రాశి ఫలాలు నవంబర్ 3 నుంచి 9 వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 10:28 AM GMT
రాశి ఫలాలు నవంబర్ 3 నుంచి 9 వరకు

మేష రాశి: ఈ రాశి వారికి చంద్రుడు రాజ్యంలోని సముని స్థానమైన మకరం లోకి ప్రవేశిస్తున్నాడు కనుక దైవ చింతన పెరుగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. వారాంతంలో రవి తో కుజుని కలయిక ధైర్యాన్ని ఇస్తుంది. ఉచ్చ స్థానాధిపతి నీచలో ఉండటం వలన తాను తక్కువ వాడిననే భావన కలుగుతుంది. బంధువులు చేరువయ్యే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని ఒక కంట కనిపెట్టండి. గురుడు మూల త్రికోణం, స్వక్షేత్రం అయిన ధనస్సులో ప్రవేశం మంచి ఫలితాలను ఇస్తుంది. శని తో కలయిక వల్ల స్నేహితుల సహవాసం అపకీర్తి కారణం. కొంచెం దూరంగా ఉండండి. వారి వ్యక్తిగత విషయాలలో కల్పించుకోవద్దు. మీ మాట చెల్లుబాటు ప్రారంభం కాబోతున్నది. అశ్విని వారికి విపత్తారతో వారం ప్రారంభం కాబట్టి మాటలు కటుత్వం రాకుండా చూసుకోండి. ధరణి వారికి సంపత్తార తో వారం ప్రారంభం ఆర్థికంగా పుంజుకుంటారు. కృత్తిక వారికి జన్మతార కావున ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.

పరిహారం: ఆరోగ్యం కోసం సూర్యోదయానికి ముందే లేచి సూర్యనమస్కారాలు చేయండి. ఆది, గురువారాల్లో దైవధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.

వృషభ రాశి: ఈ రాశివారికి సప్తమంలో శుక్రుడు మంచి కళలకు ప్రాధాన్యత ఇచ్చినా వారం మధ్యలో గురుడు అష్టమి లోకి మారడం వల్ల తల్లిదండ్రులు, గురువులతో విభేదాలు తలెత్తుతాయి. అయితే మీ అదృష్టం ఏమంటే స్వక్షేత్ర గురుడు మీ పై చెడు ప్రభావం పెద్దగా చూపడు. సముడైన శనితో కలయిక వలన మానసికమైన ఆందోళన కనిపిస్తుంది. ద్వితీయ రాహువు, పంచమ కుజుడు పిల్లల ద్వారా వ్యయాన్ని కలిగించవచ్చు. అది కూడా విందులు, వినోదాలు పేరుతో.. ఖరీదైన ఒక కొత్త వస్తువును ఇంటి అవసరాల కోసం కొంటారు. కృత్తిక వారికి జన్మతార తో వారం ప్రారంభం కాబట్టి ఆరోగ్యం విషయంలో దృష్టి పెట్టండి. రోహిణి వారికి పరమమిత్ర తార కావున మధ్యమంగా ఉంటుంది. మృగశిర వారికి మిత్ర తార తో వారం ప్రారంభం అనుకూలత తక్కువ.

పరిహారం: ఏకాంత స్థలము లో ప్రతిరోజూ కూర్చుని ధ్యానం చేయండి. దత్తాత్రేయ స్తోత్రం లేదా గురు చరిత్ర పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.

మిథున రాశి: ఈ రాశివారికి లగ్నాధిపతి బుధుడు వక్రిస్తూ వెనక్కి రావడం వల్ల ఆత్మపరిశీలన చేసుకుంటారు. సరిదిద్దు కొంటారు. సంతానానికి అనారోగ్యానికి కారణం లగ్నంలో రాహువు, సప్తమములో శని. అయితే ఆనందాన్ని కూడా సంతానం వల్లనే పొందగలరు. ధైర్యం సడలకుండా చూసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో గురుడు స్వక్షేత్ర వ్యక్తి అవుతాడు కాబట్టి ధైర్యసాహసాలు పెరుగుతాయి. అష్టమి చంద్రుడు మొదట్లో బాధించినా 5వ తేదీ నుండి ఉత్సాహ, ప్రోత్సాహాన్ని ఆర్థిక లాభాలనీ కలుగజేస్తాడు. కాబట్టి 5వ తేదీ దాటాక కొత్త వ్యాపార ప్రారంభం కలిసి వస్తుంది. మృగశిర వారికి మిత్ర తార తో ప్రారంభం చాలా బావుంది. ఆరుద్ర వారికి నైధనతార తో ప్రారంభం కాబట్టి ప్రతికూలత ఉంది. జాగ్రత్త వహించడం మంచిది. పునర్వసు వారికి సాధన తార స్నేహితుల సహకారాన్ని ఇస్తుంది.

పరిహారం: నాన వేసిన పెసలు బెల్లం కలిపి బుధవారంనాడు ఆవుకి తినిపించండి. బియ్యం పరమాన్నం బెల్లంతో చేసి భగవంతునికి నివేదన పెట్టండి. ఏ పనికైనా వెళ్ళేటప్పుడో చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే మంచి జరుగుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారికి ఐదవ ఇంట గురుడు ఇప్పటివరకు కొంత మేలు చేస్తారు. గురువు సముడు అయిన శని తో కలయిక కొంచం అనాదరణకు కారణమవుతుంది. కానీ గురుడు మూల త్రికోణ స్వక్షేత్ర వర్తి కాబట్టి బుద్ధి మాంద్యాన్ని అధిగమించే అవకాశం ఇస్తాడు. శుభకార్యాల దిశగా కుటుంబ ప్రయత్నాలు కొనసాగుతాయి. ధనదాయం బాగుంటుంది. ఈ వారం మధ్యలో మీ మిత్రులు ఏదడిగినా ఎటూ తేల్చుకోలేక తటస్థంగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రుల సేవ, గురు సేవ మీ బలాన్ని పెంచుతాయి. కొత్త పనుల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. చంద్రుడు మీకు అనుకూలం అవుతున్నాడు. రాజ్యాధిపతి రవి నీచ స్థానం వర్తి కాబట్టి మీ పనులు తల్లి ద్వారా నెరవేరుతాయి. వారాంతంలో తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. గతంతో పోలిస్తే కొంచెం ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికంగా సమ ఫలం ఉంటుంది. పునర్వసు వారికి కార్య సాధన దిశగా మిత్రలాభం. పుష్యమి వారికి ప్రత్యక్తార తో వార ప్రారంభం కాబట్టి దైవభక్తితో కార్య సానుకూలత జరుగుతుంది. ఆశ్లేష వారికి క్షేమ తారతో వార ప్రారంభం కావున భవిష్యత్తు కి మంచిది పునాదులు పడతాయి.

పరిహారం: దక్షిణామూర్తి స్తోత్రం, దత్తాత్రేయ చరిత్ర సత్ఫలితాలను ఇస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ కార్యజయం ఇస్తుంది. గురువారం నాన వేసిన కొమ్ము సెనగలు తినడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉన్నాయి.

సింహరాశి: ఈ రాశివారికి చతుర్థ పంచమాలలో గురు సంచారం కావున అన్ని రకాలుగా ముందుకు వెళతారు. తల్లిదండ్రులు, గృహము, భూమి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కోరకుండానే వస్తాయి. లగ్నాధిపతి రవి తృతీయ లో ఉండటం అక్కా చెల్లెళ్లతో విరోధము పిల్లలతో కూడా విబేధాన్ని సూచిస్తుంది. ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చి కార్య రూపం దాలుస్తాయి. అప్పుడప్పుడూ పక్కవారితో అకారణ వైరం ఉంటుంది. గురువారం నుంచి మనసు కుదుటపడుతుంది.పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. వారాంతంలో విజయాలు సాధిస్తారు. మఖవారికి విపత్తార తో ప్రారంభం కావున చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. పుబ్బ వారికి ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తర 1వ పాదం వారికి జన్మతార తో ప్రారంభం కావున శ్రమ అధికమవుతుంది.

పరిహారం: కొమ్ము శెనగలు దానం, కనకాంబరం రంగు వస్త్రాలు మేలు చేస్తాయి. నదీస్నానం మంచిది. సూర్యోదయం సరికి దీపం పెట్టిన సత్ఫలితాలను పొందుతారు. గణపతి దర్శనం కూడా శుభదాయకమే.

కన్యారాశి: ఈ రాశివారికి గురుడు స్వ క్షేత్రంలోకి వెళ్లడం వలన 4 వ ఇంట శని ప్రభావం తగ్గుతుంది. మంచి ఆలోచనలు, నేర్పరితనము చూపించగలుగుతారు. రాశిలో కుజుడు శారీరిక శ్రమ, ఆందోళనలను సూచిస్తున్నాడు. మీపై మీకు సన్నగిల్లిన విశ్వాసం మళ్లీ పెరుగుతుంది. ధనస్థానము నందు బుధుడు వ్యాపారాభివృద్ధిని సూచిస్తున్నాడు. పిల్లలతో ఆనందాన్ని పంచుకుంటారు. వారాంతంలో కుజుడు కూడా లభిస్తాడు. ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు తృతీయము నందు ఉండటం వలన ధన లాభం ఉంది. కానీ ఆరోగ్యరీత్యా వ్యయ సూచన కూడా ఉన్నది. మాట్లాడటంలో నేర్పు ఓర్పు అవసరం. ఉత్తర వారికి జన్మతార అనారోగ్య సూచన. హస్త వారికి ఈవారం లాభదాయకం. చిత్త వారికి మిత్ర తార కాబట్టి శుభఫలితాలు ఎక్కువ.

పరిహారం: శివునకు అభిషేకము, మారేడు దళాలతో పూజ చేయటంతోపాటు రావిచెట్టు ప్రదక్షణ శుభాన్ని కలిగిస్తుంది.

తులారాశి: ఈ రాశివారికి తను స్థానాధిపతి శుక్రుడు ధన స్థానంలో ఉండటం ఆర్థిక లాభం ఉంటుంది. రవి తను స్థానంలో ఉండటం వల్ల నలతగా ఉంటుంది కళ్లకు సంబంధించి జాగ్రత్త అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఓ సారి వైద్యుని సంప్రదించటం, ముందు జాగ్రత్త తీసుకోవటం మంచిది. తృతీయ గురుడు మూల త్రికోణ వర్తి కావున మంచి ఆలోచనలు, సంఘంలో మాటకు విలువ, గౌరవం కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువ అని చెప్పాలి. 7 8 9 తేదీలలో శుభవార్తలు వింటారు. చిత్త వారికి శుభ ఫలితాలు ఎక్కువ. స్వాతి వారికి నైధిన తారతో వారప్రారంభం కావున శ్రమకు తగిన ఫలితం కనపడదు. విశాఖ వారికి కార్యసాధన మార్గాలు సుగమం అవుతాయి.

పరిహారం: జపాకుసుమ సంకాశం శ్లోకాన్ని ఉదయకాలంలో సూర్యుడిని చూస్తూ చేయండి. గోసేవ, అటుకులు బెల్లం గాని, తోటకూర, పచ్చగడ్డి గాని ఆవుకి తినిపిస్తే మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశివారికి చంద్రుడు తన స్థానాన్ని వీడి తృతీయము నందు శని వలన సోదర సోదరీమణుల తో విభేదాలు తలెత్తుతాయి. కానీ గురుస్థానం బలీయమగుట వలన గురుడు స్వక్షేత్ర వర్తి కావున అన్ని సమసిపోతాయి. ఆర్థిక పరిపుష్టి ఇస్తాడు. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. మానసిక ప్రశాంతత తక్కువ. పుణ్య క్షేత్ర సందర్శన లేదా దూర ప్రయాణములు సిద్ధిస్తాయి. ఇంట్లో వివాహాది శుభకార్య ప్రయత్నాలకు లోటుండదు. నేత్ర, హృదయ సంబంధ రోగములు, భార్య ఆరోగ్యం విషయంలో జాగరూకత అవసరం. సంతాన విషయ సమస్యలు కొద్దికొద్దిగా పరిష్కార సూచనలు ఉండవచ్చును. ధర్మపత్ని ద్వారా ఆదాయ సూచనలు ఉన్నప్పటికీ శని యుతి వలన ఖర్చులు కూడా అందుకు తగినట్లే ఉండును. రవి శాఖ వారికి సాధన తో వారం ప్రారంభం కాబట్టి అనుకూలత ఎక్కువ. అనురాధ వారికి ప్రత్యక్తార తో ప్రారంభం కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నా గురువు ద్వితీయ స్వక్షేత్రం వలన సమసిపోతాయి. జేష్ట వారికి ఈ వారం క్షేమ తార కావున అనుకూలతలు ఎక్కువ.

పరిహారం: ఆరోగ్యం నిమిత్తం సూర్యనమస్కారాలు చేయుట. ఆదిత్య హృదయం పఠించుట మంచిది. గురు దర్శనం పాప భీతిని పోగొడుతుంది. దత్తాత్రేయ స్తోత్రాలు చదవండి.

ధను రాశి: ఈ రాశి వారికి గురు బలం పెరిగింది. మూల త్రికోణ జన్మ గురుడు వాక్ బలాన్ని పెంచుతాడు. సప్తమంలో రాహువు, ఏల్నాటి శని ప్రభావం, వృత్తి వ్యాపారాలలో చిన్నచిన్న కదలికలు, మార్పులు చోటు చేసుకుంటాయి. చంద్రుని అనుకూలత కూడా ఉంది. గురుని బలం, చంద్రుని యుతి వలన నిద్ర, బద్ధకము తగ్గుతాయి. గౌరవ మర్యాదలు తిరిగి పొందే అవకాశం ఉంది. వారాంతంలో రవి బుధుల కలయిక వాహన ప్రమాదం, ధన నష్టం కలిగించవచ్చు. లగ్నాధిపతి గురుడి వలన చాలా విషయాల్లో మీ ప్రమేయం లేకుండానే సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నప్పటికీ సర్దుకుపోతాయి. స్థిరాస్తి వ్యవహారాలు కొంచెం పరిష్కారం అవుతున్నాయి గమనించండి. మూల వారికి ఈ వారం ప్రత్యక్తార తో ప్రారంభం ప్రతికూలం. పూర్వాషాడ వారికి ఉత్తమ ఫలిత సూచన. ఉత్తరాషాడ వారికి జన్మతారతో ప్రారంభం వలన ప్రతి పని నాన్పుడు బేరంలా ఉంటుంది.

పరిహారం: రాహుకేతు పూజలు లాభిస్తాయి. సుందరకాండ చదవండి పనులలో ఆటంకాలు తొలగుతాయి.

మకర రాశి: ఈ రాశివారికి తృతీయ వ్యయాధిపతి గురుడు, తను ధన స్థానాధిపతి అయిన ఇద్దరు అవయోగ కారకులై ఉన్నారు. లాభ శుక్రుడు, చంద్రుడే వీరికి బలాన్ని ఇవ్వాలి. రాహువు శత్రువుల నుంచి రక్షించే స్థితి కలిగి ఉన్నాడు. అయినా ఏళ్ళ నాటి శని ప్రభావం వీరిపై తీవ్రంగా పనిచేస్తున్నది. గురు కృప కూడా తగ్గే అవకాశం ఉంది. గురుడు ఉన్నతుడు గనుక ఆయన్ని ఆశ్రయించటం మానరాదు. వ్యాపారం చేయాలన్నా, వ్యవహారం నడపాలన్న స్వయం నిర్ణయం లేదా గురువుల సలహా తీసుకోవడం మంచిది. రవి అష్టమాధిపత్యం నీచ స్థాన స్థితి కావున ఆరోగ్య విషయంలో కూడా ముందస్తు హెచ్చరికలు వస్తాయి వాటిని గుర్తించి మసలుకోవాలి. ఉత్తరాషాడ వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. శ్రవణా నక్షత్రం వారికి పరమమిత్ర తార మాట పట్టింపులు, ధనిష్ట వారికి మిత్రతార కావున కొంచెం బాగా ఉంటుంది.

పరిహారం: నువ్వుల దానం, తైలాభిషేకం మంచి ఫలితాలను ఇస్తాయి. రుద్రాభిషేకం మనశ్శాంతిని ఇస్తుంది. ఖడ్గమాల కార్య వైఫల్యాలను పోగొడుతుంది.

కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారం వాక్కు స్థానాధిపతి లాభంలో ఉండటం శ్రేయస్సునే కాదు లాభాన్ని కూడా తెలుస్తుంది. లగ్నాధిపతి లాభంలో ఉండడం కూడా మంచి యోగమే. గురు, శనులు ఇద్దరూ అమిత లాభాన్ని ఇవ్వాల్సి ఉంది. వృత్తి ఉద్యోగాలలో క్రమక్రమంగా ఉన్నతిని సాధిస్తారు. వివాహము, పుత్రసంతానము ప్రాప్తించే రోజులు. గురు బలం ఉన్నా, శని సంయోగం పనుల నుండి వెనక్కి లాగుతుంది. బద్దకాన్ని వీడితే మీ బలం, బలగం పెరుగుతాయి. అందరికంటే ఈ రాశి వారే ఎక్కువ శుభ ఫలితాలను పొందుతారు. ఒక దానికి ఒక గ్రహం తోడై మీ పనులన్నీ మంచి ఫలితాలను ఇచ్చే దిశగా ఉన్నాయి. ధనిష్ట నక్షత్రం వారు శుభ ఫలితాలు ఎక్కువ పొందుతారు. శతభిషం వారికి ఈ వారం నైధనతారతో ప్రారంభం కావున మధ్యమ ఫలితాలను ఇస్తుంది. పూర్వాభాద్ర వారికి సాధన తార చంద్ర బలం కూడా బాగుంది మంచి ఫలితాలు పొందుతారు.

పరిహారం: లలితా సహస్రనామ పారాయణ, దేవి సప్తశ్లోకి, ఖడ్గమాల మీరు స్వయంగా పారాయణ చేసుకుంటే ప్రతి పనిలోనూ విజయం మీదే.

మీన రాశి: అన్ని రాశులలో కన్నా మీన రాశి వారు అదృష్టవంతులు అని చెప్పాలి. గ్రహానుకూలత ఎక్కువ. ఈ రాశివారికి రాజ్యాధిపతి గురుడు మూల త్రికోణ స్వక్షేత్రంలో ఉండటం, అది రాజ్యస్థానం అవడం విశేషం యోగం. కోర్టు వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తూ పరిష్కరిం పడతాయి. ఈ వారం నుంచి మీ మాట విలువ, మీ ఉద్యోగం విలువ పెరుగుతాయి. దానధర్మాలు చేస్తారు. గ్రహస్థితి లో మార్పు మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది. మీ కృషి, మీ సంకల్పం ఒకదానికి ఒకటి తోడై మీరే ముందు ఉండేటట్లు చేస్తాయి. ఊహించని ఫలితాలు అందుకుంటారు. గురుకృప, దైవ కృప మీపై అపారంగా ఉండే అవకాశం. భాగ్య శుక్రుడు, రాజ్య గురుడు స్థిర చరాస్తులను పెంచుతారు. కోణం లో ఉన్న రవి, కుజులు వారికి తోడ్పడతారు. మాటతీరు మార్చండి. ఇలాంటప్పుడు మౌనం మీకు ఆలోచనలను ఇస్తుంది. విలాస జీవితం అంటే ఇలా ఉంటుంది అని అనుభూతి చెందుతారు. పూర్వభద్ర వారికి మంచి ఫలితాలు రానున్నాయి. ఉత్తరాభాద్ర వారికి ప్రత్యక్ తార తో వార ప్రారంభం కావున మధ్యమ ఫలితాలు పొందుతారు. రేవతి వారికి కార్యసాధన ఫలితం ఎక్కువ.

పరిహారం:మంత్రపుష్పం, పురుషసూక్తం అర్థవంతంగా పఠింప చేయండి. సాయంకాలం దీపారాధన సత్ఫలితాలనిస్తుంది. లక్ష్మీ స్తుతి, లక్ష్మి పూజ మంచిది.

Next Story