న్యూ ఢిల్లి : గత వారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభకు హాజరై ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అత్యాచార ఘటనలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఏం జరిగిందో పేర్కొంటూ ఒక ”వాస్తవిక నివేదిక” సమర్పించాలని ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఝార్ఖండ్ ఎన్నికల అధికారులకు ఉత్తర్వులిచ్చింది. అయితే గతవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ‘మేకిన్ ఇండియా’ను అత్యాచార ఘటనలతో ముడిపెడుతూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అత్యాచార ఘటనలను రాహుల్ రాజకీయ అస్ర్తంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మహిళా ఎంపీలు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈసీ ఝార్ఖండ్ ఎన్నికల అధికారులను రాహుల్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని కోరింది.

అయితే ఇదే విషయంపై గతవారమే పార్లమెంట్ ఆఖరి రోజు సమావేశంలో తీవ్ర దుమారం రేగింది. ఎన్నికల ప్రచార సభలో రాహుల్ బీజేపీ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో సహా బీజేపీ మహిళా ఎంపీలంతా పట్టుబట్టారు. కానీ ఎట్టిపరిస్థితిలోనూ తాను క్షమాపణ చెప్పేది లేదని రాహుల్ తెగేసి చెప్పారు. అంతేకాక తాను వాస్తవ పరిస్థితులను బట్టే వ్యాఖ్యలు చేశానని, అందుకు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదన్నారు రాహుల్.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.