నేను వైసీపీలో చేరడం లేదు.. అంతా తప్పుడు ప్రచారమే – రఘువీరారెడ్డి

By Newsmeter.Network  Published on  10 March 2020 4:38 AM GMT
నేను వైసీపీలో చేరడం లేదు.. అంతా తప్పుడు ప్రచారమే – రఘువీరారెడ్డి

తాను వైసీపీలో చేరుతున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కాంగ్రెస్‌ నేత, మాజీ ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. జగన్‌ పార్టీ ఏర్పాటైన నాటి నుండి తాను వైసీపీలో చేరుతానంటూ ప్రచారం సాగిస్తున్నారని, పలుసార్లు ఖండించినప్పటికీ ఇలాంటి ప్రచారం చేయవడం సరికాదని రఘువీరా అన్నారు.

తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుండి సోషల్‌ మీడియాలో రఘువీరా పార్టీ మారుతున్నారని, వైసీపీలో చేరుతున్నారని ప్రచారం సాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయి సత్తాను చాటేందుకు అధికార పార్టీ వైసీపీ అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. అన్ని పార్టీల నుంచి ముఖ్యనేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రధాన అస్త్రాన్ని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రయోగించారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ ద్వారా అన్ని పార్టీల్లోని ముఖ్యనేతలను టార్గెట్‌ చేస్తూ వైసీపీలోకి లాగేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీని టార్గెట్‌గా పెట్టుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆపార్టీ నుండి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌లు జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. దీనికితోడు ఇతర పార్టీల్లో నుంచి కూడా ముఖ్యనేతలను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ బలాన్ని పెంచుకోవచ్చని జగన్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సోషల్‌ మీడియా విస్తృత ప్రచారం సాగింది.

మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో రఘువీరా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగింది. దీంతో రఘువీరా ఈ వార్తలను ఖండించారు. ఇవన్నీ తప్పుడు వార్తలేనని, తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

Next Story