అసాధారణ క్రికెటర్.. ఒక మంచి మనిషి

By Newsmeter.Network  Published on  11 Jan 2020 8:28 AM GMT
అసాధారణ క్రికెటర్.. ఒక మంచి మనిషి

భార‌త క్రికెట్ లో ది వాల్ గా పేరు తెచ్చుకున్న ఆట‌గాడు రాహుల్ ద్రావిడ్‌. నేడు రాహుల్ ద్రావిడ్ పుట్టిన రోజు. నేటితో ఈ మిస్ట‌ర్ డిపెండ‌బుల్ 47 ప‌డిలో అడుగుపెట్టాడు. దీంతో ఈ మాజీ క్రికెట‌ర్ కి బీసీసీఐ, ఐసీసీతో స‌హా ప‌లువురు క్రీడాకారులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ‘ నువ్వొక స్ఫూర్తి, రోల్ మోడల్, లెజెండ్’ అంటూ మాజీ క్రికెట‌ర్ మహ్మద్ కైఫ్ శుభాకాంక్షలు తెలప‌గా.. ‘ అసాధారణ క్రికెటర్.. ఒక మంచి మనిషి’ అంటూ కామెంటేట‌ర్ హర్షా భోగ్లే అభినంద‌న‌లు తెలిపాడు.రాహుల్ ద్రావిడ్ పూర్తి పేరు రాహుల్ శ‌ర‌త్ ద్రావిడ్. 1973 జ‌న‌వ‌రి 11న ఇండోర్ లో జ‌న్మించాడు. లార్ట్స్ వేదిక‌గా ఇంగ్లాండ్ తో జ‌రిగిన టెస్టుతో త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీయ‌ర్ ను ఆరంభించాడు. ఆరివీర భ‌యంక‌ర ఫాస్ట్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొని 95 ప‌రుగులు సాధించి తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. అనంత‌ర కాలంలో ఇండియ‌న్ టింలో కీ ప్లేయ‌ర్ గా మారాడు. అద్భుత‌మైన టెక్నిక్ ద్రావిడ్ సొంతం. క‌చ్చిత‌మైన క‌వ‌ర్ డ్రైవ్ లు, పుల్ షాట్ల‌తో అభిమానుల‌ను అల‌రించిన ఈ మిస్ట‌ర్ డిపెండ‌బుల్ అంత‌ర్జాతీయ కెరీర్ లో 24 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు.

164 టెస్టులకు ప్రాతినిథ్యం వహించిన ద్రావిడ్ 52.3 సగటుతో 36శ‌త‌కాలు, 63అర్థ‌శ‌త‌కాల సాయంతో 13,288 పరుగులు సాధించాడు. ఇక 344 వన్డేల్లో 10,889 పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు సహా 83 అర్ధసెంచరీలున్నాయి. ఒకే ఒక టీ 20 మ్యాచ్ ఆడి 31 పరుగులు సాధించాడు.

అంత‌ర్జాతీయ కెరీర్ రిటైర్ మెంట్ ప్ర‌క‌టించిన అనంత‌రం భార‌త అండ‌ర్ -19, భార‌త -ఏ జ‌ట్ల కు కోచ్ గా ప‌ని చేసి ఎంతో ప్ర‌తిభావంత‌మైన క్రికెట‌ర్ల‌ను వెలుగులోకి తెచ్చాడు. శుభ్‌మ‌న్ గిల్, రిష‌బ్ పంత్, మ‌యాంక్ అగ‌ర్వాల్ లాంటి యువ ఆట‌గాళ్లు వారిలో ఉన్నారు. ప్ర‌స్తుతం నేషనల్ క్రికెట్ అకాడెమీకి డైరెక్టర్ గా విధులు నిర్వ‌హిస్తున్నాడు.

Next Story
Share it