున్న కుజుడు మీకు మంచి ఫలితాన్ని ఇచ్చి కష్టంలో కూడా సుఖ భోగాలని కలిగింప చేస్తాడు. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తు తారైంది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు సంపత్తార అయ్యింది విశేష ధన లాభాన్ని పొందబోతున్నారు. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి జన్మతార అయింది కుటుంబ అనారోగ్య సూచనలు ఉన్నాయి.

పరిహారం : శనికి జపం చేయించండి హోమం చేయించండి అలాగే గురువారం నియమాలు పాటించండి. దత్తాత్రేయ స్తోత్రం గాని మేధా దక్షిణా మూర్తి స్తోత్రం గాని పఠించండి.

కుంభ రాశి :

ఈ రాశివారికి మధ్యమ ఫలితాలు ధనలాభం స్త్రీ సౌఖ్యం ఉన్నాయి. గ్రహణ ఫలితం కూడా మధ్యమంగానే ఉంది. కష్టాలు కడగండ్లు ఎక్కువయ్యాయి అనే చెప్పాలి. ఈ జాతకునకు పట్టిన ఇబ్బంది వల్ల ఎవరూ అడిగినా ఇతని ద్వారా ఏ పని ప్రారంభించినా ప్రతికూలతలే అవుతాయి. ఈ చెయ్యి మంచికి పనికి రాదేమో అన్న ఆత్మన్యూనతకి కారణాలు ఈ వారంలో మీరు చూడబోతున్నారు. అనేక రకాలుగా నష్టాన్ని అవతల కుటుంబపరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాల ఇక్కట్లు ఒకేసారి చుట్టుముట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. వీలైతే ఇంటి నుంచి వెళ్లిపోతే బాగుంటుందేమో అనే భావాలు మీకు కలగడం సహజం. మీకు శుక్రుడు తప్ప ఇంకే గ్రహం తాలూకు అనుకూలత లేదు. ఆ శుక్రుడైనా సరే మీకు చతుర్ధమందు ఉన్నాడు కాబట్టి కుటుంబ స్త్రీల సహకారంతో మీరు నెమ్మదిగా బయటకి రాగలుగుతారు. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి జన్మ తారైంది అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తారైంది కొద్దిపాటి అనుకూలత ఉంది. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి మిత్రతార అయింది కాబట్టి మంచి ఫలితాలని పొందబోతున్నారు.

పరిహారం : శని ప్రభావం తగ్గడానికి నల్లని నువ్వులు నల్లని వస్త్రము నువ్వులనూనె ఈ మూడు విశేషంగా ఎక్కువ పరిమాణంలో దానం చేయండి. గురుని గూర్చి జపము హోమము లేదా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం మంచి ఫలితాన్ని ఇస్తాయి.

మీన రాశి :

ఈ రాశివారికి ధనలాభము శత్రుజయం ఇవి ఉత్సాహాన్నిచ్చి ముందుకు నడిపిస్తాయి. గ్రహణ ప్రభావం కూడా వీరికి అశుభ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కొంత వ్యక్తిగతంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అడుగడుగు నా వీరికి అవమానాలు తప్పడం లేదు. అవి వీరి ప్రమేయం లేకుండా నిందారోపణలతో జరుగుతూ ఉంటాయి. రవి రాహుల యొక్క కలయిక నాలుగో ఇంట్లో జరగటం వల్ల ఆ ఇబ్బందులు ఎదురవుతాయి. వైద్యుల సలహాలు తీసుకోవాల్సి రావడమే కాదు చికిత్స కూడా పొందవలసిన అవసరం ఏర్పడుతుంది. లగ్నంలో ఉన్న కుజుడు మీకు మహా విచారాన్ని కలిగించవచ్చు. ఈనాడు ఉద్యోగ భంగం గానీ వ్యాపార భంగంగానీ పదవీ భంగంగానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. వాక్ స్థానం అధిపతి కూడా మీకు అనుకూలంగా లేడు. బుధ గురులు మీకు వాక్ స్థానము జ్ఞాన స్థానమును స్థిర పరుస్తారు కాబట్టి వారి ద్వారా మీరు శుభ ఫలితాలను పొందగలుగుతారు. తృతీయ మందు రవి చంద్రుల కలయిక మంచి మనస్సును మంచి ఆలోచనను మీకు కలగజేస్తాయి. పూర్వాభాద్ర నాలుగవ పాదం వారికి విపత్తార అయింది ప్రతికూలత ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సంపత్తార అయ్యింది మంచి ఫలితాలు పొందనున్నారు. రేవతి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్త వహించమని హెచ్చరికలు ఇస్తున్నది.

పరిహారం : మంగళవారం నియమాల్ని పాటించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజలు చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు. నిరంతరము హనుమత్ ప్రార్థన మీకు శుభ ఫలితాల్ని ఇస్తుంది.

Next Story