పూరి ఈజ్ గ్రేట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 8:25 AM GMT
పూరి ఈజ్ గ్రేట్..!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తో తెర‌కెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే... సెప్టెంబ‌ర్ 28న పూరి జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా పూరి... ఓ మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఇంత‌కు పూరి.. పుట్టిన‌రోజు నాడు ఏం చేస్తున్నారో.. ఆయ‌న మాట‌ల్లోనే...

సినిమాతో మ‌మేక‌మైవుండే ప్ర‌తి ఒక్క‌రిపైన మాకు అపార‌మైన గౌర‌వం ఉంది. సినిమా అన్న‌ది వ్యాపార‌మే అయినా.. డ‌బ్బులు పెట్టే నిర్మాత కూడా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌నే న‌మ్ముతాడు. ద‌ర్శ‌కుడి మేథ‌స్సు, సృజ‌నాత్మ‌క‌త అవిశ్రాత‌మైన శ్ర‌మ‌కు ప్ర‌తిరూపం సినిమా. ఒక ద‌ర్శ‌కుడికి సినిమా అవ‌కాశం వ‌స్తే... ఎంతో మందికి ప‌ని దొరుకుతుంది. అందుకే ద‌ర్శ‌కులు , ద‌ర్శ‌క‌త్వశాఖ బాగుండాల‌ని కోరుకుంటున్నాం.

Image result for ismart shankar blockbuster poster

విజ‌యాలు, అప‌జ‌యాలు స‌హ‌జం. అయినా... సినిమానే న‌మ్ముకుని మ‌న‌దైన రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ద‌ర్శ‌క‌త్వశాఖ‌లోని మ‌న‌వాళ్లు కొంద‌రు పనిలేక‌, సినిమాలు చేసే అవ‌కాశం రాక‌ ఎదురుచూస్తున్నారు. వారిని చూస్తుంటే బాధ అనిపిస్తోంది. అందరూ బాగుండాలని ప్రార్ధిస్తుంటాం. అందులో భాగంగానే..కొంతలో కొంతైనా ఆర్ధిక సహాయం చేయాలనిపించింది.

'ఇస్మార్ట్ శంక‌ర్' సినిమా అద్భుత విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాల‌నిపించింది. ఒక‌ప్పుడు సినిమాలు చేసి.. ప్ర‌స్తుతం ప‌ని లేక ఖాళీగా ఉండి ..త‌మ జీవితాల‌ను సినిమాకి అంకితం చేసిన డైరెక్ట‌ర్స్ & కో - డైరెక్ట‌ర్స్ 20 మందికి ఆర్ధిక స‌హాయం చేయాల‌నుకుంటున్నాం. ప్రేమ‌తో అంగీక‌రించండి. ఇదేమీ పెద్ద స‌హాయం కాదు. చిన్న చిరున‌వ్వు లాంటి ప‌ల‌క‌రింపు అంతే..!

Related image

మా ఈ చిన్న స‌హాయం మీకు ఏమాత్రం ఊర‌ట‌నిచ్చినా చాలు. అది మా ప్ర‌య‌త్నానికి ఆశీస్సులుగా భావిస్తాం. మేము త‌ల‌పెట్టే ఇలాంటి ఓ మంచి కార్య‌క్ర‌మానికి మీ అంద‌రినీ ఆహ్వానిస్తున్నాం. మేము బ్ర‌తికి ఉన్నంత కాలం ఇదే విధంగా దేవుడు శ‌క్తిని ఇచ్చిన‌ట్లు అయితే... మేము ప్ర‌తి సంవ‌త్స‌రం ఇలాగే స‌హాయం చేయాల‌ని అనుకుంటున్నాం అని పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి లేఖలో తెలియ‌చేసారు.

డ‌బ్బు చాలా మంది ద‌గ్గ‌ర ఉండ‌వ‌చ్చు కాని... చేత‌నైనంత స‌హాయం చేయాల‌నే మంచి మ‌న‌సు మాత్రం కొంద‌రికే ఉంటుంది. త‌న సినిమాల‌తోనే కాకుండా... ఇలా మంచి ప‌ని చేస్తూ... డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అందుకే... పూరి ఈజ్ గ్రేట్.!

Next Story