జనసేనలో స్వేచ్ఛ లేదు..అందుకే రాజీనామా చేశా..!

By రాణి
Published on : 14 Dec 2019 6:53 PM IST

జనసేనలో స్వేచ్ఛ లేదు..అందుకే రాజీనామా చేశా..!

ముఖ్యాంశాలు

  • జనసేన పార్టీపై మాజీ ప్రధాన కార్యదర్శి సంచలన కామెంట్లు

జనసేన పార్టీపై మాజీ ప్రధాన కార్యదర్శి రాజు రవితేజ్ సంచలన కామెంట్లు చేశారు. జనసేన పార్టీ ఆశించినంత క్షేత్రస్థాయిలో లేదన్నారు. పార్టీలో అంతర్గత పారదర్శకత లేదని, సొంత పార్టీ వాళ్లను కూడా అధ్యక్షుడు పవన్ పైకి రానివ్వడం లేదని రాజు రవితేజ్ విమర్శలు చేశారు. పార్టీ వేదికను పవన్ తన వ్యక్తిగత అంశాల కోసం వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీలోని సీనియర్లు సంతోషపడ్డారన్నారు. పవన్ భాష పూర్తిగా మారిపోయిందని, మున్ముందు సమాజానికి ఇది చాలా ప్రమాదకరంగా తయారవుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కులాల మీద పవన్ కళ్యాణ్ అనవసరంగా మాట్లాడుతున్నారని, పవర్ కోసం పవన్ తొందర పడుతున్నారని విమర్శించారు. మతాల ప్రస్తావన లేని రాజకీయాలే జనసేన సిద్ధాంతం అని చెప్పిన పవనే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. పవన్ సున్నితమైన మనిషే కావచ్చు కానీ పార్టీకి చెందిన కార్యకర్త తలలు నరికేస్తానంటే కనీసం ఖండించకపోవడం సబబు కాదన్నారు. గతంలో పార్టీకి రాజీనామా చేసిన నేను మళ్ళీ తిరిగి పార్టీలో జాయిన్ అయ్యాను కానీ ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరే ఉద్దేశం లేదన్నారు. జనసేన పార్టీలో స్వేచ్ఛ లేదని, అంతా తన కంట్రోల్ లోనే ఉండాలని పవన్ పెత్తనం చెలాయిస్తారని రవితేజ్ దుయ్యబట్టారు. పవన్ నిజస్వరూపం ఇప్పుడిప్పుడే పార్టీలో ఉన్నవారికి అర్థమవుతుందని, మున్ముందు పార్టీ మనుగడ కోల్పోతుందని జోస్యం చెప్పారు.

Next Story