అల్లూరి గెటప్ ని అచ్చంగా దింపేసిన రామ్ చరణ్

By Newsmeter.Network  Published on  17 Jan 2020 9:42 AM GMT
అల్లూరి గెటప్ ని అచ్చంగా దింపేసిన రామ్ చరణ్

  • రాజమౌళి మల్టీ స్టారర్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్
  • కొత్త సినిమాలో అల్లూరి పాత్రను పోషిస్తున్న రామ్ చరణ్
  • అల్లూరి తెలంగాణ వీరుడు కొమరం భీమ్ ని కలిసే సన్నివేశాలు
  • ఈ మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ సరసన అలియా భట్ కథానాయిక
  • అలియాతో సన్నివేశాలను పండించేందుకు ఎన్టీఆర్ తహతహ
  • ఎన్టీఆర్ తో కలసి తెరను పంచుకోవడం సంతోషం : రామ్ చరణ్
  • పూర్తిగా రాజమౌళికి సరెండర్ అయిన రామ్ చరణ్

సైరా నరసింహారెడ్డిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి అచ్చంగా తెరమీద దింపేశాడు. నరసింహారెడ్డి అచ్చంగా ఇలాగే ఉండేవాడేమో అన్నంతగా ఆ పాత్రలో జీవించి చూపించాడు. ఆ సినిమా సూపర్ డూపర్ బాక్సాఫీస్ హిట్. ఆ నడక, ఆ స్టైల్, ఆ హావభావాలు, ఆ గాంభీర్యం, సినిమాటిక్ ఎక్స్ ప్రెషన్స్ మొత్తం అన్నీ కలసి చిరంజీవి పెర్ఫామెన్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ గతంలో ఓసారి అల్లూరి పాత్రలో జీవించిన తర్వాత మళ్లీ ఆపాత్రను పోషించే సాహసం ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. కానీ రాజమౌళిమీద బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న రామ్ చరణ్ ధైర్యంగా ఆ పాత్రను పోషించేందుకు ముందుకొచ్చాడు.

పాత్రను పోషించడానికి ధైర్యం చేయడం ఒక ఎత్తు. కానీ అందులో పూర్తిగా జీవించడానికి, పరకాయ ప్రవేశం చెయ్యడానికి సర్వశక్తుల్నీ ఒడ్డడం మరో ఎత్తు. సరిగ్గా ఇక్కడే రామ్ చరణ్ రాజమౌళి మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ముమ్మూర్తులా అల్లూరిలా కనిపించేందుకు పూర్తిగా గడ్డంకూడా పెంచేశాడు.

నిజానికి ఈ మోడ్రన్ గెడ్డం ఫ్రెంచ్ స్టైల్. ఈ మధ్య కాలంలో చాలామంది యూత్ ఇలా ఫ్రెంచ్ స్టయిల్ గడ్డాలను పెంచేయడం బాగా పాపులర్ అయ్యింది. ప్రత్యేకించి ఆర్థిక స్వాతంత్ర్యం పుష్కలంగా ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఈ రకమైన పోకడలకు బాగా అలవాటు పడిపోయారు. కానీ ఆ ఫ్రెంచ్ గడ్డం స్టైల్ ని పాత్రకు అనుగుణంగా మలచుకోవడంలో రామ్ చరణ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

అల్లూరి పాత్రను పోషించడం అంటే ఏమాత్రం సాదాసీదా వ్యవహారం కాదనీ, దానిమీద ప్రేక్షకులకు బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయని రామ్ చరణ్ కి బాగా తెలుసు. అందుకే దానికోసం బాగా హోం వర్క్ చేస్తున్నాడు. షూటింగ్ కి వెళ్లేముందే అనేక వర్క్ షాపుల్లో పాల్గొని పూర్తిగా అల్లూరి గురించి తెలుసుకుని, ఆకళింపు చేసుకుని తనలో ఆ స్ఫూర్తిని పూర్తిగా నింపుకునే ప్రయత్నం చేశాడు చరణ్.

తూర్పు గోదావరి జిల్లా, విశాఖ మన్యం ప్రాంతంలో బ్రిటిషర్ల అరాచకాలను ఎదిరించి వాళ్ల గుండెల్లో నిద్రపోయిన విప్లవవీరుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన విద్వత్తును, చదువును, సంస్కారాన్ని, జీవితాన్ని ఆయన గిరిజనుల హక్కులకోసం పూర్తిగా పణంగా పెట్టాడు. దేశమాత సేవకు అంకితమై తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయమూర్తి అల్లూరి.

బ్రిటిషర్లతో పోరాటం చేసేందుకు ఏపీకి చెందిన అల్లూరి తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమరం భీం ని కలసి బలాన్ని, బలగాన్ని పెంచుకుని బెబ్బులిలా బ్రిటిషర్ల గుండెల్లో నిద్రపోయిన చరిత్రను రాజమౌళి తవ్వితీశాడు. తన కొత్త సినిమాలో దాన్ని పూర్తిగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. సరిగ్గా అదే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది.

చరణ్ ఈ పాత్రను పోషించేందుకు గట్టిగానే హోం వర్క్ చేసినా సరే, పూర్తిగా పాత్ర పోషణ విషయంలో డైరెక్టర్ రాజమౌళి ఆలోచనలను, అభిప్రాయాలను మాత్రమే గౌరవిస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చరణ్ రాజమౌళికి ఈ సినిమాకోసం పూర్తిగా సరెండర్ అయిపోయాడు. బెటర్ ఔట్ పుట్ రావాలంటే ఇంతకు మించి మరో మార్గం లేదని రామ్ చరణ్ పూర్తిగా నమ్మాడు.

కొత్త సినిమాలో రామ్ చరణ్ తనకు నిజజీవితంలోకూడా మంచి మిత్రుడైన జూనియర్ ఎన్టీఆర్ తో తెరను షేర్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ నిజంగా ఓ ఫైర్ క్రాకర్ అనీ, తన ప్రతిభను అంచనా వేయడానికి కొలమానాలు లేవని కితాబిచ్చాడుకూడా. ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో అలియా భట్ కథానాయికగా నటిస్తోంది.

ఇంకా ఎన్టీఆర్ అలియా భట్ కలసి నటించే, కాదు కాదు తెరమీద జీవించే సన్నివేశాలు షూటింగ్ కు రాలేదు. త్వరలోనే మిగతా పార్ట్ పూర్తి చేసుకుంటే షెడ్యూల్ ప్రకారం అలియాభట్ తో షూటింగ్ చేయాల్సిన సన్నివేశాలను చిత్రీకరించేందుకు అవకాశం కలుగుతుంది. అలియాతో నటించడం నిజంగా చాలా సంతోషాన్నిస్తున్న విషయమని ఎన్టీఆర్ ఇప్పటికే అలియాభట్ పై ప్రశంశల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.

Next Story