సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరండి.. లేదంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 11:59 AM GMT
సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరండి.. లేదంటే..

ఆర్టీసీ కార్మికుల స‌మ్మెపై ర‌వాణ శాఖ‌ మంత్రి పువ్వాడ అజ‌య్ స్పందించారు. శనివారం సాయంత్రం 6 గంటలలోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కారని హెచ్చ‌రిక‌లు జారీచేశారు. భవిష్యత్తులో కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని అన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

ప్రభుత్వం పరిశీలీస్తున్న మూడు ప్రత్యామ్నాయాలు

1. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం

2. ఆర్టీసీ బస్సులు నడపడానికి డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యథావిధిగా నడపడం

3. ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వడం

శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తుంది. ఆదివారం ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్షను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సమీక్షలోనే ఆర్టీసీకి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ సమ్మె ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రకటన విడుదల చేశారు.

Next Story