రాజభవన్ సిబ్బంది కోసం యోగా తరగతులను ప్రారంభించిన గవర్నర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 11:22 AM GMT
రాజభవన్ సిబ్బంది కోసం యోగా తరగతులను ప్రారంభించిన గవర్నర్

  • రాజ్ భవన్ లో యోగా తరగతులు
  • పాల్గొన్న గవర్నర్ దంపతులు
  • రోజూ ఉ.5.30 నుంచి 6.30 వరకు యోగా తరగతులు

హైదరాబాద్‌: రాజభవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా యోగా తరగతులను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించారు. రాజభవన్ ప్రాంగణంలోని సంక్షేమ భవన్ లో గురువారం తెల్లవారు ఝామున 5.30 నిముషాలకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. గవర్నరు దంపతులు ఇద్దరూ రాజభవన్ ఉద్యోగులతో కలిసి యోగా తరగతులలో పాల్గొన్నారు.

సంక్షేమ భవన్ లో యోగా తరగతులు ప్రతి రోజూ ఉదయం 5.30 నుంచి 6.30 వరకు నిర్వహిస్తారని గవర్నర్ చెప్పారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నరు కోరారు. సాంకేతికతంగా అభివృద్ది సాధించడంతో సమాజంలో చాలా మంది శారీరక శ్రమను తగ్గించారన్నారు. కనీసం నడక కూడా చాలా మంది మానివేశారని అమె అన్నారు. శరీరధారుడ్యం ప్రతి ఒక్కరి జీవిత విధానం కావాలని, ఇందుకు ప్రతి ఒక్కరు యోగాను తమ నిత్యకృత్యం చేసుకోవాలని గవర్నరు తమిళిసై పిలుపునిచ్చారు.

తాను ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తానని గవర్నర్ చెప్పారు. భారత ప్రధాని పిలుపు ఇచ్చిన ఫిట్ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చేలా ప్రతిఒక్కరం ప్రతి రోజూ యోగా చేద్దామన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలంగాణా రాష్రంలోని ప్రజలందరూ తెలుసుకోవాలనీ, ముఖ్యంగా యువత యోగాను తమ నిత్యకృత్యం చేసుకోవాలని గవర్నరు విజ్ఞప్తి చేశారు.

రాజభవన్ స్కూల్లో 6 నుంచి 10 వ తరగతి వరకూ చదువుతున్న సుమారు 450 విద్యార్థులకు ప్రతి శనివారం యోగా తరగతులు నిర్వహిస్తున్నామని, ఫిట్‌నెస్‌ పై పాఠశాల విద్యార్థుల్లో చక్కని అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించే రీతిలో రాజభవన్ స్కూల్లో యోగా తరగతులు ప్రారంభించామన్నారు గవర్నర్‌ తమిళి సై.

ప్రముఖ యోగా గురువులు,అధ్యక్షులు, తెలంగాణా రాష్ట్ర యోగా కమిటీ శ్రీ రవి కిషోర్, ఆయన శిష్య బృందం పర్యవేక్షణలో రాజభవన్ లో యోగా తరగతుల నిర్వహిస్తున్నామని గవర్నర్ కార్యదర్శి శ్రీ కె. సురేంధ్ర మోహన్ తెలిపారు.

Next Story