జూన్‌ 7 ఆదివారం నుంచి జూన్ 13 శ‌నివారం వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2020 5:34 AM GMT
జూన్‌ 7 ఆదివారం నుంచి జూన్ 13 శ‌నివారం వ‌ర‌కు

మేష రాశి :

ఈ రాశివారికి సుఖ సౌఖ్యాలు లాభాదులు ధనప్రాప్తి చక్కగా ఉన్నాయి. కానీ శత్రుపీడ శారీరక శ్రమ తప్పదు. సంపదలు సమకూరుతాయి కానీ శత్రువుల వృద్ధి వల్ల అలాగే ఖర్చు ఉంటుంది. ఒకానొక సమయంలో అధికారులచేతనైనా దండించబడ్డం కానీ అనుకోకుండానే ఒక విపత్తును ఎదుర్కోవడం గానీ లేదా రక్షక భటులచే దండించబడటం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మిమ్మల్ని ఎప్పటినుంచో పీడిస్తున్న వ్యక్తులు మీ మీద విజయం సాధించి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయనున్నారు. మీ విషయంలో అధికార దుర్వినియోగం జరిగిందని అపనింద కూడా మీ మీద వేయనున్నారు. మీకు కుజుడు శుక్రుడు రాహు సానుకూలంగా స్పందిస్తే తతిమా గ్రహాలన్నీ కూడా అంతో ఇంతో ఇబ్బందిని కలుగజేస్తూ ఉన్నాయి. మీకు శారీరిక మానసిక సౌఖ్యాలు లేకుండా చేస్తున్నాయి. అశ్వినీ నక్షత్ర జాతకులకు జన్మ తారైంది కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి. భరణీ నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తారైంది మధ్యే మార్గంగా నడుస్తుంది. కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారికి మాత్రం మిత్ర తారైంది కాబట్టి మంచి ఫలితాలనిపొందగలుగుతారు.

పరిహారం : బుధ గురులు జప తర్పణలు చేయించండి నానబెట్టిన పెసలు బుధవారం నాడు ఆవుకి తినిపించండి శనగలు దానం చేయండి.

వృషభ రాశి :

ఈ రాశివారికి స్వర్ణా భరణి ప్రాప్తి శారీరక సౌఖ్యం అద్భుతంగా ఉన్నాయి. కానీ ఎటువెళ్లినా ఏ మాట మాట్లాడినా తగువులు గొడవలకు కారణం అవుతుంది. మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ధనలాభం ఉంది కదా అని ముందుకు వెళితే అంతా వ్యయం అయిపోయి కూర్చుంటుంది. ముఖ్యమైన కొన్ని వస్తువులు లేదా ముఖ్యమైన కాగితాల లాంటివి పోగొట్టుకుంటారు. అయితే ఈ వారంలో దొరకదు వచ్చే వారంలో దొరికే అవకాశం ఉంటుంది. ఆత్మ న్యూనతా భావం చేత మృత్యుభయం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. పైగా స్థాన చలనాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. రాజ దండన ఉందని భయపడవలసిన అవసరమైతే లేదు కానీ ప్రతిరోజూ శివ సందర్శనం చేయండి. కృతిక రెండు మూడు నాలుగు పాదాలు వారికి మిత్ర తార అయ్యింది చాలా మంచి ఫలితాలు పొందబోతున్నారు. రోహిణి వ నక్షత్ర జాతకులకు నైధన తారైంది ఫలితాలు చాలా వ్యతిరిక్తంగా ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి సాధన తార అయ్యింది కాబట్టి అనుకున్న పనులు నెరవేరుతాయి.

పరిహారం : శని ప్రభావం వుంది కాబట్టి శనికి జపం చేయించండి. నల్లని నువ్వులు నల్లని వస్త్రము పుచ్చుకునే వ్యక్తి శరీరంపై వినియొగించుకునే విధంగా దానం చేయండి.

మిధున రాశి :

ఈ రాశివారు ఎన్నడూ లేనంత హీనతను చూడబోతున్నారు. గత వారం కంటే మరీ ఇబ్బంది కరమైనటువంటి వారంగా చెప్పచ్చు. ఉద్యోగ లేదా రాజకీయ సమస్యలు ఒకప్రక్క వేధిస్తూ ఉంటే కుటుంబ వ్యవహారాలు చక్కబరచే సరైనటువంటి వ్యక్తులు మీకు లభించక ఉన్న ఉత్సాహం కూడా దుర్వినియోగం అయిపోయే పరిస్థితి ఉంది. నిరాశ నిరాసక్తత మధ్యే మార్గంలో మీరు ఈ వారాన్ని అతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గడపవలసి వస్తుంది దానికి భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు మీరు మానసికంగా సన్నద్ధులై ఉండండి. అనుకోని సమస్యలు మీకు ఎదురై మీలో ఉండే మీ బుద్ధి జ్ఞానాన్ని కూడా పనిచేయకుండా ఆలోచించుకునే సమయం కూడా లేకుండా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. మీ శత్రువర్గం అంతేకాదు కుటుంబంలో కూడా వ్యతిరేకత అనాదరణ అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. విపరీతమైన ధన వ్యయం ఆరోగ్య విషయంలో గానీ తల్లిదండ్రుల విషయంలో కూడా జరిగిన ఆశ్చర్య పడవలసిన అవసరము లేదు. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి పరమ మిత్ర తారైంది. చాలా చక్కనైనా ఫలితాలు పొందగలుగుతున్నారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది ఫలితాలు చాలా క్లిష్టంగా ఉంటాయి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తారైంది మంచి కుటుంబ వ్యవస్థని పొందగలుగుతారు.

పరిహారం : కాలసర్ప యోగం పరిపూర్ణంగా వర్తిస్తుంది. చంద్రబలం తక్కువ రాహు కేతు శని గ్రహాలకు జపాలు దానాలు చేయించండి శుభ ఫలితాలని పొందగలుగుతారు.

కర్కాటక రాశి :

వీరికి ధన లాభాదులు సుఖ సౌఖ్యాలు మంచి పరిచయాలు ఉన్నత స్థితికి తీసుకుని వెళుతున్నాయి. ఈ వారంలో వీరు మంచి స్థితిని పొందగలుగుతారు. ఇతః పూర్వం వరకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయా అన్నంత ఆనందాన్ని పొందుతూ ముందుకు సాగిపోతారు. సప్తమంలో ఉన్న శని ప్రభావం వీరికి విచారాన్ని కలుగజేస్తుంది. బుధుడు తృతీయ వ్యయాధిపతి అవుతూ వ్యయ మందు ఉండడం రాహువు తో కలవటం వల్ల వీరికి చాలా సమయం వృథా అవుతుంది. శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రం వీరు చివర్లో పొందగలుగుతారు. శస్త్రచికిత్స పొందకుండా ఉండాలి అంటే వాహనాలు నడిపేటప్పుడు ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. గురుడు వీరికి కావల్సినటువంటి మార్గాన్ని సూచిస్తాడు కాబట్టి వీరికి మంచి ధన లాభాదులు ఈ వారంలో పొందుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది చాలా ప్రయోజనకరంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రయోజనాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది విశేష లాభాన్ని పొందగలుగుతారు.

పరిహారం : శనివారం నాడు నవగ్రహ దర్శనం చేయండి. ప్రతిరోజూ శివదర్శనం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. హనుమత్ స్తోత్ర పఠనం చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

సింహ రాశి :

ఈ రాశివారికి శుభ పరంపరలు కొనసాగుతున్నాయి. విశేష ధన లాభము కార్య జయము వీరిని చక్కగా ముందుకు నడిపిస్తుంది .అనుకోని సంఘటనల ద్వారా ధనం అందుతుంది. కుటుంబ సంతోషం చాలా రకాలుగా పొందగలుగుతారు. ఆలోచనలు ఎక్కువ ఆచరణలో మాత్రం కొంచెం తగ్గిపోతారు గానీ ఆనందం హద్దులు దాటుతుంది. వీరి దానాదులు కి కూడా అడ్డు లేదు. మంచి సహకార భావాలు వీరు కలిగుంటారు. ఇతరులకు సహకారం కూడా చేసి స్థిరాస్తి వ్యవహారాలు కూడా బావుంటాయి. మీరు వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఎక్కువ చేయండి దీనివల్ల చాలా పనులన్నీ నెరవేరడమే కాదు పై స్థాయి అధికారులు కూడా మీకు సహకరిస్తారు .అధికారుల ద్వారా వ్యాపారంలోనూ గొప్ప లాభాన్ని ఆర్జించ గలుగుతారు. మఖ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. పుబ్బ నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది కాబట్టి పర్వాలేదు బాగుంది. ఉత్తర ఒకటో పాదం వారికి మిత్ర తారైంది చాలా అనుకూలమైన వారంగా చెప్పొచ్చు. వీరికి కుజుడు కార్య విఘ్నాన్ని కలిగిస్తాడు

పరిహారం : మంగళవారం నాడు సుబ్రహ్మణ్యుని పూజ చేయండి లేదా ఆంజనేయ స్వామిని దర్శించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

కన్యా రాశి :

ఈ రాశివారికి వారం ప్రారంభం కొంచెం సాదా సీదాగా వున్నప్పటికీ మధ్యలో చక్కని ధనలాభాదుల్ని పొందగలుగుతారు. సంతాన విషయంలో మాత్రం వీరు ప్రతీక్షణము జాగ్రత్త వహించడం చాలా అవసరము. మీరు సంతోషాన్ని అనుభూతిని పొందగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు బాగున్నాయి. కుటుంబ పరంగా కూడా కొంత బాగుంది. మీకు గౌరవ భంగం మాత్రం ఎక్కడికి వెళ్లినా ఉంటున్నది. దాన్ని అధిగమించే ప్రయత్నంలో మీరు కొన్ని విషయాల్లో మార్పుల్ని సంతరించుకోవాలి. మానసిక దృఢత్వాన్ని ముందుగా మీరు పొందండి. ప్రత్యేక పథకం సాధన ద్వారా మీరు పనులు చేయాలని ప్రయత్నించండి. తొందరపాటును విడిచిపెట్టండి. లోపల మానసిక ఆందోళనను తగ్గించుకోండి. దానివల్ల మీకు చక్కనైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మీ ఆలోచనలు స్థిరంగా లేకపోవడమే మీకు కార్య హానిని తెచ్చి పెట్టేస్తున్నాయి. సామర్థ్య మైతే ఉంటుంది గానీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడము దాని ద్వారా మీరు సంఘంలోకి వెళ్లలేకపోవడం ఇవన్నీ ఉన్నాయి. మీ మానసిక ఆందోళనే మిమ్మల్ని వెనక్కి లాగేస్తోంది కాబట్టి దృఢత్వము స్థిరత్వం సంపాదించుకోండి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి మిత్రతార అయ్యింది చాలా బాగుంది. హస్త వారికి నైధన తారైంది కాబట్టి అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించండి. చిత్త ఒకటి రెండు పాదాల వారికి సాధన తారైంది పనులన్నీ చక్కబడతాయి.

పరిహారం : రవిచంద్ర స్థితి బాగాలేదు కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. ఏకాగ్రత కోసం యోగా సాధన చేయండి. గురు స్తోత్ర పారాయణ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచివి .

తులా రాశి :

ఈ రాశి వారికి ఈ వారంలో సంపదలు చేకూరినా అనారోగ్యము కార్య ఆటంకములు చాలా ఎక్కువగా ఉన్నాయి. భూ సంబంధమైన వ్యవహారాల్లో శుక్రుడు ప్రభావం చేత మీరు గెలుచుకోగలుగుతారు. మీకు బుధగురులు ఇద్దరు కూడా ధన నష్టాన్ని కలుగజేస్తున్నారు. శని అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహరించడం చాలా అవసరం. కేతు ప్రభావం చేత మీకు ఇష్టమైన పనుల మీద మనసు లగ్నం చేస్తే నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీకు ఇష్టమైన పనులేవీ అనేది నిర్ణయించుకుని వాట్ల యందు మనస్సు లగ్నం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు సానుకూలంగా ఉంటుంది. దీర్ఘ వ్యాధులు ఉన్న వారు తప్పకుండా వైద్యాలయంలోనే ఉండవలసిన వస్తుంది. ఉదరసంబంధమైన రోగం కూడా బయట పడుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. శని అర్థాష్టమఁ కాబట్టి అతని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అది కూడా మీకు పాత కక్షల్ని తీర్చుకునే వ్యక్తులు మీకు ముందు బయటపడతారు. వారి ద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. చిత్త మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది పనులన్నీ సమకూరుతాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రత్యేక్ తారైంది కాబట్టి పనులు నెరవేరడం కష్టం. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తారైంది కాబట్టి ఫలితాలు బాగున్నాయి.

పరిహారం : శనికి నల్లని నువ్వులు, నువ్వుల నూనె దానం చేయండి. శనీశ్వరుడి దర్శనం చేసుకోండి. శనివారం నియమాన్ని పాటించండి ఫలితాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి ధన లాభం ఉంది. కానీ చీటికి మాటికి మీరు గొడవ పడే తత్త్వం వల్ల ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని పనులు మాత్రం నెరవేరుతాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తలు వహించండి. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందుగానే వైద్యులు సంప్రదించడం ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శత్రుపీడ ఉంటుంది కాబట్టి మీరు చాల జాగ్రత్తగా వ్యవహరిస్తే గాని గ్రహస్థితి అనుకూలించదు. ఈసారి రాహు ప్రభావం చేత విలువైన కాలాన్ని విలువైన వ్యక్తుల్ని కూడా మీరు పోగొట్టుకుంటారు. గురుడు కూడా మీకు కొంచె కష్టాన్ని కలిగించ బోతున్నాడు. విచారం పడినందువల్ల ప్రయోజనం ఉండదు గానీ ముందు జాగ్రత్త చర్యగా ఉన్నట్లయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు. విశాఖ నాలుగో పాదం వారికి క్షెమ తారైంది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. అనూరాధ నక్షత్ర జాతకులకు విపత్తార కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు సంపత్తు తార అయింది కాబట్టి వీరికి ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది.

పరిహారం : సూర్య నమస్కారాలు చేయండి శుక్ర గ్రహానికి ప్రీతిగా శుక్రవారం నియమాన్ని పాటించడం అమ్మవారి పూజ నిత్యం ఖడ్గమాలా పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ధనూ రాశి :

ఈ రాశివారికి చక్కని భోజన సౌకర్యం ధనలాభం సకల భోగాలు అందబోతున్నాయి. అపకీర్తి శత్రు వృద్ధి ఇవి మిమ్మల్ని బాగా వెనక్కి లాగేస్తాయి ముఖ్యంగా గురుడు మీకు పురస్కరానికి అనుకూలంగా ఉన్న వక్రించి ఉండడం వల్ల అది మీకు చిన్న ఇబ్బందిని కలగచేస్తోంది. శుక్రుడు రవి షష్టమ మందుండడం ఇవన్నీ మీకు ఇబ్బందిని కలుగజేసే వ్యవస్థ. శని మీకు పూర్తిగా ద్వితీయ ముందున్నాడు గనుక ధన స్థానంలో ఉన్నాడు ధన హాని జరుగుతుంది. బంధు మిత్ర ప్రాణహానికి ఉంది అలాగే ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాడు. విలువైన సమయం దుర్వినియోగం కూడా అయిపోతుంది. రాహు కేతు ప్రభావం మీపై కచ్చితంగా ఉంది కాల సర్ప యోగం మీకు పూర్తిగా వర్తిస్తుంది. మూలా నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి అనారోగ్య సూచనలున్నాయి. పూర్వాషాఢ వారికి పరమమిత్రతార అయ్యింది అనుకూల పరిస్థితులున్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మిత్ర తారైంది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి.

పరిహారం: శనికి జపం చేయించడం నల్లనువ్వులు నువ్వుల నూనె దానం చేయడం శనివారం నియమాన్ని పాటించడం శనివారంనాడు తల రుద్దుకొని శని సందర్శనతోపాటు శివ సందర్శన చేసుకోవడం చాలా మంచిది .

మకర రాశి :

ఈరాశి వారికి కుటుంబ సౌఖ్యము బంధువు దర్శనం సుఖ జీవితం ఈ మూడు చక్కగా అమరుకున్నాయి. ఏదో ఒక భయం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ మీకు ఇబ్బందిని కలగజేస్తుంది. రవి పంచమంలో ఉండడమే దీనికి కారణం. కుజుడు మీకు ఉన్న సౌఖ్య లన్నింటినీ వెనక్కి లాగేసి మిమ్మల్ని హీనస్థితికి దిగజార్చే ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అన్ని విధాలా మిమ్మల్ని నిరుత్సాహపరచే స్థితి ఈ వారంలో కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. బంధువులు వల్ల కూడా మీరు ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఒక్క రాహు మీకు కొంచెం మేలు చేయబోతున్నాడు. గురుడు స్థానచలనాన్నిస్తున్నాడు అది దైవ సంబంధమైనస్థలం ఐతేనే మీరు అంగీకరించండి. లేకపోతే అక్కడికి వెళ్లకండి. ఈ జాగ్రత్తలు మీరు వహించడం చాలా అవసరం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి మిత్రతార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు. శ్రవణానక్షత్ర జాతకులు నైధన తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి సాధన తారైంది పరిస్థితులనుబట్టి పనులన్నీ నెరవేరతాయి.

పరిహారం : విష్ణు సహస్రనామ పారాయణ మీకు మనశ్శాంతిని కలుగ జేస్తే గురుచరిత్ర గురు దర్శనం దక్షిణామూర్తి స్తోత్రం ఇవి మీకు కార్య సాధనాన్ని కలిగిస్తాయి.

కుంభ రాశి :

ఈరాశివారికి కొంత మధ్యమంగా ఈ వారం నడుస్తుంది. ధనమైతే వస్తుంది కానీ అంతకంతా ప్రక్కనే ఇబ్బంది కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నిటా నష్టాన్ని మీరు పొందుతారని చెప్పాల్సివస్తున్నందుకు ఇబ్బందిగా ఉంది. అగౌరవం ధనవ్యయం విచారం నష్టం ఇవన్నీ మీరు ఈవారంలో చూడబోతున్నారు. ఒక స్త్రీ సౌఖ్యం కుటుంబ పరంగా కావచ్చు పైనుండి సహకరించేవారని పై అధికారులు కావచ్చు వ్యాపార సంబంధమైన వారు కావచ్చు వారు మాత్రమే మీకు సహకరిస్తారు. ఆ సమయంలో మీరు మరికొంచెం జాగ్రత్త వహించినట్లయితే ధనలాభాన్ని పొంది కొంచం పరిస్థితులు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చక్కనైన కుటుంబ వ్యవస్థని దాటి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇది మీకు చాలా ఉపకరిస్తుంది. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి సాధన తారైంది పనులన్నీ నెరవేరతాయి. శతభిషం వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి కుటుంబపరంగా హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు.

పరిహారం : వ్యయ శనికి నువ్వులు దానం చేయండి శనివారం నాడు ఉపవాసం ఉంటే మీకు ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఆ రోజు ఒక పేద బ్రాహ్మణులకు ఏదైనా దానం చేయండి శనిని స్మరించండి శని శ్లోకం చదవండి.

మీన రాశి :

ఈరాశి వారికి సంపదలు సౌఖ్యాలు లాభాలు అన్నీ ఇబ్బడి ముబ్బడిగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. గొప్ప ఆనందాన్ని సౌఖ్యాన్ని ధనాన్ని పొందుతారు. కానీ ఒక దగ్గర గౌరవ భంగాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. రాహు మీకు ప్రతికూలతను సూచిస్తున్నాడు కాబట్టి దాని ప్రభావంతోనే మీరు ఏ పని చేపడతారో అది ప్రతికూలంగా మారుతుంది. అలా గే వ్యయ మందున్న కుజుడు కష్టాన్ని కలుగజేస్తున్నాడు. చంద్రుడు మీకీసారి ఎక్కువగా శుభాల్ని కలుగజేస్తున్నాడు. ప్రతి ఒక్క గ్రహము మీకు ఈ వారంలో చాలా అనుకూలంగా పనిచేస్తూనే ఉన్నాయి కాబట్టి అనంతమైన శుభఫలితాన్ని మీరు పరంపరగా ఒకదాని వెంట ఒకటి ఈ వారంలో పూర్తి స్థాయిలో పొందగలుగుతారు. బుధ ప్రభావం చేత శత్రువుల మీద మీరు జయాన్ని సాధించేస్తారు. ఖర్చులు ఎప్పుడూ ఉన్నవే వాటిని గూర్చి మీరు పెద్దగా పట్టించుకోరు. దానికి తగిన ఆదాయం ఉంది కాబట్టి. పూర్వాభాద్ర నాల్గో పాదం వారికి క్షేమ తారైంది పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉత్తరాభాద్ర వారికి మాత్రమే విపత్తు తార అయ్యింది కాబట్టి ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు సంపత్తు తార అయింది కాబట్టి మంచి ఫలితాలు మంచి ఆర్థిక వనరులు సమకూరుతాయి.

పరిహారం : కుజుడికి మంగళవారం నియమం పాటించండి కాలసర్ప యోగ దోషానికి రాహు కేతువులకు పూజ చేయించండి. బుధవారం నియమాన్ని పాటిస్తే శత్రువులపై అధికారాన్ని సాధించగలుగుతారు.

Next Story