మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి: సీఎం కేసీఆర్‌

By సుభాష్  Published on  8 Sep 2020 7:33 AM GMT
మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి: సీఎం కేసీఆర్‌

దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు రోజు కొనసాగాయి. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని, తెలంగాణ ముద్దబిడ్డ పీవీ మన ఠీవి అని కొనియాడారు. ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదని అన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేసీఆర్‌ సభలో గుర్తు చేశారు.

గ్లోబల్‌ ఇండియా నిర్మాత పీవీ నరసింహారావు అని, దేశంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధాని అయ్యారన్నారు. ప్రధాని ఉన్న సమయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని, మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రి చేసిన ఘటన పీవీదేనని అన్నారు. భూ సంస్కరణలకు పీవీనే నాంది పలికారని పేర్కొన్నారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడారు. హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. అయితే పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. యుద్ధంలో గెలిచిన వారే చరిత్రను రాస్తారని, పీవీ స్థాయికి తగిన విధంగా భారత ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

ఇదీ చదవండి: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌: పరీక్షలు రాయకుండానే పాస్‌..!

Next Story