రకుల్ ప్రీత్ సింగ్.. ఇటు టాలీవుడ్-అటు బాలీవుడ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ముఖ్యంగా ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్లకు ఆమె ఫిట్ నెస్ మీద ఎంత మమకారం చూపుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ వర్కౌట్లు చేయడమే కాకుండా.. డైట్ పరంగా తాను తీసుకునే జాగ్రత్తలను గురించి కూడా ఆమె తన ఫాలోవర్లకు చెబుతూ ఉంటుంది. తాజాగా ఆమె తన జీవితంలో ఓ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే పూర్తీ శాఖాహారిగా మారిపోవడమే..! శాఖాహారిగా మారమని తనకు ఎవరూ చెప్పలేదని.. ముందుగా కూడా నిర్ణయించుకోలేదని.. కానీ ఈ నిర్ణయం తన జీవితంలో తీసుకున్న ‘బెస్ట్’ నిర్ణయం అని ఆమె చెబుతోంది.

నేను సాధారణంగా మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడేదాన్ని.. వెజిటేరియన్ పదార్థాలతో పాటూ మాంసం అన్నది కూడా నా డైట్ లో భాగమే.. ముఖ్యంగా కోడి గుడ్లు..! కానీ ఒకరోజు నేను శాఖాహారిగా మారాలని అనుకున్నాను. ఒకరు చెప్తే తీసుకున్న నిర్ణయం కూడా కాదిది.. ఇప్పుడు నేను మునుపటికంటే ఎనర్జీతో ఉండగలుగుతున్నా అని రకుల్ చెప్పుకొచ్చింది.

సినిమా తారలు షూటింగ్ కోసం.. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళుతూ ఉంటారు.. అలాంటి సమయంలో వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందా అన్న ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చింది రకుల్..! ముంబైలో షూటింగ్ లు ఉన్న సమయంలో నాతో పాటు కొన్ని వెజిటేరియన్ షేక్స్ తీసుకొని వెల్తూ ఉంటా.. అలాగే కొన్ని పండ్లను.. మీల్స్ ను కూడా ఇంటి నుండి తీసుకొని వెళ్తాను కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు. ఎప్పుడైతే విదేశాలకు షూటింగ్ నిమిత్తం వెళుతూ ఉంటామో అప్పుడే కాస్త ఇబ్బంది. చాలా దేశాల్లో గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ దొరుకుతూ ఉంటుంది.. ఒకవేళ తనకు వెజ్ ఐటమ్స్ ఏవీ దొరకకుంటే.. నా టీమ్ ఏవైనా కాయగూరలను కొని.. వాటిని వండేస్తారు.. దాల్ లేదా రైస్ ను కలిపి కిచిడీ లాంటి పదార్థాన్ని సులువుగా తయారు చేస్తారు. కావాలంటే కాస్త ‘వేగన్ ఘీ'(శాఖాహార పదార్థాలతో తయారు చేసిన నెయ్యి) ని టేస్టు కోసం ఉపయోగిస్తానని రకుల్ చెప్పుకొచ్చింది.

ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు పూర్తీ శాఖాహారులుగా మారిపోయారు. ఆ లిస్టులోకి రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరిపోయింది. శాఖాహారిగా మారిపోయిన రకుల్ ను చాలా మంది అభినందిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.