రాయ్ ల‌క్ష్మీ ఇంట విషాదం.. క్ష‌మించు నాన్న అంటూ..

By సుభాష్  Published on  8 Nov 2020 5:57 AM GMT
రాయ్ ల‌క్ష్మీ ఇంట విషాదం.. క్ష‌మించు నాన్న అంటూ..

టాలీవుడ్ హీరోయిన్ రాయ్ ల‌క్ష్మీ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి రామ్ రాయ్ క‌న్నుమూశారు. తన తండ్రి‌‌ని బతికించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ లక్ష్మీ సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అందరినీ కదిలించి వేస్తోంది. త‌న తండ్రిని కాపాడుకోలేక‌పోయాన‌ని, చాలా బాధ‌గా ఉంద‌ని చెప్పింది. త‌న‌ను క్ష‌మించాల‌ని త‌న తండ్రిని కోరింది. త‌న తండ్రిని చాలా మిస్ అవుతున్నాన‌ని, ఆయ‌న గుండె ఆగిపోయింద‌న్న విష‌యం చాలా బాధ క‌లిగిస్తోంద‌ని చెప్పింది.

'డాడీ ఐ మిస్ యూ.. నేను ఈ బాధను అధిగమించలేను కాని నేను ఈ లోటుతో జీవించడానికి ప్రయత్నిస్తాను. మీరు నన్ను ప్రేమించినట్లు ఇంకెవ్వరూ ప్రేమించలేదు. మా నాన్న ఇకలేరనే ఊహే గుండె ముక్కలయ్యేలా చేస్తోందని.. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనెంతో ప్రయత్నించాను కానీ రక్షించుకోలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి నాన్నా. అంతా బాగానే ఉంది అని చెప్పడానికి పక్కనే మీరు ఉంటే బాగుండేదని నా మనసు చెబుతోంది. మీరే నా వెన్నెముక, జీవితంలో నాకు ఏం కావాలన్నా ఇచ్చారు. నేను మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం. నేనెప్పుడూ స్వేచ్ఛగా, దృఢంగా ఉండాలని మీరు ఎందుకు కోరుకునేవారో ఇప్పుడు అర్థమైంది.

ఏదో ఒక రోజు మీరులేని లోటును నేను భరించాలని, తట్టుకోవాలని అలా చెప్పేవారు. ఇప్పుడు మీరు ఏ బాధలేని ప్రశాంతమైన చోటులో ఉన్నారని నా మైండ్‌కు తెలుసు. దీన్ని నా మనసుకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. మీరు పై నుంచి నన్ను ఆశీర్వదిస్తారని, ముందుకు నడిపిస్తారని నాకు తెలుసు. మా నాన్న ఎప్పుడూ మాతోనే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని మేం ఎంతో మిస్‌ అవుతున్నాం. ఐ లవ్‌ యూ.. 'అని అంటూ లక్ష్మీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

'కాంచన మాల కేబుల్ టీవీ' సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది రాయ్‌ల‌క్ష్మీ. ఆ తర్వాత అడపా దడపా చాలా సినిమాల్లో కనిపించింది. ఇటీవల 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ' అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సౌత్ లోని పలు భాషలలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. అందులో భాగంగా 'ఝాన్సీ ఐపిఎస్' అనే కన్నడ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో పోలీస్ రోల్ చేస్తుంది. దీనికి తోడు 'సిండ్రెల్లా' అనే తమిళ హారర్ మూవీలో నటిస్తోంది.

Next Story