వార ఫలాలు : తేదీ 6-9-2020 ఆదివారం నుండి 12-9-2020 శనివారం వరకు
By సుభాష్ Published on 6 Sep 2020 5:18 AM GMT7-9-2020 సోమవారం భరణి మహాళయం.
9-9-2020 బుధవారం సీతలా వ్రతం.
10-9-2020 తమిళనాట శ్రీ కృష్ణ జయంతి మధ్వఅష్టమి.
12-9-2020 శనివారం వ్యతీపాత మహాలయం.
మేష రాశి :- ఈ రాశి వారికి ఈవారం అలంకార ప్రాప్తి, స్త్రీ సౌఖ్యము, ఆనందాన్ని అభివృద్దిని కలిగిస్తాయి. ఈ వారంలో ఎక్కువ శుభ పరంపరని పొందనున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. చంద్రుడు కుటుంబ ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. బుధుడు అలంకార ప్రాప్తిని, గురుడు ధనాన్ని, శుక్రుడు స్త్రీ సౌఖ్యం ఇవ్వబోతున్నారు. ఇవన్నీ మీరు అనూహ్యంగా ఈ వారంలో పొందే అవకాశాలు. మీరు చేపట్టిన ప్రతి కార్యం నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రాజకీయ వ్యతిరేకత ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. శత్రు వృద్ధి కూడా అలాగే ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. కుజుడు మీకు లగ్నంలో ఉండడం వల్ల కాస్త విచారాన్ని కలిగిస్తాడు. అయినా చివర్లో మేలు చేస్తాడు ధనలాభం మిమ్మల్ని ఆనంద పరుస్తాయి. ఎప్పటినుంచో మీకు జరగాల్సిన లేదా రావాల్సిన సన్మాన సత్కారాలు ఈ వారంలో అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మీ జాతకరీత్యా మీరు ఈ వారంలో 54 శాతం శుభఫలితాలను పొందుతున్నారు. అశ్విని నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి భరణి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి మంచి ఫలితాలు ఉన్నాయి. కృత్తిక 1వ పాదం వారికి మిత్ర తార అయింది కాబట్టి అభివృద్ధి పథంలో సాగిపోతారు.
పరిహారం:- కుజునకు జపం చేయించండి. కందులు ఎర్రని వస్త్రములు దానం చేయండి. మంగళవారంనాడు దుర్గా స్తోత్రం పారాయణ చంద్రునికి ప్రీతిగా యోగ సాధన మెడిటేషన్ చేయండి.
వృషభ రాశి :- ఈ రాశి వారికి కాస్తంత ధనలాభము భోజన సౌకర్యము మాత్రమే లభించనున్నాయి. ఎన్నడూ లేని ఇబ్బందుల్ని వీరు ఎదుర్కొనే అవకాశమే ఎక్కువగా ఉన్నది. సుమారుగా తొమ్మిది గ్రహాలు కూడా ప్రతికూలంగా నే పని చేస్తూ ఉన్నాయి. ఏ పని చేపట్టినా వెనక బడుతూనే ఉంటుంది. మాట నిలకడ ఉండదు. మాట మీద నిలబడాలి అది ఈ వారంలో కష్టం. మీకు మాట ఇచ్చిన వారికి కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. అది మిమ్మల్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి అవతలి వాళ్ళు మీకు అలాంటి వాళ్లే సమకూరుతారు. తప్పు ఎవరిదీ కాదు గ్రహస్థితి మాత్రమే. ఈ వారంలో చాలా ప్రతికూలంగా ఉంది అందుకనే ఇన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తోంది. ప్రతి దాంట్లోనూ చిత్త చాంచల్యము మనోవైకల్యం ఆత్మన్యూనత కనిపిస్తాయి. మీకు మీరే ఒక సమస్యగా అనుకునే పరిస్థితి ఉంది. ఈ వారంలో మీకు 18 శాతం మాత్రమే శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జాతకరీత్యా బాగున్నట్లు అయితేనే మీరు ఎక్కువ ఫలితాలను పొందగలరు. గోచారరీత్యా ప్రతికూలత ఎక్కువగా ఉంది. కృత్తిక 2 3 4 పాదాలు వారికి మిత్రతార అయింది శుభఫలితాలు ఎక్కువగా కొనసాగుతాయి. రోహిణి నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి ప్రతికూలతలు చాలా ఎక్కువ. మృగశిర 1 2 పాదాలు వారికి సాధన తార అయింది కాబట్టి అనుకున్న పనులు నెరవేరుతాయి.
పరిహారం :- నవగ్రహాలను రోజూ దర్శించండి. మనోధైర్యాన్ని పొందడం కోసం యోగసాధన మెడిటేషన్ మంచి ఫలితాలు ఇస్తాయి.
మిధునరాశి :- ఈరాశి వారికి సంపద లాభం ధన ప్రాప్తి మంచికీర్తి అనందాన్ని కలిగిస్తాయి. ఈవారం చంద్రుడు మానసిక ఆనందాన్ని ఉత్సాహాన్ని కలుగజేస్తాడు. కుజ బుధ గురు శుక్రులు శత్రువులపై విజయం ద్వారా విశేష ధనాదాయం ఉంది. శని రాహు కేతువులు మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వీరివల్ల చిన్న ఇబ్బంది ఎదురవుతుంది. అయినా సరే ఏమి గాబరా పడకూడదు. ఎందుకంటే కుజ బుధ గురు మీకు ఏ రకమైన ఆటంకాలు వచ్చినా సరే దాన్ని తిప్పికొట్టే టటువంటి శక్తి కలిగి ఉన్నారు. రవి కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏ పని చేపట్టాలన్న మీరు కొత్తగా చేసిన వ్యాపారం గాని వ్యవహారంగానీ భూసంబంధమైన ఏదైనా సరే మీకు నెరవేరుతాయి. కాబట్టి వారంలో మంచి రోజు ఏదైనా ఉంది అనుకుంటే సంప్రదించి చక్కగా మీ పనులను మీరు నెరవేర్చు కోండి. పాత బాకీలు గాని వసూళ్లకు కూడాపనికి వస్తుంది. దాని గురించి కూడా ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకండి. మీకు రావలసిన అటువంటి లబ్ది ఏ చిన్నదైనా పని చేయండి. ఫలితం తప్పకుండా దొరుకుతుంది. బంధువర్గాలు స్నేహితులు మొత్తం అందరు కూడా మీకు సహకరించే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ వారంలో మీకు 63% శుభ ఫలితాలున్నాయి. మృగశిర 3 4 పాదాలు వారికి సాధన తార అయ్యింది. శుభఫలితాలు ఎక్కువగా ఉంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార ఫలితాలు తక్కువగా ఉన్నాయి. పునర్వసు 1 2 3 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి శుభ ఫలితాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం :- అష్టమ శనికి జపం చేయించండి. నల్ల నువ్వులు నల్ల వస్త్రము దానం చేయండి వీలైతే శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. రుద్రాభిషేకం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
కర్కాటక రాశి :- ఈ రాశి వారికి ఈ వారంలో సౌఖ్యం సంతోషం కొంత ఆనందాన్ని ఇచ్చి సుఖ జీవనాన్ని కలగజేస్తాయి. మీలో ఉన్న భయం కొంచెం పెరుగుతుందే తప్ప తరిగే అవకాశం లేదు. ఎంతైనా ధనవ్యయం అయిపోతుంటుంది. నానావిధ ఆలోచనలతో మీరు అనేక పర్యాయాలు మిమ్మల్ని మీరు తర్కించుకుంటారు. ఒకానొక సమయంలో ఏం చేయాలో తోచని స్థితి ఉంటుంది. అయితే మానసిక విచారము ఎంత ఉన్నా కుటుంబ ప్రోత్సాహము సౌఖ్యము కుటుంబ దార్ఢ్యము మిమ్మల్ని మరింత ఆనందింప చేస్తాయి గనుక మీ పనులు మీరు వెనుకంజ వేయరు. మీకు ఉత్సాహ ప్రోత్సాహాలు కుటుంబం నుంచి ఎక్కువగా వస్తాయి. ఈ వారంలో కూడా మీ ప్రయత్నాలు కొంత వెనుకబాటుతనాన్ని కనిపిస్తాయి. కానీ ఒకే ఒక విషయం మిమ్మల్ని ఆనందింపజేసి మిమ్మల్ని ముందుకు అడుగు వేసినట్టుగా చేస్తుంది. నిరుత్సాహం వెంటాడుతున్నప్పటికీ మీ అనుభవ జ్ఞానము మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ వారంలో 45 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి.. పునర్వసు నాలుగో పాదం వారికి క్షేమ తార అయింది కాబట్టి మంచి ఫలితాలు కనిపిస్తాయి, పుష్యమి నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు సంపత్ తార అయింది కాబట్టి సంపద అదనంగా మీకు చేకూరుతుంది.
పరిహారం :- ముందు రోజు నాన వేసిన పెసలు బుధవారంనాడు ఆవుకి బెల్లం వేసి తినిపించండి. రోజు గోవును దర్శించండి. శనీశ్వరునికి నమస్కారం చేయండి.
సింహ రాశి :- ఈ రాశి వారికి సౌఖ్యము స్వర్ణాకర్షణ ప్రాప్తి ఉత్సాహము ధనప్రాప్తి కూడా ఆనందాన్ని కలుగజేస్తాయి. మానసిక క్లేశాన్ని చంద్రుడు తాత్కాలికంగా కలిగించినా బుధ గురు శుక్ర శని లు మీలో ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని ఎక్కువగా పెంచి మరింత చక్కగా పనిచేసే అవకాశం కల్పిస్తాడు . శని కూడా మీకు అనుకూలంగా ఉండడంతో ధనప్రాప్తి ఉంది. మీరు చిన్న పనైనా చేసి ధనం ఎక్కువ సంపాదిస్తారు. ఈ వారంలో మీరు చేయగలిగిన అటువంటి పనిని కూడా ఉత్సాహంగా చేస్తారు. మరి దేన్ని కూడా వాయిదా వేయకుండా చేసుకుంటూ వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. విశేషంగా వివాహాలు అన్ని కలిసొస్తాయి. వివాహం కాని వారికి వివాహమవుతుంది. నూతన గృహ నిర్మాణానికి ఆలోచనలు కూడా శుభఫలితాలు ఇస్తాయి. ఎప్పటినుంచి ఉండిపోయినా వ్యవహారాలను కూడా చక్కదిద్ధి చాలా ధనాన్ని సంపాదించుకుంటారు. అయితే కుజ కేతు గ్రహం ప్రభావం చేత కొంత ధనము వ్యర్థంగా పోక తప్పదు. నిరుత్సాహ పడకుండా మీరు వెళ్ళినట్లయితే ప్రతి పని మీకు అనుకూలంగా మారిపోతుంది ఈ వారంలో 72 శాతం ఫలితాలు మీకు ఉన్నాయి. మఖా నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పుబ్బ నక్షత్రం వారికి పరమ మిత్ర తార కాబట్టీ పనులన్నీ సుమాయాసంగా జరిగిపోతాయి. ఉత్తర 1వ పాదం వారికి మిత్ర తార అయింది కాబట్టి చాలా పనులు చక్కగా నెరవేరుతాయి.
పరిహారం :- మీరు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామి పూజ ఆంజనేయ స్వామి పూజ చేయండి. కేతు గ్రహానికి ప్రీతికరంగా ఉలవలు దానం విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తాయి.
కన్యా రాశి :- ఈ రాశి వారికి సౌఖ్యము ధనలాభం కొద్దిపాటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక్క శుక్రుడు తప్ప సుమారుగా అన్ని గ్రహములు ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. ఈ వారంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సంపద గురించి పిల్లల గురించి ఏ విధమైనటువంటి ఆలోచనలు ఆదాయం లేకపోవడం ఉన్న ఆదాయం కూడా అనవసరంగా ఖర్చు కావడం. తిన్న తిండి ఒంట పట్టకపోవడం మానసికంగా ఇబ్బంది ఎవరు కూడా మీతో సంప్రదించడం లేకపోవడం కావలసినటువంటి మిత్రులందరి సహకారం కూడా సకాలంలో పొందలేక పోవడం ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధ పెడతాయి. కుటుంబంలో కూడా మీకు కాస్త ప్రతి పనిలోనూ వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాతావరణం ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ కోపం పెరుగుతుంది. శత్రుత్వాన్ని మీరు ఎక్కువ పెంచుకుంటారు. చిక్కులు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. గౌరవం భంగం కూడా ఉంది. మీరు సొంత కాళ్లపై నిలబడ్డ గా ప్రయత్నం చేస్తే చాలా మంచిది. మీకు ఈ వారంలో 18 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. మీ జాతకరీత్యా ఇంకా పూర్తిగా చూపించుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర 2 3 4 పాదాలు వారికి మిత్రతార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. హస్తా నక్షత్ర జాతకులకు నైధనతార కూడా అయి ఉండడం వల్ల ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు సాధన తార అయి ఉండడం వల్ల ఉండడం వల్ల శుభ ఫలితాలు కార్యసాధన మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని నెరవేరుతాయి.
పరిహారం :- అష్టమ కుజ దోషం పోవడానికి సుబ్రహ్మణ్యేశ్వరుని లేదా హనుమంతుని పూజ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం లేదా గురు స్తోత్రాలు పఠించండి.
తులా రాశి :- ఈ రాశి వారికి ధనలాభము విశేష ధన యోగము సంతోషము సర్వసంపదలు గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి. కుజ గురులు మాత్రం కార్యహాని కష్టాన్ని ఆటంకాలని సూచిస్తున్నారు. శని ఏదైనా ఉదర సంబంధమైన వ్యాధిని సూచిస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు మీకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల మీరు అనుకున్న స్థాయిలోకి వెళ్ళ లేక అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కోలేక మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడతారు. ప్రతి పనిని వాయిదాని వేసుకుంటూ పోతారు. కొన్ని ఇతరుల వల్ల మీ మీద ప్రభావం పడి అవి కూడా వాయిదా పడతాయి. దానివల్ల ఎక్కువ నష్టాన్ని పొందుతారు. శుక్రగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా పని చేస్తోంది. అది మాత్రమే మీకు సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వగలదు. అష్టమ శని గనుక ఆరోగ్య విషయంలో బాగా ఉండకపోవచ్చు. ఉదర సంబంధమైన రోగం రావచ్చు. ఈ వారంలో 36 శాతం మాత్రమే శుభ ఫలితాలు వర్తిస్తాయి. ఏదైనా మీరు జాగ్రత్త వహించడం చాలా మంచిది. చిత్త 3 4 పాదాలు వారికి సాధన తార అయింది అన్ని పనులు సమకూరుతాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార ఉంది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ 1 2 3 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి శుభఫలితాలు వల్ల అన్ని మంచిగా నెరవేరుతాయి.
పరిహారం :- సోమవారం నాడు తండ్రిగారి పేరుతో భరణి మహాలయం కనుక బ్రాహ్మణులకు అన్న వస్త్రాలు దానం చేయండి. అర్ధాష్టమ శని దోష నివారణకు జపము నల్లని వస్త్రములు నల్ల నువ్వులు నూనె దానం చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.
వృశ్చిక రాశి :-ఈ రాశివారికి ఈ వారంలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. కార్య జయము ధనలాభము ఆనందము అభివృద్ధి అన్నీ ఒకదానికి ఒకటి తోడై వీరిని ఉక్కిరి బిక్కిరి చేసి మహానంద భరితులను చేస్తాయి. సుమారుగా అన్ని గ్రహాల అనుకూలతని వీరు పొందుతున్నారు. కేతువు అకారణ కలహాలను సృష్టిస్తాడు. రాహువు ఏదైనా వస్తువును కనిపించకుండా చేస్తాడు. అలాగే వారాంతాల్లో చంద్రుడు అనారోగ్యాన్ని సూచిస్తాడు. కుజుడు రావలసిన బాకీలు వసూలు చేస్తాడు. బుధుడు మానసిక శారీరక ఆనందం ఇస్తాడు. గురుడు మీకు ఆకస్మిక ధనలాభం చేకూరుస్తాడు. శుక్రుడు స్థిరాస్తిని వృద్ధి చేయడానికి దోహదపడతాడు. శని కూడా ధనలాభం ఇవ్వనున్నాడు. మాట విషయంలో కట్టుబాట్లను పాటించండి. మీకు మీరే కార్యాచరణకు దిగకపోయినా ఏదో ఒక రకంగా అయినా మీరు ఈ వారంలో చేపట్టిన కార్యక్రమాలు శుభప్రదంగా నెరవేరిపోతాయి. మీ గౌరవానికి ఉన్నతికి ఎక్కువ అవకాశాలు కలిగి వారం ఇది. మీరు ఈ వారంలో 72 శాతం శుభ ఫలితాలను పొందుతున్నారు. విశాఖ 4వ పాదం వారికి క్షేమ తార అయింది ఫలితాలు బాగున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. జ్యేష్ట నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి ధనాదాయం బాగా ఉన్నది.
పరిహారం :- రాహు కేతువులకు సర్ప సూక్త పారాయణ చేయించండి. చంద్రునకు ప్రీతి కోసం పెరుగులో వెండి చంద్రబింబం వేసి కంచు పాత్రతో దానం చేయండి. మీకు గురువారం బాగా కలిసొస్తుంది.
ధను రాశి :- ఈ రాశి వారికి ఈ లోకంలో ఉన్న కష్టాలన్నీ తమకే వచ్చినట్లుగా అనిపిస్తుంది. వీరు మొదటి నుంచి ఏ హెచ్చరికల్ని పాటించకపోవడం ఈనాడు వీరి ఆరోగ్యానికి కూడా భంగం వాటిల్లుతుంది. చాలా విషయాల్లో మనకి ఏం కాదులే అనేటువంటి భావన మీకు ఎక్కువగా నెలకొంది. దాని వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ప్రతి పని కూడా ప్రతికూలం గానే ఉంటుంది. మీరు సుదీర్ఘంగా ఆలోచిస్తారు కానీ ఏ పనులు చేయలేక పోతున్న స్థితి ఇప్పుడు నెలకొన్నది. దీనికి కారణం జాతకరీత్యా ద్వితీయ ముందున్న శని ప్రభావము ఎక్కువగా చూపిస్తుంది. మీరు ఆర్థికంగా ఇబ్బందులు కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో మీరు భార్య ద్వారా మాత్రమే సంతోషాన్ని పొందగలుగుతారు ఆమె మాటలు వింటే కొంతవరకైనా మీ పనులు నెరవేరుతాయి. మీరు స్థలం మారే అవకాశం కనిపిస్తోంది. దానికి కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు సరిఅయిన స్థలాన్ని నిర్ణయించుకోవడం మంచిది. మూలా నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఫలితాలు అనారోగ్యాన్ని సూచిస్తున్నాయి. పూర్వాషాడ నక్షత్రం జాతకులకు పరమమిత్ర తార అయింది చాలా బాగుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఫలితాలు ఉన్నాయి.
పరిహారం:- శనికి జపం చేయించండి నువ్వులు నల్లని వస్త్రము నూనెతో అభిషేకము చేయించండి రుద్రాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది హనుమాన్ చాలీసా లేదా సహస్రనామ పూజ తమలపాకుల పూజ చేయించండి మంచి ఫలితాలనిస్తాయి.
మకర రాశి :- ఈ రాశి వారికి ప్రతికూలతలు ఒక్కసారి ఊహించని స్థితిలో ఉన్నాయి. శత్రు పీడ అనారోగ్యము ధననష్టము అనుకోని విపత్తులు అన్ని చుట్టుముట్టాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇంట్లో వయస్సు మళ్ళిన వారు ఉన్నట్లయితే వారికి అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. ప్రతి ఒక్కరితోనూ మాట పట్టింపు లాగా అయిపోతుంది. శత్రువుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మనోనిగ్రహము శారీరక దారుఢ్యం కూడా లేకపోవడం వల్ల చాలా కష్టంగా పనులన్నీ సొంతంగా చేసుకోవలసి ఉంటుంది. అనేక రకాల అయినటువంటి అపకీర్తిని కూడా పొందే అవకాశం ఉంది. ఆకస్మికంగా అనారోగ్యము ఆకస్మికంగా ఏదైనా వాహనం విపత్తులు ఉన్నాయి. కాబట్టి మీరు వాహనాలు నడిపేటప్పుడు గాని వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి. ఎత్తయిన ప్రదేశాల్లో సంచరించే టప్పుడు ముఖ్యంగా జాగ్రత్త వహించండి. పడిపోయే అవకాశం అడుగు తడబడి ఎడమభాగం దెబ్బతినే అవకాశం ఉన్నది. మీ జాతకంలో బాగున్నట్లు అయితే మీకు ఈ గోచారము కొంత బాగుంటుంది. జాతకం కూడా బాగా లేని వారికి మీ గోచారం కచ్చితంగా ఇలాంటి ఫలితాలను ఇస్తుంది. ఈవారం మీకు 18 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి మిత్ర తార మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. శ్రవణ నక్షత్ర జాతకులకు నైధనతార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి సాధన తార అయింది కాబట్టి మంచి ఫలితాలు పొందగలరు.
పరిహారము :- శని గ్రహానికి అభిషేకము గాని నువ్వులు నల్ల వస్త్రం దానం చేయడం గాని మంచిది. నిరంతరము శివుని ధ్యానం చండీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
కుంభ రాశి :- ఈ రాశి వారికి విశేష ఫలితాలు ధనలాభము ఇష్టాపూర్తి ఇవి ఆనందాన్ని కలిగించి ముందుకు నడిపిస్తాయి. రవి చంద్ర శుక్ర శనులు మీరు వ్యతిరేకంగా ఉన్నారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అపకీర్తి అనేది వీరికి ఈ వారంలో సంప్రాప్తించును. కార్యహాని అది కూడా ఉంది. అధిక ధనాదాయం ఉంటుంది. కానీ విశేష ప్రయత్నం చేసిన తర్వాతనే పొందగలుగుతున్నారు. చంద్రుడు అనారోగ్య కారకుడు. మీకు ఆ కారణం చేత ధనాన్ని ఖర్చు చేయిస్తాడు. బుధుడు మీరు ఏమి అనుకుంటే అవి చేయడానికి అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలను ఇస్తాడు. శని నీ 12 వ ఇంటిలో ఉన్నాడు గనుక అతని ద్వారా మీరు చాలా ధనాన్ని ఆరోగ్యానికి ఖర్చు చేయిస్తాడు. మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీ జాగ్రత్త కోసం చెప్పడం మాత్రమే. మీకు ఈ వారంలో 45 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి సాధన తార అయింది పనులు అన్ని నెరవేరుతాయి. శతభిషా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు.
పరిహారం :- రవికి జపం . సూర్యనమస్కారాలు చేయండి. చంద్రునకు తెల్లని వస్త్రములు బియ్యము దానం చేయండి. సోమవారం శివునకు అభిషేకం బిల్వదళాలతో పూజ చేయండి.
మీన రాశి :- ఈ రాశి వారికి ధన లాభము బంధుమిత్రుల దర్శనము విశిష్టంగా ఉండి మంచి ఫలితాలను ఇస్తాయి. చంద్ర కుజుల యొక్క స్థితి బాగో లేదు కాబట్టి అనారోగ్యంతో పాటు కొంత ఇబ్బంది కూడా కలుగజేస్తారు. బుధుడు శుక్రుడు శని మీకు ఆకర్షిత ధనలాభము బంధుమిత్ర దర్శనం సూచిస్తున్నాయి అవి మీకు మంచిని చేశాడు గనుక సాగిపోతుంది గురుడు మీకు రాజ్యంలో ఉన్నప్పటికీ కేతువుతో కలిసి ఉన్నందువల్ల మాత్రమే మీకు మంచి ఫలితాలని ఇవ్వ లేకపోతున్నాడు. ద్వితీయ కుజ ప్రభావం కూడా ఉంది. రాహు కేతువు ల ప్రభావం చేత మీకు అన్ని పనులు వాయిదాలు పడుతూ ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. మీ పనులకు మీరు ప్రయత్నం చేసినట్లు అయితే కొంత వరకు నెరవేరే అవకాశం ఉంది. వారం మధ్యలో మీరు అనుకోకుండా కొంత ధనాన్ని పొందే అవకాశం ఉంది బంధు మిత్రులను కలుసుకుని కూడా ఆనందాన్ని పంచుకుంటారు. మీకు ఈ వారంలో 45 శాతం మాత్రమే శుభ ఫలితాలను పొందగలిగి ఉన్నారు. పూర్వాభాద్ర 4వ పాదం వారికి క్షేమ తార అయింది కాబట్టి మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. ఉత్తరాభాద్ర వారికి విపత్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు సంపత్ తార అయింది కాబట్టి మంచి ఫలితాలని పొందగలుగుతారు.
పరిహారం :- కుజునకు మంగళవారం నియమాలు పాటించండి సుబ్రహ్మణ్య పూజ చేయండి. గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రం గురు స్తోత్రం గురుచరిత్ర పఠించండి మంచిది.