రాజకీయ బేతాళం: లింగమనేని...కరకట్ట...ఓ అక్రమ కట్టడం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 8:42 AM GMT
రాజకీయ బేతాళం: లింగమనేని...కరకట్ట...ఓ అక్రమ కట్టడం..!

"నిను వీడని నీడను నేనే"- పాట పాడుతూ ఎవరో వెనక్కాలే వస్తున్నారు.విక్రమార్కుడికి ఒళ్లు మండిపోయింది.రోజూ బేతాళుడితో బాతాఖానీ కొట్టి వచ్చే నన్నే భయపెట్టాలనుకుంటే...సీసాలో పెట్టి పాతేస్తాను జాగ్రత్త " అని కోపంగా వెనక్కి తిరిగాడు."ఓ పిల్ల దెయ్యం భయం భయంగా చూసి సారీ సార్ పొరపాటైపోయింది"అని వణికిపోతూ మాయమైంద

ఈ ఎపిసోడ్ ను అల్లంత దూరం నుంచే గమనిస్తోన్న బేతాళుడు నవ్వాపుకోలేకపోయాడు. విక్రమార్కుడు చెట్టు దగ్గరకు రాగానే " ఏంటి విక్రమార్కా? మా బంధువుల దెయ్యం పిల్లపై అంతలా కోప్పడుతున్నావ్" అని అడిగాడు. విక్రమార్కుడు కూడా నవ్వేసి లేకపోతే మనతోటే డెవిల్ గేమ్సా అని ...బేతాళుణ్ని చెట్టుమీంచి దింపి భుజాలకెత్తుకున్నాడు.

"విక్రమార్కా ఇవ్వాళ చాలా ఆసక్తికరమైన కథ చెబుతాను విను."అని చెప్పడం మొదలు పెట్టాడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుణ్ని చూస్తే జాలేస్తోందయ్యా. ఇవ్వాళ కథ కూడా ఆయనగురించే. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన జగన్ మోహన్ రెడ్డి నాలుగు నెలల పాలనలో సంక్షేమ పథకాల్లో బ్రహ్మాండంగా దూసుకుపోతున్నారు . అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక వరం ఇస్తూ పోతున్నారు. అంతా బానే ఉంది కానీ..ఆయన చేస్తోన్న ఓ పనే నాకర్ధం కావడం లేదు. ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు కృష్ణానదీ తీరంలో ఉంటోన్న నివాస భవనాన్ని కూల్చివేయాల్సిందేనని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటోంది. పాపం చంద్రబాబు నాయుడి ఇంటిని కూల్చివేయడం ఏం న్యాయం? ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని జగన్ మోహన్ రెడ్డి భావించడం లేదా? అందరి విషయంలోనూ ఏదో ఒక మేలు చేద్దామని చూస్తోన్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత విషయంలో ఇంత కఠినంగా ఉండడానికి ఏమన్నా కారణం ఉందంటావా? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? దీనికి సమాధానం తెలిసీ కూడా చెప్పకపోయావో నీ తలని పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పారేస్తాను జాగ్రత్త" అని బేతాళుడు ముగించాడు.

విక్రమార్కుడు గట్టిగా ఊపిరి పీల్చి " బేతాళా..చంద్రబాబు నాయుడి మాటలు విని నువ్వు కూడా పప్పులో కాలేశావు.

2014లో ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెంటనే ఆయన ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా కరకట్టను ఆనుకుని నదిలో బోటు షికారు చేశారు. ఆ సమయంలోనే కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనన్నారు. త్వరలోనే ఆ కట్టడాలన్నింటినీ తొలగించి తీరతామని హెచ్చరించారు.

అయితే... ఆ అక్రమ కట్టడాల్లో ఒకటైన లింగమనేని గెస్ట్ హౌస్ నే చంద్రబాబు తన నివాసంగా ఎంచుకోవడంతో దేవినేని నోట మాట పడిపోయింది. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన లింగమనేని భూములు ల్యాండ్ పూలింగ్ లో పోకుండా కాపాడినందుకే లింగమనేని తన గెస్ట్ హౌస్ ను క్విడ్ ప్రోకోగా చంద్రబాబుకు కానుకగా ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ విషయాన్ని మీడియా ప్రతినిథులు చంద్రబాబును అడగ్గా...ఆ గెస్ట్ హౌస్ కి లింగమనేనికి సంబంధం లేదన్నారు.అది ప్రభుత్వానిదేనన్నారు. అందులో తాను తాత్కాలికంగానే ఉండబోతున్నానన్నారు.ఆ తర్వాత ఆ గెస్ట్ హౌస్ తో సహా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్నీ తొలగించి తీరతామన్నారు. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూడా నదీ సంరక్షణ చట్టాలను ఉల్లంఘించి కట్టినవే. ఇటీవలి వరదల్లో నదిలో చొచ్చుకుపోయేలా కట్టిన చంద్రబాబు నివాసంలోకి నీళ్లు చొచ్చుకుపోయింది కూడా అందుకే. చంద్రబాబు ప్రభుత్వమే కరకట్టపై ఉన్నవి అక్రమ కట్టడాలని తేల్చింది. ఇపుడు జగన్ మోహన్ రెడ్డి అవే అక్రమ కట్టడాలను తొలగించి నదీ సంరక్షణ చట్టాలను గౌరవిస్తున్నారు.

అయితే ఇపుడు చంద్రబాబు ..టిడిపి నేతలంతా కలిసి గగ్గోలు పెట్టేస్తున్నారు. చంద్రబాబు నాయుడి ఇంటిని ఎలా కూలుస్తారు? మీది కూల్చివేతల ప్రభుత్వం అంటూ టిడిపి నేతలు గొంతులు చించుకుంటున్నారు.నిజానికి కోర్టు తీర్పులు కూడా ఆ అక్రమ కట్టడాలను తొలగించాలనే చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇపుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు.తనకు గిఫ్ట్ గా వచ్చిన ఇంటిని కూల్చేస్తారనే ఆయన బెంగ.అంతే తప్ప ఆ నివాసాన్ని కూల్చివేయడం ఏ విధంగానూ తప్పకాదు. ప్రజలకూ ఈ విషయంలో క్లారిటీ ఉంది అంచేత ఎవరూ కూడా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుబట్టడం లేదు" అని విక్రమార్కుడు ముగించాడు.బేతాళుడు మెచ్చుకోలుగా విక్రమార్కుని వైపు చూసి ఏం చెప్పినా కరెక్ట్ లాజిక్ తో చెప్తావయ్యా" అని అభినందించి విక్రమార్కుని భుజాలపై మాయమయ్యాడు.

-వీర పిశాచి

Next Story