రాహుల్ ద్రావిడ్ కు బీసీసీఐ నోటీసులు
By సత్య ప్రియ Published on 31 Oct 2019 9:39 AM GMTటీమిండియా మాజీ కెప్టెన్, ‘ద వాల్’ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని, దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ అంబుడ్స్‌మన్ ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ ముందు హాజరైన ద్రవిడ్.. మరోసారి హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు అందాయి.
ప్రస్తుతం ద్రవిడ్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉంటూనే, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉంది. దీంతో ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నాడని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.
దాంతో ఫిర్యాదుపై స్పందించాలని ద్రవిడ్‌కు నోటీసులు జారీ చేశారు. గతంలో క్రికెట్ సలహా కమిటీ సభ్యులుగా ఉన్న సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌పైనా గుప్తా ఫిర్యాదు చేశాడు. దాంతో వారు ఆ పదవి నుంచి తొలగాల్సి వచ్చింది.
సెప్టెంబర్ 26న మొదటిసారి ద్రవిడ్ ఎథిక్స్ అధికారి వద్ద విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
మొదటిసారి ఎథిక్స్ అధికారిని కలిసినప్పుడు తాను ఇండియా సిమెంట్స్ నుంచి వేతనం చెల్లించని సెలవు తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు రాహుల్. క్రికెట్ పాలకుల కమిటీ కూడా ఆయనకు మద్దతుగా నిలిచింది.
ఈ విషయంపై బీసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గాంగూలీ తీవ్రంగా స్పందించారు. ద్రవిడ్ కు నోటీసులు జారీ అయ్యాయి అని తెలియగానే "ఇక భారత్ క్రికెత్ ను దేవుడే రక్షించాలి” అంటూ ట్వీట్ చేశారు.