తెలుగు రాష్ర్టాల్లో ఆడపిల్లలపై ఆగని దారుణాలు
By రాణి Published on 14 Dec 2019 11:48 AM IST- మంటగలిసిన మానవత్వం..కూతుర్ని ప్రియుడి వద్దకు పంపిన తల్లి
- బాలికకు రాత్రంతా నరకం చూపించిన వృద్ధుడు
- భాగ్యనగరం నడిబొడ్డులో దారుణం
- యువతికి మాయమాటలు చెప్పి కామ వాంఛ తీర్చుకున్న ఆటో డ్రైవర్
- రాత్రంతా లాడ్జిలోనే..
- దిశ ఉందతం జరిగిన 10 రోజుల్లోనే మరో ఘటన
- ఆందోళన చెందుతున్న ఆడపిల్లల పేరెంట్స్
దిశా యాక్ట్ అమలులోకి వచ్చిన రోజునే ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఓ తల్లి తన మైనర్ కూతురిని బలవంతంగా తన ప్రియుడు వద్దకు పంపించింది. తన ప్రియుడు వద్దకు కూతురిని పంపేముందు పేగు బంధమైనా గుర్తుకు రాలేదేమో ఆ తల్లికి. తన మనుమరాలి వయసున్న ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా తంగిరాల రాంబాబు(56) అనే వ్యక్తి ఆ బాలికకు తల్లిసాక్షిగా ఆ రాత్రి మొత్తం నరకం చూపించాడు. ఆ బాలికకు తండ్రి ఉంటే ఇలా జరిగేది కాదేమో. బాలిక (14) కు తండ్రి లేకపోవడంతో తన బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక చివరికి తన నానమ్మతో జరిగిన దారుణాన్ని మొరపెట్టుకంది. విషయం తెలుసుకున్నఆమె జరిగిన ఘటనపై కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలిక తల్లి కటారపు మార్తమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తంగిరాల రాంబాబు పరారీలో లో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మైనర్ బాలికపై అత్యాచారం
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యచారానికి పాల్పడ్డాడు. శనివారం వేకువ జామున ఒంటరిగా నిద్రిస్తున్న బాలికపై అదే గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అలాగే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భార్యను భర్తను హతమార్చాడు. శనివారం తెల్లవారుజామున భార్య లక్ష్మీని భర్త వెంకటరత్నం గొడ్డలితో నరికి చంపాడు. గతం కొంతకాలంగా భార్య లక్ష్మీని అనుమానపు భర్త వేధిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య భర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భార్యను వెంకటరత్నం హతమార్చాడు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణలో ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత కూడా రాష్ర్టంలో ఆడపిల్లలపై లైంగికదాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆడపిల్లలపై లైంగిక దాడి జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు వస్తున్నప్పటికీ మృగాల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు ఆడపిల్లలకు మాయమాటలు చెప్పి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. క్షణికావేశంలో చేసే పనే వారి జీవితాలను బలితీసుకుంటుంది. తాజాగా భాగ్యనగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
దిశ ఘటన జరిగిన 10 రోజుల్లోనే...
డిసెంబర్ 8వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణ గుట్ట పీఎస్ పరిధిలో నివసిస్తున్న బాధితురాలు (18) తన సోదరి(10)తో కలిసి 8వతేదీ రాత్రి బయటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేందుకు వారిద్దరూ దారి మరిచిపోయారు. ఇంతలో ఆ ఇద్దరిని గమనించిన ఓ ఆటోడ్రైవర్ ఇంటికెళ్లేందుకు సహాయం చేస్తానని చెప్పి నమ్మించాడు. వారిని ఇంటివద్ద దింపుతానని చెప్పడంతో నమ్మి ఆటో ఎక్కారు. ఆ తర్వాత నాంపల్లిలో ఓ లాడ్జికి తీసుకెళ్లి ''ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి. ఉదయాన్నే ఇంటికి తీసుకెళ్తా'' అని చెప్పడంతో వారు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. సోదరి నిద్రపోవడంతో ఆటో డ్రైవర్ బాధితురాలు (18) పై లైంగికదాడి చేసి తన వాంఛ తీర్చుకున్నాడు.
ఉదయాన్నే వారిద్దరినీ ఫలక్ నుమా రైల్వే స్టేషన్ వద్ద వదిలివెళ్లాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి చెప్పింది. అయితే 8వ తేదీ రాత్రే తమ కూతుర్లు కనిపించడం లేదని తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై అదే పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు నిందితుడైన ఆటో డ్రైవర్ పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ ఘటన జరిగిన 10 రోజుల్లోనే మరో ఘటన జరగడం, అది ఆలస్యంగా వెలుగుచూడటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. దిశ ఘటన నగర శివారు ప్రాంతాల్లో జరగడంతో ఆమెను కాపాడేందుకు చర్యలు తీసుకోలేకపోయారు. కానీ తాజాగా జరిగిన ఘటన నగరం నడిబొడ్డులో వెలుగుచూసింది. ఈ ఘటనను ప్రజాసంఘాలు, మేధావులు ఖండిస్తున్నారు. మృగాళ్లపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అర్థరాత్రి సమయాల్లో ఆడపిల్లల కోసమైనా పోలీస్ పికెటింగ్ ను పెంచాలని కోరుతున్నారు.